
నవతెలంగాణ – రాయపర్తి
ఆర్ఎంపిలు గ్రామాల్లో నిబంధనల మేరకే వైద్య సేవలు అందిస్తున్నామని గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు ఎండి నాయిమ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు చేసే వైద్య సేవ గురించి సుదీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు నాయిమ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్ఎంపీలు అత్యవసరమని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే గ్రామీణ వైద్యుల సంఘం తరపున మేమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ గత 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించడం బాధాకరమన్నారు. ఆర్ఎంపీల వృత్తి నిలిపివేస్తే ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సంఘం మండల కార్యదర్శి ఎండి అప్సర్ పాషా, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, సీనియర్ సభ్యులు బండ్ల యాదగిరి, ఎనగందుల శ్యాంసుందర్, మహేందర్, శ్రీనివాస్, జగదీష్, రవి, తదితరులు పాల్గొన్నారు.