సోషల్ మీడియా లో వార్

–  ఊహాగానాలతో ప్రజల్లో అయోమయం, సోషల్ మీడియాపై పార్టీల దృష్టి,
– ఖర్చు లేకుండా ప్రచారానికి ఏర్పాట్లు, ఎన్నికల హడావుడి.
 నవ తెలంగాణ- సూర్యాపేట:
గత ఎన్నికల కంటే కూడా ఈసారి సోషల్ మీడియా చురుగ్గా పనిచేస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలు కూడా సోషల్ మీడియా నే ఆయుధంగా చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ప్రత్యర్థులు ఏ చిన్న పొరపాటు చేసినా నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఆయా పార్టీల శ్రేణుల పోస్టులతో సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం ప్రధాన పక్షాల అభ్యర్థులు ఖరారు కాక పోవడం వంటి పరిణామాలతో పాటు రకరకాల ఊహాగానాలతో ప్రజలను సోషల్ మీడియా అయోమయానికి గురిచేస్తుoది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను అధికంగా వినియోగించు కోవాలని పార్టీ అధిష్టానం తో పాటు అభ్యర్థులు శ్రేణులకు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై నియంత్రణ లేకుంటే ఎదురయ్యే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలు జిల్లాలో సెగ పుట్టిస్తున్నాయి. ఏదైనా పొరపాటున మాట్లాడిన సోషల్ మీడియా కు దొరికిన నెటిజన్లు బాది పడేస్తున్నారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు, వివిధ పార్టీల వర్గాలు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులతో  యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజెపి పార్టీలు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శలు గుప్పించు కుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక యాప్ లను రూపకల్పన చేసి ప్రత్యర్థులకు కౌంటర్ లు ఇస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీలు పోటాపోటీగా పోస్ట్ చేసుకుంటున్నారు. మైకుల ద్వారా గతంలో ప్రచారం చేసిన వాటితో పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న యువతకు సోషల్ మీడియా బాధ్యతలు అప్ప చెపుతున్నారు. దీని ద్వారా అనేక కామెంట్లు, పోస్టులు చేయడమే కాకుండా గెలుపోటములపై కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి తన ఫేస్బుక్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు  తదితర వాటిని ప్రజలతో పంచుకుoతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాట్సాప్, ఫేస్ బుక్ లో పెడుతున్నారు. ప్రధానంగా బీజెపి పార్టీ మాత్రం జగదీష్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంది. నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని అభివృద్ధి పత్రికా ప్రకటనలకె పరిమితమైందని విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ గా అధికార పార్టీ నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఫోటోల ద్వారా పోస్ట్ లు చేస్తూ సమాధానం ఇస్తున్నారు. ప్రధానంగా  వీరిరువురి మధ్య “సోషల్ వారు” నడుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి ల మధ్య టికెట్ వార్ నడుస్తుంది. ఆయా వర్గాల మధ్య టికెట్ తమ నాయకుడికి దక్కిందంటూ పోస్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మరికొందరు జగదీశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, పటేల్ రమేష్రెడ్డిల ఫోటోలను పెట్టి ఇందులో గెలుపు ఎవరిది అని ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరికి ఓట్లు తక్కువ వచ్చిన తక్షణమే  ఆయా అభ్యర్థి వర్గం మరో పోస్ట్ ను ఏర్పాటు చేసి ఇందులో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారని తిరిగి పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కు చెందిన అనుచరులు, అభిమానులు కూడా సోషల్ మీడియా ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. బిసి వాదాన్ని తెరపైకి తెస్తూ జానయ్య ఎమ్మెల్యే గా పోటీ చేస్తాడంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఎన్నికల హడావుడి సోషల్ మీడియాలో దంచికొడుతోంది. అదేవిధంగా సర్వే అంటూ పలు యూట్యూబ్ ఛానళ్లు పలు సంస్థల సర్వేలను సోషల్ మీడియాలో అభ్యర్థుల జాబితాతో పాటు గెలిచే స్థానాలను కూడా పోస్ట్ లు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా మండలాల వారీగా వాట్సాప్ గ్రూప్ లో ఏర్పాటు చేసుకొని  ప్రచార ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాలోని  సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో కాంగ్రెస్ టికెట్ విషయంలో సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. టికెట్ ఆశిస్తున్న వారు టికెట్ తమకే వచ్చిందంటూ చేస్తున్న పోస్టులు అటు ప్రజలను ఇటు నాయకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఖరారుపై బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా  ఇక్కడ  టిక్కెట్ ఆశిస్తున్న వారు సోషల్ మీడియాను విస్తృతంగా  వాడుకుంటున్నారు. దీని ద్వారానే  ప్రజల్లోకి ప్రచారం ద్వారా వెళుతున్నారు.ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రత్యర్థుల మధ్య నడుస్తున్న సంభాషణలు కామెంట్ల రూపంలో వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్ల సహనాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలమైన వారితో పోస్టులు  పెట్టిస్తూ గ్లోబల్  ప్రచారానికి కూడా తెరలేపుతున్నారు. పార్టీకి అనుకూలంగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అతిగా ప్రచారాన్ని కల్పిస్తున్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంపై నియంత్రణ లేకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పలు పార్టీలకు చెందిన నాయకులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వీటిపై ఉక్కు పాదం మోపి  పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love