వెన్నంటే ఉంటాం

– ఇంటి స్థలం దక్కేవరకూ పోరాడుదాం : కేరళ ఎంపీ డాక్టర్‌ వి.శివదాసన్‌
– పేదల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-ములుగు డెస్క్‌
వాజేడు మండలంలోని సర్వే నెంబర్‌ 11లో ఇంటి జాగా కోసం పోరాటం చేస్తున్న పేదలకు స్థలాలు దక్కే వరకు వెన్నంటే ఉంటామని కేరళ ఎంపీ డాక్టర్‌ వి.శివదాసన్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా వాజేడులో భూపోరాట ప్రాంతంలో ”కూలి రేట్లు-ఉపాధి అవకాశాలు- భూ సమస్య’పై గ్యానం వాసు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పేదలకు భూములు ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వాలు అంబానీకి, ఆదాని కార్పోరేట్‌ శక్తులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారు లకు ప్రభుత్వ భూములను అంటగడుతున్నాయ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఇంటి జాగా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు. ఇదే స్థలాన్ని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే వెంటనే పంపకాలు చేసేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ.. పేదలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ భారాలు మోపుతున్నదని విమర్శించారు. కేరళలో వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం రూ.1600 పింఛన్‌ ఇస్తున్నదని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తున్నదని తెలిపారు. ఇక్కడ ఎన్నికల సమయంలోనే పాలకులకు పేదలు గుర్తుకొస్తారని విమర్శించారు. పేదల భూ పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని, పోరాటం విజయవంతం అయ్యే వరకు అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలను గుర్తించి ప్రభుత్వ భూములు పంచాలని, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 67 కేంద్రాల్లో వేలాది మంది స్థలాలను ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్నారన్నారు. పాలక పార్టీలు పేదల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి అనేక కుయుక్తులకు పాల్పడుతున్నాయన్నారు. వాటిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, పోన్నం వెంకటేశ్వర్లు, కనకయ్య రైతు సంఘం నాయకులు సూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love