Tuesday, July 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పగలే వెన్నెల కాయించిన స్వరం

పగలే వెన్నెల కాయించిన స్వరం

- Advertisement -

వినేకొద్దీ ఇంకా వినాలనిపించే తేటతెనుగు స్వరమాధుర్యం ఆమె సొంతం. అర్ధ శతాబ్దానికి పైగా అసంఖ్యాకమైన శ్రోతల గుండెల్లో తియ్యగా ప్రవహిస్తున్న అమృత గాత్రం ఆమె సొంతం. తెలుగుతోపాటు అనేక భాషల్లో 50 వేలకు పైగా పాటలు ఆలపించారు. పాటల ప్రపంచానికి మహారాణి ఎస్. జానకి. ఊహ తెలిసినప్పటి నుంచే సభలలో ముద్దుముద్దు పాటలతో అలరించేది. సహజసిద్ధమైన గాయినైన ఆమెకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ ప్రకటించినా… దక్షిణాది గాయకులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే ఆవేదనతో ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసిన ఈ కమ్మని పాటల కోయిలమ్మ భౌతికంగా మనకు దూరమైనా ఆమె పాట సజీవం.. అక్షరామరం.. ఐదారేండ్ల ముందు ఆమెతో నేను జరిపిన సంభాషణను ఈరోజు మీతో పంచుకుంటున్నాను.

1993 తమిళంలో నాలుగుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నాను. కేరళ రాష్ట్ర ప్రభుత్వంచే 13 సార్లు ‘ఆవార్డులు అందుకున్నాను. తమిళ రాష్ట్ర ప్రభుత్వంచే 6 పర్యాయాలు అవార్డులు అందుకున్నాను. 10 సార్లు నంది ‘ అవార్డులు అందుకున్నాను. 1986లో స్వరలయ కేజే యేసుదాస్ అవార్డు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంచే ఒక అవార్డు, 2009లో మైసూరు యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్, 2011లో కర్ణాటక వారి బసవ భూషణ్ అవార్డు అందుకున్నాను. మొత్తం 32కి పైగా అత్యున్నత పురస్కారాలు అందుకున్నాను.

అమ్మా.. మీ బాల్యం, మీ జీవిత విశేషాల గురించి తెలియజేయండి?
మాది గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామం. నేను 1938 ఏప్రిల్ 23న జన్మించాను. మా అమ్మానాన్నలు శిష్ట శ్రీరామమూర్తి, సత్యవతి. మా నాన్న ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యులు. నాన్న ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కొంతకాలం ఉన్నాం. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చాం. నాకు 1958లో వి. రామ ప్రసాద్‌తో పెండ్లి జరిగింది. 1960లో మాకు బాబు పుట్టాడు. పేరు మురళీ కృష్ణ. 1997లో మా వారు గుండెపోటుతో మరణించారు. మా మురళీకృష్ణకు ఉమ అనే అమ్మాయితో పెండ్లి జరిగింది. ఉమ చక్కని డ్యాన్సర్‌. మేమంతా కలిసి చెన్నైలోనే ఉంటున్నాం.

మీకు సంగీతంపై ఆసక్తి ఎలా కలిగింది? ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
చిన్నప్పటి నుంచి నాకు సంగీతం పట్ల ఎంతో మక్కువ. 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నా. సినీ సంగీతం నన్ను చిన్నతనంలోనే బాగా ఆకర్షించింది. లతామంగేష్కర్ పాటలు చిన్నతంలో ఎక్కువగా పాడుతుండేదాన్ని. ఎన్ని సంగీత శిక్షణ కార్యక్రమాల్లో పాడినా నా మనసంతా సినీ సంగీతంవైపే మొగ్గుచూపేది.

సినీరంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు? మొదట ఏ పాట పాడారు?
19 ఏండ్ల వయసులో 1957లో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ‘విధియిన్ విలయాట్టు’ అనే తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించాను. తర్వాత తెలుగులో మాత్రం ఎమ్మెల్యే సినిమాలోని ‘నీ ఆశా.. ఆడియాశ.. చెయి జారే మణిపూస’ పాటతో గాయనిగా చిత్ర రంగంలో అడుగుపెట్టాను.

గాయనిగా తొలినాళ్లలో మీ అనుభవాలు, విశేషాల గురించి వివరించండి?
తొలినాళ్లలో ఏవీఎం స్టూడియో గాయనిగా పాడిన నేను, 1957లో ఎమ్మెల్యే సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాను. ఆ తర్వాత నా సినీ ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. ఆ తర్వాత అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. మా శ్రీవారి ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఆయన నన్ను వృత్తిపరంగా చాలా ప్రోత్సహించేవారు. నేను ఏ రికార్డింగ్‌‌కి వెళ్లినా, కచేరీకి వెళ్లినా నా వెన్నంటి ఉండేవారు. కృషి, పట్టుదలతో సాగాను. ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ సినీ ప్రస్థానంలో నా స్థానాన్ని నిలబెట్టుకున్నాను.

మీరు ఇప్పటికి ఎన్ని పాటలు పాడారు? ఎన్ని భాషల్లో పాడారు?
50,000కు పైగా పాడాను. అందులో కొన్ని ప్రైవేటు గీతాలు కూడా ఉన్నాయి. సినిమాల్లో అన్ని రకాల పాటలూ పాడాను. ప్రైవేటు గీతాల్లో అయితే భక్తి పాటలు, ప్రబోధగీతాలు, జానపద గీతాలు పాడాను. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, ఒరియా, జపనీస్, జర్మనీ, తుళు, బీడుగ, సింహళం, హిందీ వంటి భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా పాడాను.

మీకు బాగా పేరు తెచ్చిన పాటల గురించి చెబుతారా?
తెలుగులో ‘నీ లీల పాడెద దేవా, నరవరా ఓ సురవరా, పగలే వెన్నెల.. జగమే ఊయల, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మ మీద, ఈ దుర్యోధన దుశ్శాసన, హిందీలో దిల్ మే హెూతుం, ఆయా జబ్‌‌సే, ప్యార్‌‌బినా, కన్నడంలో గగనవు ఎల్లో, శివశివ ఎన్నద, భారత భూషిర, తమిళంలో సింగారే వేలనలే దేవా, మచ్చాన పాదింగల, పాన్ వానం, మలయాళంలో సంధ్యే కన్నీరు తందే, కిలియే కిలియే, మలం కోడి పోలే, స్వర్ణముఖిలే ఒరియాలో గోరా గోరా, పాదోరే పాదో చందా, జపనీస్‌‌లో సయో నారో టోక్యో, జర్మనీలో ఇచ్‌రిబె డిచ్, తుళులో ఎక్కనక, సింహళీలో హండిని సు రంబుంగే, బాదుగలో నాగరిహోలి యో అమ్మాలే, ఇంగ్లీష్ హెలో హెలో డార్లింగ్, మ్యాన్ హ్యాస్ సెట్‌‌హిస్‌ ఫుట్ ఆన్ మూన్’ ఇలా చాలా పాటలు ఉన్నాయి.

మీ సహ గాయకుల గురించి చెప్పండి? వారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
నేను ఘంటసాల, పి. సుశీల, పి.లీల, మహమ్మద్ రఫీ, పి.బి. శ్రీనివాస్, కేజె యేసుదాస్, లతామంగేష్కర్, ఆశా భోంస్లే, పి. జయచంద్రన్, వాణీ జయరాం, ఎల్ఆర్. ఈశ్వరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, చిత్ర, సుజాత ఇలా.. ఎందరో గాయనీగాయకులతో కలిసి పనిచేశాను. అందరూ నాతో ఆప్యాయంగా, కలుపుగోలుగా ఉంటారు.

మీరు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారా?
‘మౌనపోరాటం’ సినిమాకు చేశాను. భానుమతి, పి. లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా నా పేరుంది.

ఐదు తరాల అభిమానులను సొంతం చేసుకున్న అద్భుత గళం మీది. మీరు మిమిక్రి తరహాలో కూడా పాటు పాడగలరు. అన్ని తరాల భిన్నమైన స్వరాలను మీ గళంలో పలికించడం ఎలా సాధ్యమైంది?
మొదట్లో చిన్నపనిల్లల కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. అలా కొన్ని పాటలు బాగా వచ్చాయి. అంతే…

మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి?
1993 తమిళంలో నాలుగుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నాను. కేరళ రాష్ట్ర ప్రభుత్వంచే 13 సార్లు ఆవార్డులు అందుకున్నాను. తమిళ రాష్ట్ర ప్రభుత్వంచే 6 పర్యాయాలు అవార్డులు అందుకున్నాను. 10 సార్లు నంది అవార్డులు అందుకున్నాను. 1986లో స్వరలయ కేజే యేసుదాస్ అవార్డు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంచే ఒక అవార్డు, 2009లో మైసూరు యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్, 2011లో కర్ణాటక వారి బసవ భూషణ్ అవార్డు అందుకున్నాను. మొత్తం 32కి పైగా అత్యున్నత పురస్కారాలు అందుకున్నాను. ముఖ్యంగా 2013లో భారత ప్రభుత్వం నన్ను ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది. కానీ దక్షిణ భారతీయ గాయకులకు సరైన గుర్తింపు లభించలేదన్న బాధతో ఆ అవార్డును తిరిగి ఇచ్చివేశాను.

ఇప్పుడు పాటలు పాడుతున్న గాయకులపై మీ అభిప్రాయం?
అందరూ చాలా చక్కగా పాడుతున్నారు. మరింత సాధన చేస్తే ఇంకా బాగా పాడగలుగుతారు.

మీరు పాడిన చివరి పాట ఏది?
2016లో మలయాళం సినిమాకు పాడాను. 2017లో మైసూరులో ఒక స్టేజ్ షోలో పాడాను. ఆ తరువాత ఇక పాడలేదు.​

మీ గానం, మీ స్వరం సంగీత చరిత్రలో ఒక నూతన శకాన్ని సృష్టించారు. ప్రపంచ స్థాయి గాయనిగా మీరు సాధించిన ఘనత అని తరసాధ్యం. నేటి గాయకులకు, గాయనీమణులకు ఆదర్శంగా నిలిచారు. మరి ఇప్పుడు ఎలా కాలం గడుపుతున్నారమ్మా?

ఇప్పుడు నా వయసు 83 ఏండ్లు. ఆ పాత మధుర గీతాలతో కాలక్షేపం చేస్తున్నాను. ఆరోగ్యం కూడా బాగుంది.

డా. తిరునగరి శరత్ చంద్ర (జానకమ్మ యాదిలో)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -