ఏకరూపత వర్సెస్‌ సమాన హక్కులు

మహిళాహక్కుల కోసం సామాజిక సంస్కరణోద్యమాలు, పురుషుల ఏకరూపతా ప్రత్యేకతపై చారిత్రక పోరాటాలు చేశాయి. ప్రతీ అడుగు నిర్దిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సందర్భంలోనే ముందుకు పడుతూ వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్రభారతంలో, మహిళా హక్కుల కోసం తయారైన చట్టపరమైన చట్రం (బాగా మెరుగైనప్పటికీ కూడా) ఇప్పటికీ వివక్షతలు, పక్షపాతాలు, సాంస్కృతిక పక్షపాతాలతో నిండిపోయింది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అయితే 2023 భారతదేశంలో ఈ లక్ష్యాన్ని సాధించే మంచి మార్గం ఏమిటనేదే ప్రశ్న.
ఒకే దేశం, ఒకే చట్టమనే నినాదంతో మోడీ ప్రభుత్వం ఏకరూప పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌)ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం ఉన్న ప్రస్తుత సందర్భంలో ఒకే చట్టం, లింగ న్యాయంతో సమానం కాదు. అన్ని వర్గాల మహిళలందరికీ సమాన హక్కులు సాధించే లక్ష్యాన్ని చేరే ద్విముఖ వ్యూహాన్ని, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సమర్థిస్తుంది. మొదటిది, అన్ని వర్గాల మహిళలకు వర్తించే విధంగా ప్రస్తుతం ఉన్న లౌకిక చట్టాల్ని బలోపేతం చేసి, విస్తరించడం. రెండోది, అన్ని వర్గాల వారికి వ్యక్తిగత, ఆచార చట్టాల్లో సంస్కరణల ఉద్యమం ముందుకు సాగేందుకు ఆయా వర్గాల పురుష, మహిళా ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి. ఇది హిందూ స్త్రీ, పురుషులు, ముస్లిం స్త్రీ పురుషులు, గిరిజన స్త్రీ పురుషుల మధ్య, అదేవిధంగా హిందువులు, ముస్లింలు, గిరిజనులు, పార్శీలు, క్రైస్తవులు, సిక్కుల లాంటి మతాలకు చెందిన మహిళలకు సమాన హక్కులు పొందే అవకాశం కల్పిస్తుంది.
లా కమిషన్‌ నిర్ధారణలు
2016లో జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ అధ్యక్షతన మోడీ ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను నియమించింది. ఏకరూప పౌరస్మృతి అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఆదేశించింది. ఈ ఏకరూప పౌరస్మృతి ‘అవసరమైనదీ కాదు, కోరదగినదీ’ కాదని, లా కమిషన్‌ దీనిని తిరస్కరించింది. ఈ కమిషన్‌ మొదట ప్రత్యేక వివాహ చట్టం, గృహహింస నుండి రక్షణ చట్టం లాంటి ఇతర లౌకిక చట్టాల్ని బలోపేతం చేసి, విస్తరించాలని స్పష్టమైన సిఫార్సులు చేసింది. హిందువులు, ముస్లింలు (సున్నీలు, షియాలు కూడా), క్రైస్తవులు, పార్శీలు, సిక్కులు, అనేక గిరిజన తెగలకు వర్తించే భిన్నమైన వ్యక్తిగత, ఆచార చట్టాల్ని వివరంగా అధ్యయనం చేసిన తర్వాతే వివాహం, విడాకులు, పిల్లల సంరక్షణ, దత్తత, వారసత్వం లాంటి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై కమిషన్‌ సిఫార్సులు చేసింది.
విస్తృతమైన సంప్రదింపులు జరిపి, 75,378 ప్రతిస్పందనలను స్వీకరించిన తర్వాత, అన్ని వర్గాల మహిళల సమాన హక్కుల కోసం చేసే పోరాటాల్ని ముందుకు తీసుకొనిపోయే విధంగా లా కమిషన్‌ ఓ ప్రయోజనకరమైన పథకాన్ని తెచ్చింది. ప్రస్తుత హిందూ వ్యక్తిగత చట్టాల్లో హిందూ మహిళలు ఎదుర్కొంటున్న అనేక వివక్షతలను లా కమిషన్‌ నివేదికలో స్పష్టంగా వివరించింది. 2005 సంస్కరణ తర్వాత కూడా మహిళలకు అన్యాయం చేస్తూ, కో-పార్సినరీ అనే హిందూ చట్ట భావనను రద్దు చేయాలనీ, హిందూ అవిభాజ్య కుటుంబ భావన నుండి వచ్చే పన్ను రాయితీలను కూడా రద్దు చేయాలని లా కమిషన్‌ సిఫార్సు చేసింది. ముస్లింలకు అవసరమైంది సంస్కరణ ఒక్కటేనన్న బీజేపీ కథనానికి భిన్నంగా కమిషన్‌ చేసిన సిఫార్సులను అందుకే తొక్కి పట్టారా?
ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేక చట్టం ద్వారా ”మన ముస్లిం బిడ్డలకు” సహాయపడేందుకు చర్యలు చేపట్టింది ఈ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్న మోడీ ప్రభుత్వ వాదనలు ఇబ్బందికరంగా మారాయి. ఇది అవసరంలేని మతాచారమనే కారణంతో సుప్రీంకోర్టే దానిని చట్ట విరుద్ధమైనదిగా పేర్కొన్నదని లా కమిషన్‌ నివేదికలో తెలిపింది. మోడీ ప్రభుత్వ చట్టాన్ని ప్రత్యక్షంగా విమర్శించకుండానే, గృహహింస నిరోధంపై పౌర చట్టంలోని నిబంధనల్ని వర్తింపచేయడం ద్వారా బాధిత ముస్లిం మహిళల్ని రక్షించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టం మహిళలకెలాంటి ఉపశమనం సమకూర్చక, కేవలం ముస్లిం పురుషుడిని జైలుకు మాత్రమే పంపిస్తుంది.
మోడీ ప్రభుత్వం తన ఎజెండాను అమలు చేయడానికి సంకుచిత రాజకీయ ఆలోచనల్ని చేయడం దురదృష్టకరం. 2018లో ప్రభుత్వానికి అందించిన విలువైన లా కమిషన్‌ నివేదికను తిరస్కరించి, వ్యక్తిగత చట్టసంస్కరణల కోసం ఏ ఒక్కరితోనూ సంప్రదింపులు జరపకుండా, ఒక్క చట్టం కూడా చేయకుండా ప్రభుత్వం తన రెండోదఫా పాలనాకాలాన్ని దుర్వినియోగం చేసింది. ఏకరూప పౌరస్మృతి కోసం చేసిన ప్రయత్నం 21వ లా కమిషన్‌ తిరస్కరించిన తరువాత ఎలాంటి కారణాలు లేకుండా జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్తీ అధ్యక్షతన ఏర్పాటైన 22వ లా కమిషన్‌ను ఏకరూప పౌరస్మృతి అంశాన్ని మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి, మరోసారి అభిప్రాయాలను కోరారు. ఇది కచ్చితంగా ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచి, తన బాధ్యతలు, ప్రాధాన్యతల నిర్వహణ నుండి కమిషన్‌ దృష్టిని మళ్లించడమే అవుతుంది. కానీ మోడీ ప్రభుత్వంలో ఈ అసంబద్ధత సాధ్యమే. ప్రభుత్వ ఎజెండాకు మహిళా హక్కులకు స్పష్టంగా ఎలాంటి సంబంధం లేదు, కానీ ప్రభుత్వ ప్రతీ చర్య, ప్రజల్ని విభజించి, ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఉద్దేశించబడిందే.
ఈ క్రమంలోనే అన్ని వర్గాల మహిళలందరికీ సమానత్వం కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లు, పరువు సంబంధిత నేరాల వ్యతిరేక చట్టం, వివాహ సమయంలో సృష్టించబడిన అన్ని ఆస్తుల ఉమ్మడి యాజమాన్య చట్టం, వైవాహిక లైంగికదాడిని నేరంగా పరిగణించే చట్టాల లాంటి పెండింగ్‌లో ఉన్న లౌకిక చట్టాల్ని విస్మరించడం లేదా తిరస్కరించడం జరిగింది. మహిళలకు అనుకూలమైన ఏ ఒక్క చట్టాన్ని కూడా ఇంతవరకు మోడీ ప్రభుత్వం (మొదటి లేదా రెండో పాలనా కాలంలో) తీసుకురాలేదు.
గిరిజనుల చట్ట నిబంధనల్ని బలహీనపర్చడం
ఇటీవల భోపాల్‌లో ఒక కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, ఏకరూప పౌరస్మృతిని తీసుకొని రావాలన్న తన ప్రభుత్వ నిర్ణయాన్ని పునరుద్ఘాటించాడు. దీనిని వ్యతిరేకించే వారంతా ”బుజ్జగింపు” రాజకీయాలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. ఒకే ఇంట్లో, ఒకవేళ ఒక కుటుంబ సభ్యుడు ఒక చట్టం, మరొక సభ్యుడు మరొక చట్టాన్ని కలిగి ఉంటే, ఆ ఇల్లు, కుటుంబం సరైన రీతిలో ఉంటుందా? కాబట్టి ద్వంద్వ విధానంతో దేశమెలా ఉంటుంది? తన అవగాహనలో ద్వంద్వ విధానాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సి ఉంటుందనీ, ”మా ముస్లిం బిడ్డలు” అని అదే పనిగా ప్రస్తావిస్తూనే ముస్లింల వ్యక్తిగత చట్టాల్ని లక్ష్యం చేసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేశాడు.
”ద్వంద్వ విధానాల్ని” భారత రాజ్యాంగం ఏర్పరచిందన్న విషయం భారత ప్రధానికి తెలియదా? దురదృష్టవశాత్తు, భారత ప్రధాని భారతదేశాన్ని రాజ్యాంగం దృష్టితో కాక, సంఫ్‌ు పరివార్‌ రాజకీయ దృష్టితో చూస్తున్నాడు. అందుకే ఆయన ఉద్దేశపూర్వకంగానే ముస్లిం మతంపై ఏకరూప పౌరస్మృతి విధించడం వల్ల దేశంలో మొత్తంగా ఉత్పన్నమయ్యే చిక్కుల్ని విస్మరించాడు. లా కమిషన్‌ తన నివేదికలో ఏకరూప పౌరస్మృతి సంబంధిత సాధ్యాసాధ్యాల్ని ముందుగా ఊహించదగిన (రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కి సంబంధించిన)సమస్యను ప్రత్యేకంగా పేర్కొంది. త్రిపుర, అస్సాం, మిజోరాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు వర్తించే ఆర్టికల్‌ 244లోని ఆరవ షెడ్యూల్‌, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జిల్లాలకు, ప్రాంతీయ కౌన్సిళ్ళకు వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు లాంటి కుటుంబ చట్టాలను, ఇతర చట్టాల్ని గవర్నర్‌ అనుమతితో రూపొందించే హక్కుల్ని కల్పిస్తుంది. దానితోపాటు ఆర్టికల్స్‌ 371ఏ, బి, సీ, ఎఫ్‌, జీ, హెచ్‌లు 6 ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హక్కుల్ని, మినహాయింపుల్ని సమకూర్చుతాయి. ఉదా:- నాగా ప్రజలకు 371 ఏ, మిజోరాం ప్రజలకు 371జీ మతపరమైన, సాంఘిక ఆచారాలు, పౌర, నేర న్యాయాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధనల్ని సమకూర్చుతాయి. ఉత్తర ఈశాన్యంలోని ఈ రాష్ట్రాల గిరిజన ప్రజలు (వారి ఆచార వ్యవహారాలకు సంబంధించిన చట్టాల విషయంలో) రాజ్యాంగ హక్కులపై ప్రభావం చూపే ఈ చర్యలపై ఎలా ప్రతిస్పందిస్తారు? ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో ”షెడ్యూల్డ్‌ ప్రాంతాల పంచాయతీ విస్తరణ చట్టం” అమలు చేయడం ద్వారా గ్రామ సభలకు చట్టపరంగా హక్కులిచ్చి, స్వయం పాలన ద్వారా ఆచార, సాంఘిక పద్ధతులకు రక్షణ కల్పించడం జరుగుతుంది. తమ అడవులను, భూమిని ఆక్రమించుకుంటున్న ఆర్థిక విధానాల ద్వారా మధ్య, తూర్పు భారతదేశంలోని గిరిజనులు ఇప్పటికే దాడులకు గురవుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా గిరిజన ప్రజలకు కల్పించబడిన రాజ్యాంగపరమైన, చట్టపరమైన నిబంధనలతో ఏకరూప పౌరస్మృతికి ప్రత్యక్ష వైరుధ్యం ఏర్పడుతుంది.
ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ గిరిజనుల కోసం ఏర్పరచిన ”ద్వంద్వ విధానాలకు”, రాజ్యాంగ పరమైన, చట్టపరమైన నిబంధనలు వ్యతిరేకమా? ఏకరూప పౌరస్మృతిని విధించడానికి ఆయన ఈ రక్షణ వ్యవస్థల్ని రద్దు చేయబోతున్నారా? లేక ఏకరూప పౌరస్మృతి గిరిజన ప్రజలకు వర్తించకుండా కేవలం ముస్లింలకు మాత్రమే వర్తిస్తుందా? తన వైఖరి ఏమిటో భారత ప్రధాని స్పష్టం చేయాలి.
బీజేపీ ద్వంద్వ కపటత్వం: నాగాలాండ్‌ ఉదాహరణ
ప్రధానమంత్రి, బీజేపీ నాయకులు దేశానికి ఒకే చట్టం లాంటి ఏకరూపత గురించి వాదిస్తుంటే, నాగాలాండ్‌లో మహిళల హక్కుల గురించి బీజేపీ కపటపూరితంగా వ్యవహరిస్తుంది. నాగా ఆచార చట్టానికి వ్యతిరేకంగా ఉందని భావించబడుతున్న 1/3 వంతు మహిళా రిజర్వేషన్లను అనేక నాగా గ్రూపులు వ్యతిరేకిస్తున్న కారణంగా 2012 నుండి నాగాలాండ్‌లో స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. నాగా విమెన్స్‌ అసోసియేషన్‌ లాంటి వారి మహిళా సంఘం నాయకత్వాన, దేశ వ్యాప్తంగా మహిళా సంఘాల మద్దతుతో నాగా మహిళలు 1/3 వంతు మహిళా రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి రిజర్వేషన్లకు నాగా ఆచార చట్టంలో ఎలాంటి వ్యతిరేకత లేదని వారంటున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఓ పిటీషన్‌పై వాదనలు కూడా సాగుతున్నాయి. గడచిన కొన్ని తేదీలలో ఈ సమస్యపై ఉద్దేశపూర్వకంగానే అఫిడవిట్‌ సమర్పించనందుకు ఆగ్రహించిన కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇది మహిళా హక్కుల సంబంధిత అంశమని స్పష్టంగా కనిపిస్తుంది. ”ముస్లిం బిడ్డల” గురించి ఎంతో చింతించి, జోక్యం చేసుకున్న ప్రధానమంత్రి, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు నోచుకోని ”నాగా బిడ్డల” విషయంలో పూర్తిగా మౌనం వహించాడు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది? ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆ పార్టీ నాయకుడు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో మహిళలకు 1/3వంతు రిజర్వేషన్లను నిరాకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. గిరిజన సంఘాలతో చర్చించేందుకు ఇంకా సమయం అవసరమని చెప్తూ, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెమ్జెన్‌ ఇమ్నా తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాడు. బీజేపీకి నచ్చితే ”ద్వంద్వ విధానం” మంచిది, ఆ పార్టీకి ఏదైనా ఒక మతం లక్ష్యంగా ఉంటే బీజేపీ ”ఒకే చట్టం” గురించి అదే పనిగా మాట్లాడుతుంది.
(మిగతా రేపటి సంచికలో)
-బృందాకరత్‌

(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
– అనువాదం:బోడపట్ల రవీందర్‌
9848412451

Spread the love