– మహిళల హాకీ స్టార్ ప్రకటన
న్యూఢిల్లీ : భారత మహిళల హాకీ దిగ్గజ క్రీడాకారిణి, స్టార్ ఫార్వర్డ్ వందన కటారియ అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకుంది. 32 ఏండ్ల వందన కటారియ 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు మంగళవారం ముగింపు పలికింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. భారత్‌కు 320 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన వందన 158 గోల్స్ నమోదు చేసింది. ‘ ఈ రోజు భారమైన హృదయంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నాను. నా ఆట మందగించిందని, దూకుడు తగ్గిందని ఈ నిర్ణయం తీసుకోలేదు. కెరీర్‌లో మంచి స్థితిలో ఉన్నప్పుడే వైదొలగాలని అనుకున్నాను’ వందన తెలిపింది. భారత జట్టుకు అత్యధిక మ్యాచులు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన వందన హాకీ ఇండియా లీగ్ సహా ఇతర టోర్నమెంట్లలో ఆడనుంది.