ఓటెయ్యలేకపోతున్న వలసకార్మికులు

Unable to defeat migrant workers– కొన్నేండ్లుగా తమ హక్కును వినియోగించుకోలేని పరిస్థితి
– ఎన్నికల పండుగకు దూరంగా లక్షలాది మంది కార్మికులు
– ఆర్థిక అవసరాలే కారణం
– ఇదో సంక్లిష్ట సమస్య.. ఈసీ ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి
– మేధావులు, నిపుణుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్నది. అన్ని వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ నాయకులను ఎన్నుకుంటున్నారు. కానీ, దేశంలోని వలసకార్మికుల విషయంలో మాత్రం ఓటు హక్కు వినియోగం జరగటం లేదు. తన స్వంత ఇంటికివేలాది కిలోమీటర్ల దూరానికి వచ్చి, తాత్కాలికంగా నివాసం ఉంటూ, పూట గడవటం కోసం శ్రమకోర్చే వలసకార్మికులు ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వలసకార్మికులు స్వంత ఇండ్లకు వెళ్లలేక ఎన్నికల పండుగలో భాగం కాలేకపోతున్నారు. ఈ సమస్య ఇప్పటి నుంచే కాదనీ, ఏండ్లుగా ఇది కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ” నేను పని వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లాను. నాది బీహార్‌లోని అరారియా. ఇంటిని వదిలి వెళ్లిన తర్వాత నేను 25 ఏండ్లలో ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు” అని 51 ఏండ్ల వలస వ్యవసాయ కూలీ జబ్బర్‌ ఖాన్‌ అన్నాడు. జబ్బార్‌ ఖాన్‌ లాంటి వలసకార్మికులు లక్షలాది మంది ఇలాగే ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని వారు సూచిస్తున్నారు.
దేశ అభివృద్ధిలో కీలకమైన కార్మిక వర్గం మొత్తం ఎన్నికలలో పాల్గొనటం ఒక సంక్లిష్ట సమస్యగా మిగిలిపోయిందని మేధావులు అంటున్నారు.” చాలా మంది కార్మికులు తమ రోజువారీ వేతనాల ఖర్చుతో ఓటు వేయటానికి ఇష్టపడరు. కాబట్టి ఆర్థిక అవసరాలు తరచుగా పౌర విధులను అధిగమిస్తాయి” అని పాటియాలాకు చెందిన కార్మిక హక్కుల కార్యకర్త విజరు వాలియా అన్నారు. తన ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఇంటికి తిరిగి వెళ్లటానికయ్యే ఖర్చు వలసకార్మికుడు భరించలేడనీ, ఇందుకు ఆర్థిక పరిస్థితులతో పాటు సమయాభావమూ ముఖ్యమైన కారణమని కార్మిక నాయకులు చెప్తున్నారు. ”ఎన్నికల కంటే మా కుటుంబాన్ని పోషించటం ముఖ్యం. మేము పనిని వదిలి వెళ్లలేము” అని బీహార్‌లోని అరారియా జిల్లా సైద్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తుల బృందంలో ఒకడైన జబ్బార్‌ తెలిపాడు.
అయితే, కొన్ని పరిశోధనల ప్రకారం.. ఈ సమస్య కేవలం వ్యవసాయ కూలీలకే పరిమితం కాదు. కూరగాయలు, ధాన్యం మార్కెట్లలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు, వివిధ ప్రయివేటు, ప్రభుత్వ రంగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది ప్రజలు కూడా ఓటు వేయటానికి వారి స్వస్థలాలకు తిరిగి రావటానికి కష్టపడుతున్నారు. చాలా మంది కార్మికులు తమ ఓటు హక్కును ప్రస్తుత పని ప్రదేశాలకు బదిలీ చేసుకోలేదు. బీహార్‌, యూపీల నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు నివాసితులు అత్యధికంగా వలస వెళ్లారని ఎన్నికల గణాంకాలతో వెల్లడైంది.
2011 జనాభా లెక్కల ప్రకారం.. భారత్‌లో 4.14 కోట్ల మంది అంతర్‌-రాష్ట్ర వలస కార్మికులు ఉన్నారు. ఇందులో 30 లక్షల మందికి పైగా యూపీ నుంచే ఉండటం గమనార్హం. 2020-21 సర్వే ప్రకారం.. 1.23 కోట్ల మంది అంతర్‌-రాష్ట్ర వలసదారులు, 5.2 కోట్ల మంది అంతర్గత వలసదారులు ఉంటే ఇందులోనూ యూపీ నుంచే అధిక వాటా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో దేశ వ్యాప్తంగా 29.6 కోట్ల మంది అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. వీరిలో దాదాపు 50 శాతం మంది కార్మికులు వారి స్వస్థలాలకు దూరంగా ఉపాధి పొందుతున్నారు. ఇది దేశంలోనే అత్యధికంగా యూపీలో 8.34 కోట్ల మంది కార్మికులను నమోదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 41.4 కోట్ల మంది అంతర్‌-రాష్ట్ర వలస కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ, వారి జనాభాపై తాజా గణాంకాలు లేవు. కానీ అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ఈ సంఖ్యను 45 కోట్లుగా పేర్కొన్నది. ఇది 2030 నాటికి 50 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.
రాజకీయ పరిశీలకుడు, రాజకీయ శాస్త్ర రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రామ్‌జీ లాల్‌ మాట్లాడుతూ.. ”లక్షలాది మంది వలస కార్మికుల ఓటు హక్కును కోల్పోవడం భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక స్పష్టమైన సమస్య. ఎన్నికలలో పాల్గొనటం కంటే ఆర్థికపరమైన ఆవశ్యకతలు ప్రాధాన్యతను సంతరించుకున్నందున.. ఈ కార్మికులు ఓటు వేయకుండా నిరోధించే వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించడం చాలా కీలకం” అని చెప్పారు. తమ నివాస స్థలం నుంచి ఓటు వేసేందుకు ప్రత్యేక హక్కులు ఉన్న కాశ్మీరీ వలసదారుల నమూనాలపై.. వలసదారులు ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love