జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలి
కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం
సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్ణయం
ఆగస్టు 10న జైలు భరోను జయప్రదం చేయాలి : ఎలమరం కరీం పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు, రైతుల ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం నిర్ణయించాయి. బుధవారం నాడిక్కడ తల్కటోరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, రైతులు పాల్గొన్నారు. కార్మిక వర్గంలోని వివిధ రంగాలకు చెందిన సంఘాలూ ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు, కిసాన్ పంచాయతీలు నిర్వహించడం ద్వారా కార్మికులు, రైతుల ఐక్య పోరాటాన్ని బలోపేతం చేయాలని సదస్సు పిలుపునిచ్చింది. అదే విధంగా పోరాటంలో లేవనెత్తిన డిమాండ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని తెలిపింది. కార్మికులు, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే భారత్ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించింది. డిమాండ్లు అంగీకరించే వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలను దిగ్బంధిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆందోళన కార్యక్రమాలకు కార్మిక, రైతు సంఘాలు నాయకత్వం వహిస్తాయని పేర్కొంది.
నవంబర్ నాటికి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని ఈ సదస్సు నొక్కి చెప్పింది. దేశం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రధాన ఉత్పాదక శక్తుల ఐక్యత అత్యంత కీలకమని సదస్సు పేర్కొంది. కేంద్రం దేశీయ, విదేశీ బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలను అమ లు చేస్తూనే ఉందనీ, దీంతో సామాన్య ప్రజల, ముఖ్యంగా పేద, వెనుకబడిన తరగతుల వారి జీవితాల్లో అసమా నతలు పెరుగుతున్నాయని తెలిపింది. కార్మికులు, రైతులు తమ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి, శాంతియుత, సామరస్య పూర్వక జీవితాన్ని కొనసాగిం చడానికి కట్టుబడి ఉన్నారని పేర్కొంది. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పోరాడే, సమ్మె చేసే హక్కును వారు కొనసాగిస్తారని తెలిపింది. ప్రజలను, దేశాన్ని కాపాడటానికి ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను మార్చేందుకు తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాక కార్మిక చట్టాలను రద్దు చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా పంటలకు మద్దతు ధరలు కల్పించడం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసం హరిం చుకోవడం, కార్మికులందరి కనీస వేతనాన్ని కరువు భత్యంతో కలిపి రూ. 42,000కు పెంచడం, వీబీ గ్రామ్ జీ ని రద్దు చేయడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వంటివి డిమాండ్లను లేవనెత్తింది.
జైలు భరోను విజయవంతం చేయాలి :ఎలమరం కరీం
ఆగస్టు 10న జరిగే జైలు భరోను విజయవంతం చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతటి అణచివేత, పోలీసు చర్యలు ఎదురైనా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. కార్మికులు, రైతుల ఐక్యతతో మోడీ ప్రభుత్వాన్ని లొంగదీయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ‘‘విద్యార్థుల ఆందోళనతో ప్రధాని మోడీ లొంగిపోవాల్సి వచ్చింది. ఐదేండ్ల క్రితం సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో జరిగిన చారిత్రాత్మక ఉద్యమంతో వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది’’ అని గుర్తు చేశారు. ‘‘లేబర్ కోడ్‌లు అనేవి బానిసత్వాన్ని అమలు చేయడానికి సిద్ధం చేసిన ఒక నమూనా. లేబర్ కోడ్‌లు పని గంటలు, గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, సామూహిక బేరసారాల హక్కు వంటి ప్రాథమిక హక్కులను కార్మికుల నుంచి దోచుకుంటున్నాయి.
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు లేబర్ కోడ్‌ల తుది నిబంధనల నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల్లోనే ఆ కోడ్‌లను అమల్లోకి తెచ్చారు’’ అని విమర్శించారు. ‘‘ఈ చట్టం, కార్మికులు సమిష్టిగా లేవనెత్తిన డిమాండ్లను, యూనియన్ కార్యకలాపాలను నేరంగా పరిగణించింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దేశంలోని రైతులను నాశనం చేస్తుంది. ప్రభుత్వం ఎంజీఎంఎన్‌ఆర్‌ఈజీఏ చట్టాన్ని రద్దు చేసింది. కీలక రంగమైన విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టానికి కూడా సవరణలు చేసింది. ఈ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బలమైన పోరాటాలను చేపట్టాలి’’ అని ఎలమరం కరీం అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా కలిసి జాతీయ సదస్సు నిర్వహించడం ఇది రెండోసారి. తొలి సదస్సు 2023 ఆగస్టులో జరిగింది.



