– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు
నవతెలంగాణ – కరీంనగర్
ప్రభుత్వ పాఠశాలల్లో 10వతరగతి చదువుతూ అవసరం ఉన్న బాలికలు అందరికీ సైకిళ్లను అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజరు కుమార్ చెప్పారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం ద్వారా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల బాలికలు వంద మందికి సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటి బచావో – బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆడపిల్లలు భారం కాదని.. కుటుంబానికి, సమాజానికి భరోసా అని అన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కిశోర శక్తి, బేటీ బచావో – బేటీ పడావో, జన్మోత్సవ్, ముద్ర యోజన వంటి పథకాల ద్వారా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని వివరించారు. ఆడపిల్ల ఉన్న ఇల్లు పండగ వాతావరణంలో ఉంటుందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివే ఆడపిల్లలకు సైకిల్స్ అందిస్తామని తెలిపారు. బాలికల హాస్టల్‌లో వాషింగ్ మిషన్ వంటి ఉపకరణాలు అందిస్తామన్నారు. అంతకుముందు పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పాఠశాలకు దూరంగా ఉండి సైకిల్ లేని వారిని గుర్తించి వంద మందికి అందజేస్తున్నామని అన్నారు. ఇందులో 30సైకిళ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిందని తెలిపారు. జిల్లాలో స్నేహిత కార్యక్రమం ద్వారా కెరియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలపై బాలికలకు అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంధుల పాఠశాలలో వాషింగ్ మిషన్లు అందించామని తెలిపారు. జిల్లాలో పదో తరగతి మధ్యలో ఆపేసిన 110 మంది విద్యార్థులను గుర్తించి వారందరికీ పరీక్ష రాయించామని, 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించాలని వివరించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఆడపిల్లల స్వీయ రక్షణకు పోలీస్ శాఖ తరఫున అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నాటకాలు, నృత్యాలు, ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశారు, ట్రైనీ కలెక్టర్ అజరు యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఎస్‌బీఐ ఏజీఎం ఎస్.వెంకటేష్ పాల్గొన్నారు.