పుచ్చకాయను ఎప్పుడూ ముక్కలుగా కోసుకుని తినడమో, లేదా జ్యూస్ చేసుకుని తాగడమో చేస్తుంటాం. అయితే పుచ్చకాయతో కమ్మనైన బర్ఫీ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యం పరంగానూ ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో మీ ఇంటికి వచ్చే అతిథులకు ఈ రసభరితమైన స్వీట్ వడ్డించి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అయిపోతారు. సాంప్రదాయ స్వీట్లతో పోలిస్తే ఇది కడుపుకు ఎంతో తేలికగా అనిపించడంతో పాటు, వేసవికి తగిన చల్లదనాన్ని ఇస్తుంది.
కావాల్సిన పదార్థాలు
పుచ్చకాయ ముక్కలు: 3 కప్పులు, పాలు: 1 లీటరు, పంచదార: అర కప్పు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్): 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: అర టీస్పూన్
అలంకరణ కోసం: సన్నగా తరిగిన బాదం, పిస్తా
పుచ్చకాయ బర్ఫీ తయారీ విధానం
ముందుగా గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జులో అదనంగా ఉన్న నీరు, పీచు పదార్థాలను తొలగించడానికి ఒక జల్లెడ లేదా ఫిల్టర్ సహాయంతో వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద పాత్రను పెట్టుకోవాలి. అందులో లీటరు చిక్కటి పాలు పోసి మీడియం మంట మీద బాగా మరగనివ్వాలి. పాలు చిక్కబడి, సగానికి తగ్గే వరకు గరిటెతో నిరంతరం కలుపుతూనే ఉండాలి. పాలు బాగా చిక్కబడిన తర్వాత, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పుచ్చకాయ గుజ్జును వేసి బాగా కలపాలి. అడుగున అంటుకోకుండా మంటను కాస్త తగ్గించి నిదానంగా ఉడికించాలి. కాసేపటి తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పుచ్చకాయ, పాల మిశ్రమంలో నెమ్మదిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం త్వరగా చిక్కబడుతుంది.
మిశ్రమం కోవా లాగా దగ్గర పడుతున్న సమయంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరో రెండు, మూడు నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం పాత్రకు అంటుకోకుండా వస్తున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ లేదా ట్రే తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి రాసి, ఉడికించిన మిశ్రమాన్ని సమానంగా పరచాలి. పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి పైన కాస్త నెమ్మదిగా నొక్కాలి.
ఈ ట్రేను సుమారు 1 నుంచి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. బాగా చల్లారి, సెట్ అయిన తర్వాత బయటకు తీసి, మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుచ్చకాయ బర్ఫీ రెడీ.
పుచ్చకాయ బర్ఫీ
- Advertisement -
- Advertisement -



