Wednesday, July 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

- Advertisement -

ఇందిరమ్మ పాలనలో సంక్షేమం, అభివృద్ధి
గృహజ్యోతితో అర్హులందరికీ ఉచిత విద్యుత్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గద్వాల జిల్లాలో రూ.376.25 కోట్ల విలువైన
విద్యుత్ ఉప కేంద్రాలు ప్రారంభం

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పాలమూరు జిల్లాలోని పెండింగ్‌ ‌సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చాపర్ లో వచ్చిన డిప్యూటీ సీఎంకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు ఇతర జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలంపూర్ నియోజకవర్గంలోని జులేకల్ కు చేరుకున్న భట్టి జులేకల్‌, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రాలను ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు, సాంస్కతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు.అనంతరం మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు గ్రామానికి మంత్రులు చేరుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో మంత్రులను సన్మానించారు. ఈ సందర్భంగా గద్వాల నియోజకవర్గంలో కుర్తిరావులచెరువుతోపాటు ఆరగిద్ద, తుమ్మలచెరువు, సోంపురం, పరుమాల, తురుకోనిపల్లి, పెద్దపాడు, ఉలిగేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలను మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. గట్టు మండలం రాయపురం వద్ద రూ.48 కోట్ల నిధులతో 132/33 కెవి విద్యుత్ ఉప కేంద్రం, గద్వాల మండలం గోనుపాడు గ్రామం వద్ద రూ.3.05 కోట్ల నిధులతో జిల్లా స్టోర్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం రేవత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ లో వలసలను సంపూర్ణంగా రూపుమాపి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశామన్నారు. అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకంలో అర్హులైన ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఏడాదికి రూ. 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందజేస్తున్నా మన్నారు. రాబోయే ఐదేండ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే ధ్యేయంగా ముందు కెళ్తున్నామన్నారు. ఇటీవల రైతుల ఖాతాల్లో రూ. 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమాను వర్తింప చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం, వడ్లకు రూ. 500 బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో రూ.10 లక్షల వైద్య సేవలు వంటి పథకాలు ప్రజాపాలనలోనే సాధ్యమన్నారు. ఎంపీ మల్లు రవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో కలిసి కేక్ కట్‌‌చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మెన్ గట్టు తిమ్మప్ప, గొర్రెలు, మేకల అభివద్ధి కార్పొరేషన్ చైర్‌ ‌పర్సన్‌ సరిత, గద్వాల మార్కెట్ యార్డ్ చై‌ర్మెన్ హనుమంతు, మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, సంస్థ డైరెక్టర్లు శివాజీ, నరసింహులు, రూరల్ జోన్ సీఈ బాలస్వామి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఇన్‌‌చార్జి ఎస్‌ఈ నాగరాజు, డీఈ రవి ప్రసాద్ పాల్గొన్నారు.

​కాంగ్రెస్‌ గ్రూపుల మధ్య తోపులాట భట్టి విక్రమార్క పర్యటనకు ముందు ఉద్రిక్తత
మల్దకల్: మండలం కుర్తిరావులచెరువు గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌‌కు చెందిన రెండు గ్రూపుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంత్రి రాకముందు ఫ్లెక్సీల గొడవ షురూ కావడంతో వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనితో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి కార్యకర్తల గొడవ సద్దుమణిగేలా చేశారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -