వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీవి..

– కేసీఆర్ హయాంలో కడుపు నిండా సంక్షేమం
– కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం.
– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి.
– జగదీష్ రెడ్డి ని 50 వెల మెజార్టీ తో గెలిపించుకోవాలి….. మంత్రి కేటీఆర్
– ఎవరూ కలలో కనని విధంగా ఐ.టి హబ్,
– కేసీఆర్, కేటీఆర్ ల దార్షికత కు నిదర్శనం అభివృద్ధి…. మంత్రి జగదీష్ రెడ్డి.
నవ తెలంగాణ-సూర్యాపేట.
ఆరు దశబ్దాలు పాలించినా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయకుండా మళ్ళీ ఆరు గ్యారెంటీలంటూ వారెంటీ లేని గ్యారెంటీలు ఇస్తుందని ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. సోమవారం జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులతో పాటు ఐటీ టవర్ ను ప్రారంభించిన అనంతరం జూనియర్ కలశాల లో జరిగిన బహిరంగ సభలో దళితబంధు చెక్కులను ,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు
పంపిణీ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ వారెంటీ అయిపోయి వందేళ్లు అయిందని ఆరోపించారు.వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఇస్తుందని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ హయాంలో రూ.200 పింఛను ఇవ్వలేకపోయారని.. కానీ ఇప్పుడేమో వారు రూ.4000 పింఛను ఇస్తామని అంటున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. వారి హయాంలో పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు ఉండేవని కేటీఆర్ చెప్పారు.హస్తం పార్టీ హయాంలో  కరెంట్ కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్ చేసే పరిస్థితి ఉండేదని.. 3 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని గుర్తు చేశారు.కాంగ్రెస్ ముసలి నక్క అని నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లే నని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో విద్యుత్, తాగు, సాగు నీరు అవరోధాలు లేకుండా వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.ఓటుకు నోటు కేసులో దొరికి….. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.ఒకవేళ హస్తం పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కేటీఆర్ విమర్శించారు.కరెంటు 24 గంటలు ఇవ్వడం లేదని పదే పదే అర్దరహిత విమర్శలు చేస్తున్న యంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎంతమంది వచ్చినా సరే…. బస్సులు మావే ఖర్చులు మావే…. ఏం టైంకు పోయినా ఓకే అని కరెంటు తీగలు పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తోందని కోమటిరెడ్డి కి చురకలు వేశారు. అదేవిధంగా ఎవరికి డిపాజిట్ రాదో దమ్ముంటే కోమటిరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే అన్నారు.అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమే అని పేర్కొన్నారు. రైతులే మా కుటుంబం అని దళితబంధు ఇచ్చి కేసీఆర్ దళితులకు అండగా నిలబడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రజల వసుధైక కుటుంబానికి కేసీఆరే పెద్ద దిక్కు అన్నారు. రుద్రమదేవి, భాగ్యరెడ్డి వర్మ, కుమురం భీం వారసత్వం మాదని పేర్కొన్నారు.మాది మహాత్మా గాంధీ వారసత్వం అని….మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం అని విమర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పట్టణంలోని  లక్ష్మి టాకీస్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.అదేవిధంగా  పుల్లారెడ్డి చెరువు అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.   ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా జగదీశెడ్డి విజయం ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
దశాబ్దాలుగా వేధిస్తున్న సాగు తాగునీటి సమస్యల నుండి పేట ప్రజలకు విముక్తి కల్పించామన్నారు.సూర్యాపేటలో  200 మందితో ప్రారంభించుకున్న  ఐటీ పరిశ్రమను రాబోయే మూడేళ్లలో 5000 మందికి విస్తరిస్తామని పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి హోదాలో పట్టణ పరిశుభ్రతపై కేటీఆర్ కున్న అవగాహనతోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి పట్టణంలో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, ఎప్పుడూ వినని ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వెలుస్తున్నాయన్నారు. పట్టణాల్లో పార్కులు, పరిశుభ్రమైన వాతావరణం, అద్దాలను తలపించే  రహదారుల నిర్మాణం కేటీఆర్ విజన్ తోనే సాధ్యపడిందన్నారు. దశాబ్దాలుగా సూర్యాపేట ప్రజలను వేధించిన సాగు తాగునీటి సమస్యల నుండి విముక్తి కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దే అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇదే జూనియర్ కాలేజీ వేదికగా సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు మంత్రి తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అడగగానే నిధులు ఇచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో 7500 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినామన్నారు. చెప్పినవే కాకుండా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో  మెడికల్ కాలేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి కూడా నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. 40 ఏళ్లుగా సూర్యాపేట పట్టణంలో జరుగని రోడ్డు విస్తరణ పనుల కోసం అడగగానే 25 కోట్లు మంజూరు చేసిన కేటీఆర్ వల్లే విశాలమైన రహదారులను విస్తరించుకోగలిగామని అన్నారు. గతంలో బోటు ను చూడాలంటే కేరళనో, హైదరాబాద్ కు వెళ్లాల్సిన వచ్చిన పట్టణవాసులకు  సద్దుల చెరువు ట్యాంక్ బండ్, అక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ లతో సూర్యాపేటలోనే అహ్లాద వాతావరణం తీసుకొచ్చామన్నారు. త్వరలోనే పుల్లారెడ్డి చెరువు ట్యాంక్బండ్ పనులతో పాటు, లక్ష్మీ థియేటర్ వద్ద ఉన్న బ్రిడ్జి ను ఆధునికరించి, లక్ష్మీ థియేటర్ నుండి జమ్మిగడ్డ వరకు రహదారులను విస్తరిస్తామన్నారు. అందుకుగాను అడిగిన వెంటనే 30 కోట్లు మంజూరు చేసిన కేటీఆర్ కి సూర్యాపేట ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పాలనలో కెసిఆర్ దార్శనికతకు  తోడు, కేటీఆర్ సంకల్పంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే  తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాయన్నారు.దేశంలో ఏ ఒక్కరూ పరిశ్రమ పెట్టాలన్న తెలంగాణ వైపు మాత్రమే చూస్తున్నారని , దానికి కారణం కేటీఆర్ అని కొనియాడారు. ఐటిరంగంలో కేటీఆర్ కు ఉన్న పట్టుతోనే  ఆ రంగంలో కర్ణాటకను తలదన్ని దేశంలోనే హైదరాబాద్    అగ్రస్థానానికి చేరిందన్నారు.  ఆడపడుచులకు కానుకగా ఇస్తున్న  కల్యాణ లక్ష్మి పథకానికి  నామకరణం చేసింది కూడా కేటీఆర్ అని తెలిపారు. సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి ఆరంభం మాత్రమే అని తెలిపిన మంత్రి ,రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి పట్టణంగా సూర్యాపేటను తీర్చి దిద్దడమే  లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు అండగా ఉండి జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దీపికా,కలెక్టర్ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లా గ్రంధాలయా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గండూరి ప్రకాశ్,కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love