Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి

- Advertisement -

రేపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన అదే రోజు భారత్ కు వస్తున్న సీజేపీ వ్యవస్థాపకుడు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద
ధర్నాకు ఏర్పాట్లు
జెన్ జెడ్ యువతరం
కదిలిరావాలంటూ పిలుపు
భారీ పోలీసు బందోబస్తు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వివాదాలు, జెఈఈ (అడ్వాన్స్‌డ్) 2026 అభ్యర్థుల డేటా బహిర్గతానికి కేంద్రమే కారణమని ఆరోపిస్తున్న సీజేపీ, రేపు (శనివారం) ఆందోళన చేపట్టనుంది. గురువారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అధికార ప్రతినిధులు విజయేత దహియా, అశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ ఆందోళన హింసాత్మకంగా మారవచ్చనే ఊహాగానా లను తోసిపుచ్చారు. శాంతియుత నిరసన చేపట్టేందుకు నిబద్ధతతో ఉన్నామని పునరుద్ఘాటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండింటితోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. “హింస చెలరేగుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. సీజేపీ శాంతిభద్రతలకు అనుగుణంగా శాంతియుత, ప్రజాస్వామ్యయుత నిరసనలకు పిలుపునిస్తోంది.

హింసకు తావులేదు” అని ఆయన అన్నారు. ఫలితాల పోర్టల్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2026 అభ్యర్థుల డేటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపా యాలను ఎంత “అసమర్థ” వ్యక్తులు నడుపుతున్నారో చూపిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల డేటా భద్రత, పరీక్షా విధానాలను ప్రభుత్వం నిర్వహించే తీరుపై కొత్త ఆందోళనలను రేకెత్తించిందని అన్నారు. అభ్యర్థుల సమాచారం బహిర్గతం కావడం సైబర్ సెక్యూరిటీ భద్రతల దుస్థితిని ప్రతిబింబిస్తోందని అన్నారు. “దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిత్రాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న టెక్ నిపుణులను అందించిన దేశంలో, విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం కనీస వ్యవస్థలను కూడా సురక్షితంగా నడపలేనంత అసమర్థంగా ఉన్నాయి” అని రాంకా అన్నారు.

విద్యా రంగంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలమయ్యారని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. “విద్యాశాఖ మంత్రి పూర్తిగా అసమర్థుడు. ఆయన విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, దీనివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది” అని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలకు శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యక్తులు అవసరమని కూడా అన్నారు. “ఆ డేటా రీడ్-ఓన్లీ అని ఐఐటీ రూర్కీ చెప్పింది. ఇదేమైనా జోకా? దాన్ని చదవొచ్చు కానీ ఎడిట్ చేయలేమని చెబుతున్నారా? ఒక సాధారణ ఐఐటి పోర్టల్‌ను కూడా సురక్షితంగా నడపలేరు. 16, 17, 18 ఏండ్ల కుర్రాళ్లు లోపాలను కనుగొని సీఈఆర్టీకు తెలియజేస్తున్నారు. ఇది వ్యవస్థను నడుపుతున్న వారి సామర్థ్య స్థాయిని చూపిస్తుంది” అని ఆయన అన్నారు.

ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగిన అన్ని డేటా బహిర్గత ఘటనలు, సైబర్‌ సెక్యూరిటీ లోపాల వివరాలను వెల్లడించాలని రాంకా డిమాండ్ చేశారు. “ఈ దేశ డేటా ఎక్కడెక్కడ చేరిందో, దానికి ఎవరెవరికి యాక్సెస్ ఉందో మేము తెలుసుకోవాల నుకుంటున్నాము. ఇటువంటి ఉల్లంఘనలన్నింటి వివరాలను, ముఖ్యంగా జాతీయ భద్రతపై ప్రభావం చూపే వాటిని బహిరంగపరచాలి” అని ఆయన అన్నారు.

రేపు ఢిల్లీకి సీజేపీ వ్యవస్థాపకుడు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6న ఢిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరనున్నారని అన్నారు. ప్రతిపాదిత ఈ ప్రదర్శనలో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొంటారని తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నిరసనకారులు రాజకీయ బ్యానర్లు లేకుండా ఈ ఉద్యమంలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ఇతివృత్తం యువతకు సంబంధించినదని ఆయన అన్నారు. “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే మా ఏకైక డిమాండ్” అని దాస్ అన్నారు. సీజేపీ జవాబుదారీతనం కోరుతున్న యువ రాజకీయ ఉద్యమమని ఆయన నొక్కి చెప్పారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకలు, ఇతర సంబంధిత సమస్యలకు ప్రధానే కారణమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -