కనిపించని హంగామా..

– పల్లెల్లో లో కానరాని సార్వత్రిక సందడి
– ఇంకా ప్రచారం ప్రారంభించని అభ్యర్థులు, ఎన్నికలపై ఆసక్తి చూపని గ్రామీణులు,
– ఈ నెల 18న నోటిఫికేషన్
– 29 న ఉపసంహరణలు
– ప్రచారానికి 13 రోజులే
నవతెలంగాణ – సూర్యాపేట
పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ పల్లెల్లో, పట్టణాలలో ఎలాంటి సందడి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల హంగామా ఇటీవలే ముగిసిన విషయం తెల్సిందే. ఇక యంపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కానీ ఇంతవరకు ఆయా పార్టీల అభ్యర్థుల తరపున  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలాంటి  ప్రచార కార్యక్రమాలు కానీ, కార్యకర్తల హడావుడిగానీ కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు   నిర్వహిస్తుండడంతో  ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు , కార్యకర్తలు  పార్లమెంట్ అభ్యర్థుల కోసం ప్రచారం పై ఆసక్తి చూపడం లేదని చర్చ నడుస్తుంది. గత సెప్టెంబర్ నుండి  వరుసగా జరుగుతున్న ఎన్నికలతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో, పట్టణాలలో  సందడి నెలకొనగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పల్లెలు బావురుమంటున్నాయి. ఈనెల 18వ తేదీన లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడ నున్నది. ఇంకా రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగే క్రమంలో గ్రామాలలో మాత్రం ఎన్నికల వేడి కనిపించడం లేదు. ప్రధానంగా జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అభ్యర్థుల ప్రచారాలు లేక  వెలవెలబోతున్నాయి. ప్రధానంగా  నల్గొండ పార్లమెంటు స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘు వీర్ రెడ్డి, బిఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణ రెడ్డి, బి జె పి నుండి సైది రెడ్డి, భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి,  సిపిఐయం అభ్యర్థిగా జహంగీర్,బిఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్, బీజేపీ అభ్యర్థి గా   డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ లు బరిలో ఉన్న విషయం విధి తమే. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి కొనసాగ నున్నది. ఈనెల 26 న నామినేషన్ల పరిశీలన జరగనుండగా 29 న ఉపసంహరణలు అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల ప్రచారానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కానీ ఇంతవరకు ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ కార్యకర్తల హడావుడిగాని కనిపించడం లేదు.
రేపు నామినేషన్ లు షురూ..
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ 18వ తేదీన షురూ కానున్న నేపథ్యంలో  ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈనెల 19,20,22 తేదీలో అట్టహాసంగా నామినేషన్లు వేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికల కంటే నెల రోజుల ముందే హడావుడి ప్రారంభమవుతుంది. అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అభ్యర్థులు ఏర్పాట్లను చేసుకుంటారు. కానీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ గడువు చివరిలో  ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. చివరికి అక్కడక్కడ మాత్రమే సమావేశాలు జరుగుతున్నాయి తప్ప బేరసారాలు, విందులు, వినోదాలు, రోడ్ షోలు, భారీ ప్రచారాలు, బహిరంగ సభలో  నేటికి కూడా కనిపించకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సందడి బోసిపోయింది. దీంతో అభ్యర్థులకు ఖర్చు  తగ్గుతుందనే ఆనందం కూడా కనిపిస్తుంది.  నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు చొప్పున 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అభ్యర్థులు నామినేషన్లు వేసి ఉపసంహరణ అనంతరం మిగిలి ఉన్న 13 రోజులలో  ఒక్కరోజు ఒక్కో నియోజకవర్గంలో  పర్యటించిన ఇంకా మిగిలేది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఈ ఐదు రోజులలో  కుల సంఘాలతో సమావేశాలు, మద్దతిచ్చే వర్గాలతో సంప్రదింపులు, రాత్రిళ్లు విందులు, సెటిల్మెంట్లు, బుజ్జగింపులు ఇవన్నీ కూడా సాధ్యం కాని పరిస్థితి గా కనిపిస్తుంది. గతంలో నామినేషన్ దాఖలు చేసేందుకు పది రోజుల ముందు నుంచే హడావుడి ఉండేది. సమావేశాలు, ర్యాలీలు, కార్యకర్తలకు విందు ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుతం వాటికి సమయము, నిధులు కేటాయించడం తగ్గింది. ఎన్నికల సంఘం ఒక్కో పార్లమెంట్ అభ్యర్థి కి 70 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే సాధారణంగా అభ్యర్థులు మూడు కోట్ల నుండి ఐదు కోట్ల వరకు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం గడువు తక్కువగా ఉండటంతో కొంతమంది అభ్యర్థులు డబ్బులు మిగులుతాయని భావిస్తుండగా, మరి కొంత మంది మాత్రం 50 నుండి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని అంచనా వేసుకున్నట్లు
ఎన్నికలపై ఆసక్తి చూపని గ్రామీణులు..
అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్థి కోసం చేసే ప్రచారంపై ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తుంది. ఎంపీ అభ్యర్థుల పరిధిలోని నియోజకవర్గ  పరిధిలోని అన్ని మండలాల పరిధిలో  పర్యటించే సమయం కూడా లేకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైనే అధికార పార్టీ అభ్యర్థులు ఆశలు పెంచుకున్నారు. బి.ఆర్.యస్  పార్టీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు తీసుకెళ్లి గెలిచేందుకు తపిస్తోంది. ఇక  సీపీఐఎం అభ్యర్థి జహంగీర్ మాత్రం భువనగిరి పార్లమెంట్ లో తమకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. గత పూర్వవైభవం కోసం సిపిఐఎం అగ్ర నాయకులు కృషి చేస్తున్నారు. బిజెపి మాత్రం  అచ్చే దిన్ కోసం వెతుకులాటలో పడింది. ఏది ఏమైనప్పటికీ పాత, కొత్త  అభ్యర్థులతో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు మునుముందు ఏ మేరకు పల్లెల్లో, పట్టణాలలో రాజకీయ వేడిని రగిలిస్తాయో వేచి చూడాలి.
Spread the love