వరుణుడి ఆట!

వరుణుడి ఆట!– భారత్‌, కెనడా మ్యాచ్‌ వర్షార్పణం
– అవుట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటమే కారణం
నవతెలంగాణ-లాడర్‌హిల్‌
మొన్న శ్రీలంక, నేపాల్‌ మ్యాచ్‌.. నిన్న అమెరికా,ఐర్లాండ్‌ మ్యాచ్‌.. నేడు భారత్‌, కెనడా పోరు. లాడర్‌హిల్‌ స్టేడియంలో వర్షంతో రద్దుగా ముగిసిన మ్యాచులు ఇవి. ఫ్లోరిడాలో ఈ వారం వరదలతో కూడిన భారీ వర్షాలు ఉన్నాయి వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక, నేపాల్‌ మ్యాచ్‌తో పాటు అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్‌ సమయంలోనూ వర్షం కురిసింది. కానీ భారత్‌, కెనడా మ్యాచ్‌కు పెద్దగా వర్షం అడ్డంకి లేకపోయినా.. ఆట సాధ్యపడలేదు. తడి అవుట్‌ఫీల్డ్‌ కారణంగా కనీసం టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో గ్రూప్‌ దశను భారత్‌ మూడు విజయాలు, ఓ ఫలితం తేలని మ్యాచ్‌తో ముగించింది. గ్రూప్‌ దశ మ్యాచులను పూర్తిగా అమెరికాలో ఆడిన టీమ్‌ ఇండియా.. సూపర్‌ 8, నాకౌట్‌ మ్యాచుల కోసం వెస్టిండీస్‌ బయల్దేరనుంది.
కనీసం కవర్లు లేవు : భారత్‌, కెనడా మ్యాచ్‌ ఉదయం ఇక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. కానీ మ్యాచ్‌ ముంగిట, మ్యాచ్‌ షెడ్యూల్‌ సమయంలో పెద్దగా వర్షం లేదు. అయినా, శనివారం మ్యాచ్‌ సాగలేదు. అందుకు కారణంగా లాడర్‌హిల్‌ స్టేడియంలో సౌకర్యాల కొరత అనే చెప్పాలి. క్రికెట్‌ను ప్రపంచ కార్పోరేట్‌ రాజధాని అమెరికాకు ఘనంగా పరిచయం చేయాలని అనుకున్న ఐసీసీ.. అక్కడి స్టేడియాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనకు దూరమైంది. లాడర్‌హిల్‌ స్టేడియంలో కనీస ప్రామాణిక డ్రైనేజీ వ్యవస్థ లేదు. సెంటర్‌ పిచ్‌ మినహా మైదానం కప్పి ఉచ్చేందుకు ఎటువంటి కవర్లు అందుబాటులో ఉంచలేదు. దీంతో వర్షం ఆగినా.. పిచ్‌ బాగానే ఉన్నప్పటికీ అవుట్‌ఫీల్డ్‌ ప్రమాదకరంగా ఉండటంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యపడలేదు. పిచ్‌ను తనిఖీ చేసేందుకు రెండు సార్లు మైదానంలో అడుగుపెట్టిన ఫీల్డ్‌ అంపైర్లు.. అవుట్‌ఫీల్డ్‌పై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా సూపర్‌8 ఆశలు ఇప్పటికే ఆవరి కావటం, భారత్‌ సూపర్‌8 బెర్త్‌ను కైవసం చేసుకోవటంతో ఇరు జట్లు సైతం ప్రమాదకర అవుట్‌ఫీల్డ్‌పై ఆడేందుకు నిరాకరించాయి. దీంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు.

Spread the love