నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
గొల్లకురుమల జీవనాధారమైన మూగ జీవాల మేతకు భూములు, గ్రామ ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సముద్రాల గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లో పంచరాయి భూముల్లోని చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామి ఆదివారం విలేకరులతో
మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, గ్రామ వనరులను కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఏం కావాలని ప్రశ్నించారు. అలాగే సమీపంలోని తానేధార్ పల్లి గ్రామ వ్యర్థాలు, ప్లాస్టిక్ తదితర చెత్తను సముద్రాల గ్రామ శివారులో పడేస్తుండటంతో పర్యావరణం కలుషితమవుతోందని ఆరోపించారు. మేతకు వెళ్లే గొర్రెలు, మేకలు తెలియక ప్లాస్టిక్ తిని అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కళ్లముందే ప్రభుత్వ భూముల్లో చెట్ల నరికివేత, అక్రమ మొరం తవ్వకాలు, వ్యర్థాల డంపింగ్ జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, గ్రామ వనరులను కొల్లగొడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ
కార్యక్రమంలో కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామి, బండి అశోక్, మేకల కొమురయ్య, బండి రాములు, కన్నెబోయిన అంజయ్య, తాటికొండ అశోక్, తాటికొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.



