ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడు కావాలి..

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడు కావాలి..– బ్లాక్‌ మెయిల్‌ దందాలకు కేరాఫ్‌ తీన్మార్‌ మల్లన్న
– విద్యావంతుడైన రాకేష్‌రెడ్డిని గెలిపించండి : నకిరేకల్‌ పట్టభద్రుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-నకిరేకల్‌
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు ప్రజా ప్రతినిధి కావాలే తప్ప.. తొత్తుగా ఉండేవాడు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణ కేంద్రంలోని సువర్ణ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో పట్టబద్రులు విచక్షణతో ఓటేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ అని చెప్పి మోసం చేసిండని విమర్శించారు. ధాన్యం బోనస్‌ విషయంలో కూడా మాట తప్పిండన్నారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలాడి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 30వేల ఉద్యోగాల కోసం కేసీఆర్‌ రిక్రూట్‌ మెంట్‌ చేస్తే వాటికి ఇప్పుడు కాగితాలు పంచుతూ.. తామే ఉద్యోగాలిచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి గొప్ప విద్యావంతుడు.. ఆయనకు ఓట్లు వేస్తే ప్రభుత్వంపై కొట్లాడి పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తాడు అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పచ్చి బ్లాక్‌మెయిలర్‌ అని విమర్శించారు. తీన్మార్‌ మల్లన్నపై 56 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో అమ్మాయిలు పెట్టిన కేసులే 10 దాకా ఉన్నాయని అన్నారు. అతన్ని చట్టసభల్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలన్నారు. జీవో 46ను రద్దు చేసేందుకు మా ప్రభుత్వంలో అన్ని సిద్ధం చేసినం.. దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నికల కోడ్‌ వచ్చి ప్రాసెస్‌ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో చెడ్డవాన్ని గెలిపిస్తే సమాజం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్‌ చైర్మెన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, నాయకులు చెరుకు సుధాకర్‌, దూదిమెట్ల బాలరాజు పాల్గొన్నారు.

Spread the love