మండల స్థాయి ప్రజావాణికి అనూహ్య స్పందన

– మొదటిసారి నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 1706 దరఖాస్తులు 
– మండల స్థాయి టీం ఫిర్యాదుల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి
– ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
– రాబోయే రోజుల్లో ప్రజావాణిని మరింత పట్టిష్ట పరుస్తాం
– జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ నల్గొండ-కలెక్టరేట్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మొదటిసారిగా మండలాలలో పూర్తిస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని, జిల్లా స్థాయి వరకు ఫిర్యాదుదారులు రాకూడదన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి  కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నూతన పంథాలో ఆలోచించి మండల స్థాయి ప్రజావాణి కి ప్రాధాన్యత ఇస్తూ ఇకపై ప్రతి సోమవారం మండలాలలో జిల్లాలో మాదిరిగానే ప్రజావాణి నిర్వహించాలని గత వారం రోజులుగా చేస్తున్న కసరత్తు ఫలించింది. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులను, మండలాల ప్రత్యేక అధికారులుగా  నియమించడమే కాకుండా, ప్రజావాణి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ, ప్రజావాణి కార్యక్రమం ఎలా నిర్వహించాలో ముందే శిక్షణ ఇస్తూ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.మొదటి రోజే జిల్లా వ్యాప్తంగా 33 మండలాలలో సుమారు 1706 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి బృందాలు స్వీకరించడం జరిగింది.  సోమవారం సాయంత్రం ఆయన  జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణిపై అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై  అన్ని సోమవారాలు మండలాలలో ఇలాగే  ప్రజావాణి కార్యక్రమం జరగాలని, ప్రత్యేకించి సమస్యల పరిష్కారం పైనే మండల స్థాయి బృందాలు దృష్టి సారించాలని, ఏ ఒక్క దరఖాస్తు జిల్లా స్థాయికి నేరుగా రావద్దని, మండలానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే  నమ్మకం ప్రజల్లో కల్పించాలని, ఇందుకు మండల స్థాయి బృందాలు సక్రమంగా పనిచేయాలని అన్నారు. దరఖాస్తులు తక్కువ వచ్చిన చోట విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. సోమవారం ఉదయం ప్రజావాణి తర్వాత సాయంత్రం గ్రామపంచాయతీ కార్యదర్శులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్నారు. ఈ  వారం వచ్చిన ఫిర్యాదులన్నింటిని వారంలోపు అంటే శనివారంలోగా పరిష్కరించాలని, ఆన్లైన్లో సైతం వాటి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను తీసుకోవాలని, గ్రామపంచాయతీల వారిగా ఆయా పథకాల కింద అర్హత ఉండే దరఖాస్తులను తీసుకొని ఒక రిజిస్టర్ ను నిర్వహించి ఒక ఫైల్ ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి ఆయా పథకాల కింద లబ్ధిని ప్రకటించిన వెంటనే లబ్ధిదారుకు వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని, మండల స్థాయిలో గ్రామాల వారిగా ప్రజావాణి దరఖాస్తులను నిర్వహించాలని  చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం పై గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు, అందరికీ అవగాహన కలిగే విధంగా ఆయా పథకాల కింద అన్ని శాఖలకు సంబంధించి తెలుగులో సర్కులర్లను జారీ చేస్తామని, వారంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సర్క్యులర్లో గ్రామస్థాయిలో సిబ్బంది నిర్వహించే విధులు, బాధ్యతలపై స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే జీవోలు, ఇతర సర్కులర్ ల తో పాటు, మీ సేవలో దరఖాస్తు చేసే వివిధ రకాల అంశాలను సైతం తెలుగులో గ్రామస్థాయి వరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, తద్వారా గ్రామస్థాయి యంత్రం గాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు అందాల్సిన సేవలు మండల స్థాయిలో అందాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గ్రామస్థాయి సిబ్బందిని అన్ని విషయాల పట్ల అవగాహనతో పాటు, అన్ని పనులు నిర్వహించేందుకు సమాయత్తం చేయాలని, ప్రత్యేకించి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ, ఆశ, హెడ్మాస్టర్, ఉపాధి హామీ, ఐకెపి గ్రామైక్య సంఘాలు, ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ వంటి ముఖ్యమైన ఏడు శాఖల సిబ్బంది ఒక బృందంలా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ ఏడు మంది తోపాటు, గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని చైతన్యం చేసేందుకు మండల స్థాయి బృందాలు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.
రోజువారి పనులకు ఆటంకం కలిగించవద్దు..
గ్రామాలలో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేసేలా చూడాలని, ప్రత్యేకించి గ్రామస్థాయిలో తాగునీరు, పారిశుధ్యం, పాఠశాల విద్య, అంగన్వాడి వంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహించిన లేదా రోజు వారి కార్యక్రమాల్లో అలసత్వం ప్రతిస్తే ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీ ద్వారా ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ధరణిపై పంచాయతీ కార్యదర్శిలకు అవగాహన కల్పించేందుకు భూముల సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపై తెలుగులో సర్కులర్ ను పంపిస్తామని, ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామని, ధరణిలో 34  మాడ్యూల్స్ ద్వారా రికార్డులను సరి చేసే అవకాశం ఇప్పుడు వచ్చినందున అన్ని అంశాలపై పూర్తిగా తెలుసుకొని ఉండాల్సిన అవసరం పంచాయతీ కార్యదర్శులపై ఉందని అన్నారు. ఆయా సమస్య ఆధారంగా  మాడ్యూల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే విధంగా తెలిసి ఉండాలని అన్నారు. విద్యుత్ పై అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నందున వారం రోజుల్లో విద్యుత్ కు సంబంధించిన లూజ్ వైర్లను, లో వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్ కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు చేపట్టినచోట అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని, పది రోజుల్లో ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత వారం వచ్చిన ఫిర్యాదులను వచ్చేవారం ప్రజావాణిలో ముందుగా చర్చించి ఆ అనుభవం ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలపై సైతం మండల స్థాయి బృందం స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అలాగే ప్రజావాణికి సంబంధించి అన్ని మండలాలలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని, ప్రజావాణి నిర్వహించే చోట హెల్ప్  డేస్కులను ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారులకు దరఖాస్తులను రాసిచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, జెడ్పి సీఈవో జిల్లా స్థాయి ప్రజావాణి  ప్రత్యేక అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, నోడల్ అధికారి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ ముసాక్ అహ్మద్, డిఈఓ బిక్షపతి, తదితరులు హాజరయ్యారు.
Spread the love