పత్రికా సమావేశం.. ఓ జర్నలిస్టు అనుభవం!

ఏ.ఎం.జిగీశ్‌
జాతీయ అధినాయకత్వానికి సంబంధించిన పత్రికా సమావేశానికి కేంద్ర కార్మిక సంఘం (సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్‌) ఇటీవల నన్ను ఆహ్వానించింది. ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యూనియన్‌ ఆందోళనను ప్రారంభిస్తున్నది. యూనియన్‌ కొన్ని అంశాల్లో ప్రభుత్వానుకూల వైఖరి తీసుకున్నందున, రాజకీయంగా కొన్ని ముఖ్యమైన అంశాలకు ఈ పత్రికా సమావేశం నాకు ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను. సమావేశానికి ఐదు నిమిషాల ముందే నేను అక్కడకు చేరుకున్నాను. కొంతసేపటి వరకు అక్కడ ఏమీ జరగలేదు. ఆలస్యం జరిగినందుకు క్షమాపణలు చెప్పడానికి యూనియన్‌ సిబ్బంది నా దగ్గరకు వచ్చింది. అర్థగంట తర్వాత కూడా అక్కడ ఉన్న ఒక్కగానొక్క రిపోర్టర్‌ను నేనే. అయితే నిర్వాహకులు ఎలాగోలాగా చివరకు ఒక్క యూట్యూబర్‌ను సమావేశానికి రప్పించగలిగారు. నిరసన కార్యక్రమాలకు సంబంధించి జాతీయ కార్యదర్శి ప్రకటన చేశారు. పార్లమెంటుకు మార్చ్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఆ ప్రకటనలో ఉన్నాయి. నిరసనలకు సంబంధించి ఆయనను నేను కొన్ని ప్రశ్నలు అడిగాను కానీ… పత్రికా విలేకరులు, ఫొటోగ్రాఫర్ల కోసం ఏర్పాటు చేసిన స్నాక్స్‌, బంగ్లా స్వీట్లు, రెండు పెద్ద ఫ్లాస్కుల్లో టీ, కాఫీని యూనియన్‌ ఏం చేస్తుందన్న దాని గురించి మాత్రం నేను ఆయనను అడగలేదు. ఆ తర్వాత 25వేల మంది కార్మికులు (వీరిలో అధికం పీఎస్‌యూల నుంచి వచ్చినవారున్నారు) హాజరైన పార్లమెంటు మార్చ్‌ను నేను కవర్‌ చేశాను. ఇది కొత్తేం కాదు. సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాలను నేను కవర్‌ చేస్తున్నాను. యూనియన్ల రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా… యూనియన్‌ కార్యక్రమాలకు హాజరయ్యే జర్నలిస్టుల హాజరు మాత్రం పేలవంగా ఉంటుంది. ప్రముఖ కార్మిక నాయకులు ఎం.కే పంధే ఒకసారి జర్నలిస్టు మిత్రులకు ఒక విషయం చెప్పారు. భారత్‌లో యూపీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చే సమ్మెలో ఎంత మంది కార్మికులు పాల్గొన్నారన్న దాని గురించి తాను బీబీసీ, ది గార్డియన్‌ వంటి విదేశీ మీడియా పబ్లికేషన్లపై ఆధారపడ్డానని అన్నారు.
12 కేంద్ర కార్మిక సంఘాలకు కలిపి దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి పైగా కార్మికుల సభ్యత్వం ఉన్నది. ఈ యూనియన్లు, ఫెడరేషన్ల సభ్యత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తాయి. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరగలేదు. మిస్డ్‌కాల్స్‌తో సభ్యత్వ నమోదు జరిపే రాజకీయ పార్టీల్లా కాకుండా, ఈ యూనియన్ల సభ్యత్వానికి సంబంధించి ఆడిట్‌ జరుగుతుంది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్లకు కార్మిక సంఘాలు తమ రిటర్న్స్‌ను ఫైల్‌ చేస్తాయి. ఈ సమయంలో సభ్యత్వరశీదు తప్పనిసరి. ఈ యూనియన్లతో లక్షలాది మంది ప్రజలు మిలితమై ఉంటారు. కానీ, వారు వారికి సంబంధించిన సమస్యలు, అంశాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువత జీవనోపాధికి సంబంధించిన సమస్యలను ట్రేడ్‌ యూనియన్లు లేవనెత్తుతాయి. వాటి డిమాండ్లు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయి. వాటి విధానానికి ఒక విలువ ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సమావేశాల్లో అవి ప్రశంసలకు నోచుకుంటాయి. ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఐఎల్‌ఓ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు, పలు కంపెనీల యజమానులు, కార్మిక సంఘాలు భారత కార్మిక ప్రతినిధుల మాటలను చాలా శ్రద్ధతో ఆలకించారు. అయితే, భారత్‌లో మాత్రం కార్మిక సంఘాల కార్యకలాపాలు, డిమాండ్లు మాత్రం విస్తృతంగా మీడియాలో కవర్‌ కావడం లేదు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలో పాలుపంచుకున్న కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు అమర్‌జీత్‌ కౌర్‌ మాట్లాడుతూ… కార్మికుల సమస్యలకు సంబంధించిన నిష్పాక్షికత ప్రాథమిక సూత్రాన్ని అనేక మీడియా సంస్థలు మరిచిపోయాయి. ”నయాఉదారవాదం అమలు తర్వాతే ట్రేడ్‌ యూనియన్లు, కార్మికులను విస్మరించే ట్రెండ్‌ ఊపందుకున్నది. కార్మిక సంఘాలు ఎల్లప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రీకరించబడ్డాయి. విధానకర్తలు, యజమానులకు అనుకూలంగా అనేక మీడియా సంస్థలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీనిని విస్మరించడమే సులువు అని మీడియా గుర్తించింది” అని ఆమె అన్నారు. ”బీబీసీ, ఏఎఫ్‌పీ, ఇతరుల కవరేజీకి ధన్యవాదాలు. బ్రిటన్‌లో నర్సులు, ఫ్రాన్స్‌లో కార్మికుల సమ్మె గురించి తెలుసుకున్నాము. అయితే, జార్ఖండ్‌లో కోల్‌మైనర్ల సమ్మెగురించి మనలో ఎంత మందికి తెలుసు?” అని ప్రశ్నించారు.
ఈ అంశం రైతు సంఘాలకు సంబంధించినది కూడా. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరిపిన విస్తృత నిరసనలకు మీడియా కవరేజ్‌ లభించింది. బహుశా, కార్మిక సంఘాల నుంచి కూడా ఇలాంటి నిరసనల కోసం మీడియా సంస్థలు ఎదురుచూస్తున్నాయి.
– ‘ది హిందూ’ సౌజన్యంతో
అనువాదం: గోవర్ధన్‌

Spread the love