సీఏఏ అమలు.. తమిళ సర్కారుకు విజయ్‌ విజ్ఞప్తి

నవతెలంగాణ – చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం అధినేత, హీరో దళపతి విజయ్‌ విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్‌ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఇప్పుడు అమలుచేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ స్పందించారు. సామాజిక సామరస్యంతో దేశంలో పౌరులు జీవిస్తున్నారని, అలాంటి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టేలా ఉన్న సీఏఏ వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని తమిళనాడులో అమలు చేయవదని సీఎం స్టాలిన్‌ను కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చట్టాలను అమలుచేయమనే నమ్మకాన్ని ప్రజలకు నాయకులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు.

Spread the love