విదర్భ పైచేయి!

– తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల ఆధిక్యం
– నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర)
ఉత్కంఠగా సాగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో కేరళపై విదర్భ కాస్త పైచేయి సాధించింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేయగా.. కేరళను తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకే పరిమితం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 37 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ఆదిత్య (79, 185 బంతుల్లో 10 ఫోర్లు), కెప్టెన్‌ సచిన్‌ బేబి (98, 235 బంతుల్లో 10 ఫోర్లు) కేరళకు మంచి స్కోరు అందించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాగిన కేరళ.. సచిన్‌ బేబి నిష్క్రమణతో డీలా పడింది. సల్మాన్‌ నిజార్‌ (21), మహ్మద్‌ అజహరుద్దీన్‌ (34), జలజ్‌ సక్సేనా (28) అంచనాలను అందుకోలేదు. 125 ఓవర్లలో కేరళ 342 పరుగులు చేసింది. విదర్భ బౌలర్లలో దర్శన్‌ (3/52), హర్ష్‌ దూబె (3/88), పార్థ్‌ రాకేశ్‌ (3/65) మూడేసి వికెట్లు పడగొట్టారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో చివరి రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఫలితం తేలేందుకు మరో రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కావాల్సి ఉంది. పిచ్‌ నుంచి స్పిన్నర్లకు టర్న్‌ లభిస్తుండటంతో నేడు ఉదయం సెషన్‌ నుంచే స్పిన్‌ మాయ ప్రభావం కనిపించనుంది.

Spread the love