ఐటీ కంపెనీల్లో కార్మిక చట్టాల సడలింపును ఖండిస్తున్నాం

– కేంద్ర బీజేపీ ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర సర్కారు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐటీ కంపెనీల్లో నాలుగేండ్ల పాటు కార్మిక చట్టాల అమలును సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. కార్మిక చట్టాల మినహాయింపు, లేబర్‌ కోడ్‌ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కర్నాటకలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. కనీస వేతనాలు పెంచకుండా యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గటం, మోడీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తామని పత్రికలకు లీకులివ్వడం, ఐటీ పరిశ్రమలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపునివ్వడం వంటి చర్యలను చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాటలోనే తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కారు పయనిస్తున్నదని అర్ధమవుతున్నదని విమర్శించారు. పని వేళలు, పని ప్రదేశంలో భద్రత, రవాణా సౌకర్యాలు, వేతనాలు, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి షరతులను అమలు చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. సౌకర్యాల కల్పన అమలుపై ఐటీ పరిశ్రమల్లో కార్మిక శాఖ తనిఖీలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. రాత్రి షిఫ్టుల కారణంగా మహిళలు ఎక్కువగా అసౌకర్యానికి గురవుతున్నారనీ, అందుకే చాలామంది షిఫ్ట్‌ డ్యూటీలను ఇష్టపడరని తెలిపారు. కంప్యూటరైజేషన్‌, పరిశ్రమల్లో అధునాతన యంత్రాలు ఆవిష్కరణ జరిగినపుడు పనిగంటలు తగ్గాలిగానీ పెరగడమేంటని ప్రశ్నించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటమే ఏకైక మార్గమనీ, అందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Spread the love