వారెవా బోపన్న

Wareva Bopanna– ఏటీపీ మాస్టర్స్‌ 1000 మ్యాచ్‌ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు
 రొక్యూబృనే కాప్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌)
భారత టెన్నిస్‌ వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న మోంటోకార్లో మాస్టర్స్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్లో విజయం సాధించిన రోహన్‌ బోపన్న.. ఏటీపీ మాస్టర్స్‌ 1000 ఈవెంట్‌లో ఓ మ్యాచ్‌లో గెలుపొందిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) వెల్లడించింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో రోహన్‌ బోపన్న..అమెరికా ఆటగాడు బెన్‌ షెల్టన్‌ జతగా 6-3, 7-5తో ఫ్రాన్సికో, టాబిలో జోడీపై విజయం సాధించాడు. 69 నిమిషాల మ్యాచ్‌లో అలవోక విజయం సాధించిన రోహన్‌ బోపన్న.. ఏటీపీ రికార్డు పుస్తకాలకు ఎక్కాడు. 45 ఏండ్ల 30 రోజుల వయసులో రోహన్‌ బోపన్న ఈ రికార్డు సాధించగా.. గతంలో ఈ రికార్డు ఎవరి పేరిట ఉన్న విషయాన్ని ఏటీపీ పంచుకోలేదు. గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచిన బోపన్న.. తాజాగా ఏటీపీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. తొలి రౌండ్లో ఐదు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన షెల్టన్‌, బోపన్న జోడీ రెండో రౌండ్లో మూడో సీడ్‌ ఇటలీ ఆటగాళ్లతో తలపడనుంది.
మెద్వదేవ్‌ ముందంజ : పురుషుల సింగిల్స్‌లో రష్యా స్టార్‌ ఆటగాడు డానిల్‌ మెద్వదేవ్‌ ముందంజ వేశాడు. తొలి రౌండ్లో సహచర రష్యా ఆటగాడు కారెన్‌ కచనోవ్‌పై 7-5, 4-6, 6-4తో మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెటి 4-6, 7-5, 6-3తో చైనా ప్లేయర్‌ బుపై గెలుపొందాడు. గ్రిగర్‌ దిమిత్రోవ్‌ 6-3, 6-4తో వరుస సెట్లలో నికోలస్‌ జారీపై నెగ్గగా.. రాబర్టో బటిస్టా ఆగట్‌ 6-2, 6-4తో బ్రాండన్‌ను చిత్తు చేశాడు.

Spread the love