ఎదురులేని ఢిల్లీ

Delhi Capitals– 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలుపు
– ఛేదనలో కెఎల్‌ రాహుల్‌ ధనాధన్‌
– బెంగళూర్‌ 163/7, ఢిల్లీ 169/4
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు లేదు. ఐపీఎల్‌18లో క్యాపిటల్స్‌ వరుసగా నాల్గో మ్యాచ్‌లో విజయం సాధించి, అజేయ జోరు కొనసాగిస్తోంది. కెఎల్‌ రాహుల్‌ (93 నాటౌట్‌), స్టబ్స్‌ (38 నాటౌట్‌) మెరుపులతో 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.5 ఓవర్లలోనే ముగించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు చిన్నస్వామిలో ఇది వరుసగా రెండో ఓటమి.
నవతెలంగాణ-బెంగళూర్‌
కెఎల్‌ రాహుల్‌ (93 నాటౌట్‌, 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగిన కెఎల్‌ రాహుల్‌ అదరగొట్టాడు. పవర్‌ప్లేలోనే డుప్లెసిస్‌ (2), జేక్‌ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (7), అభిషేక్‌ పోరెల్‌ (7) సహా కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (15) ఆరంభంలోనే అవుటయ్యారు. 58/4తో ఒత్తిడిలో కూరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెఎల్‌ రాహుల్‌ ఒక్కడై ఆదుకున్నాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (38 నాటౌట్‌, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) జతగా ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు షాక్‌ ఇచ్చాడు. 55 బంతుల్లోనే 111 పరుగులు పిండుకున్న రాహుల్‌, స్టబ్స్‌ మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. మిడిల్‌ ఓవర్లలో బెంగళూర్‌ బౌలర్లు లయ తప్పటంతో.. రాహుల్‌, స్టబ్స్‌ స్వేచ్ఛగా ఆడారు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన రాహుల్‌… ఆ తర్వాత టాప్‌ గేర్‌లోకి వచ్చాడు. మరో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో స్టబ్స్‌ సైతం చక్కటి సహకారం అందించాడు. దీంతో 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌18లో నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నాల్గో విజయం కాగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన కెఎల్‌ రాహుల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
కుల్దీప్‌ మాయజాలం :
తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూర్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులే చేసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (2/17) మాయ చేయగా.. విప్‌రాజ్‌ (2/18), మోహిత్‌ శర్మ (1/10) రాణించారు. టాప్‌ ఆర్డర్‌లో ఫిల్‌ సాల్ట్‌ (37), విరాట్‌ కోహ్లి (22) ధనాధన్‌ ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత ఆర్‌సీబీ దూకుడు తగ్గింది. పడిక్కల్‌ (1), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (3) నిరాశపరిచారు. పాటిదార్‌ (25), కృనాల్‌ (18) సహా టిమ్‌ డెవిడ్‌ (37 నాటౌట్‌) రాణించటంతో బెంగళూర్‌ 163 పరుగులైనా చేయగల్గింది.
IPL

Spread the love