భారీ వర్షంలోనూ సీజేపీ ఆందోళన
ఆందోళన భగ్నానికి సంఘ్ పరివార్ యత్నం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నీట్-యూజీ ప్రశ్నా పత్రం లీక్, సీబీఎస్ఈ అవకతవకలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన భారీ వర్షంలో కొనసాగింది. మంగ ళవారం భారీ వర్షంతో తడిసిముద్దైనప్పటికీ జంతర్ మంతర్ వద్ద ఆం దోళనకారులు వెనక్కి తగ్గలేదు. కూర్చోని ఆందోళన చేస్తున్నవారి.. కిందంతా నీరు చేరడంతో నిలబడి వర్షంలోనే ఆందోళనను కొనసాగిం చారు. అంతే తప్ప ఆందోళనను ముగించడా నికి నిరాకరించారు. నీట్ ప్రశ్నా
పత్రం లీక్, సీబీఎస్ఈలో అవకతవకలు వంటి విద్యా సంబంధిత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షలను సరిగా నిర్వహిం చడం చేతకాని ఎన్టిఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన నాలుగో రోజు మంగళవారం కొనసాగింది. పేపర్ లీక్ వివాదం అనంతరం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫా దో’’ అంటూ నినాదాలు హోరెత్తించారు. తమ డిమాండ్ల ను తీర్చేవరకు ఆందోళన కొనసాగుతోందని పునరుద్ఘాటించారు.
ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎ వంటి విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘విద్యతో విద్య కోసం పోరాటం’ అనే నినాదంలో భాగంగా ఆందోళన ప్రదేశంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అభ్యర్థన మేరకు యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సి విద్యార్థులు కూడా మంగళవారం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. ఈ నిరసనకు మద్దతుగా రైతులు కూడా అక్కడికి చేరుకున్నారు. సీజేపీ ‘డైపర్ల విరాళం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి డైపర్లతో చేరుకుని, వాటిపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాయాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ డైపర్లను మంత్రికి అందజేస్తా మని, ఆయనకు డైపర్ అవసరమని పేర్కొంది. ‘డైపర్ ఎ డే కీప్స్ లీక్స్ అవే’ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ ఆందోళనను భగ్నం చేయడానికి సంఘ్ పరివార్ నిరంతరం ప్రయత్నిస్తోంది. సంఘ్ పరివార్ జంతర్ మంతర్ వద్దకు కూడా చేరుకుని నిరసనకారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇదిలా ఉండగా, నిరసన ప్రాంతాన్ని తగ్గించడానికి పోలీసులు ప్రయత్నించారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. రాత్రి పొద్దుపోయాక, ఢిల్లీ పోలీసులు బారికేడ్లను తొలగించి, “నిరసన స్థలాన్ని మరింత చిన్న ప్రాంతానికి కుదించ డానికి” ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రదర్శన జన సందోహం తోనే కొనసాగిందని, ఈ ఆందోళన రాత్రంతా కొనసాగుతుందని తెలిపారు. పరీక్షల సమస్యలతో ప్రభావిత మైన విద్యార్థుల పట్ల అధికారులు స్పందిస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్‌లలో పాల్గొన్నారని ఆరోప ణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫల మవుతూ విద్యార్థులను శిక్షిస్తున్నారని విమర్శించారు.
సీజేపీ ఎక్స్ ఖాతా నిషేధంపై దీప్కేకు సమన్లు
ఎక్స్ ఖాతా నిషేధంపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ శనివారం నుంచి జంతర్ మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగు తోంది. ఆయన రాజీనామా చేసేంత వరకూ అక్కడి నుంచి వెనక్కి వెళ్లేదీ లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. నేడు (జూన్ 24) మధ్యాహ్నం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో హాజరు కావాలని దీప్కేకు పిలుపు అందింది. జంతర్ మంతర్‌లోని నిర్దేశిత ఆందోళన స్థలాన్ని ఖాళీ చేయించ డంలో ఢిల్లీ పోలీసుల చర్యలను దారుణంగా ఉన్నాయని దీప్కే విమర్శించారు. ఆ ప్రదేశానికి నీరు, ఆహారం సరఫరా కు దీర్ఘకాలంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయని, అలాగే ఆ ప్రాంతంలోని మరుగుదొడ్లలో నీటి సరఫరాకు కూడా ఆటంకాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.ఎక్స్ బ్లాకింగ్‌కు వ్యతిరేకంగా దీప్కే దాఖలు చేసిన పరిపాలనా అప్పీలుకు అనుగుణంగా అంతర్-మంత్రివర్గ కమిటీ ముందు ఈ విచారణ జరగనుంది.
మే 21న ఎక్స్ హ్యాండిల్‌ను తొలిసారిగా బ్లాక్ చేసిన ఒక నెల తరువాత ఈ విచారణ జరుగుతోంది. ప్రభుత్వం ఆ హ్యాండిల్‌ను ఎందుకు బ్లాక్ చేసిందో స్పష్టంగా తెలియడం లేదని దీప్కే వెంటనే రెండవ హ్యాండిల్‌ను ప్రారంభించారు. దాని ఫాలోవర్ల సంఖ్య మొదటి దానిని మించిపోయింది. ఈ హ్యాండిల్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆ గ్రూప్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా ప్రభుత్వం యథాతథంగా వదిలేసింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఎ కింద ఈ నిలుపుదల జరిగింది. గత కొన్ని వారాలుగా చాలా మంది స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థలు, వ్యక్తిగత వ్యాఖ్యాతలు సెక్షన్ 69ఎ కింద తొలగింపులకు గురయ్యారు. 4పిఎం న్యూస్ వంటి కొందరిపై ఒకటి కంటే ఎక్కువసార్లు ఆన్‌లైన్ ఆంక్షలు విధించబడ్డాయి. హైకోర్టులు అప్పుడప్పుడు ఖాతాల స్థాయి తొలగింపులను రద్దు చేస్తూ వ్యక్తిగత పోస్టులు లేదా వీడియోల కోసం అప్పీళ్ల ప్రక్రియలను కొనసాగించడానికి అనుమతిస్తున్నాయి.



