కార్మిక, కర్షక ఉద్యమాలతో పేదల పోరాటాలు విస్తరిస్తాం

– మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్‌, కమ్యూనల్‌ విధానాలను ప్రతిఘటిస్తాం : ఎఐఎడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ అనుసరిస్తున్న విధానాలను విశాల ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పదేండ్లుగా కార్పొరేట్‌, మతోన్మాద విధానాలతో దేశాన్ని అస్తవ్యస్తం చేస్తోందని అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది ప్రజల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నమ్మబలికిన మోడీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాడని విమర్శించారు. ఫలితంగా వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కార్మికుల ఆకలి చావులు పెరిగిపోయాయని తెలిపారు. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం ఒక సంవత్సర కాలంలో లక్షా అరవై వేల మందికిపైగా రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోడౌన్‌లలో మూలుగుతున్నా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరగటం, ఆకలి సూచీలో ప్రపంచంలో దేశం 111వ స్థానంలో చేరటం మోడీ విధానాల దుష్ఫలితమేనని తెలిపారు. కార్పొరేట్‌ విధానాలను ప్రతిఘటిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా రెచ్చగొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోన్నదని అన్నారు. ఇప్పటివరకు గ్రామీణ పేదలను కూడగట్టి ఉద్యమాలు సాగిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య సంఘటన రానున్న కాలంలో కార్మిక కర్షక సంఘాలతో పట్టణాలకు విస్తరించి మోడీ దుష్ట విధానాలను ఎదుర్కొంటుందని తెలిపారు. అందులో భాగంగా జనవరి 19న కార్మిక కర్షక మైత్రి దినోత్సవం నిర్వహిస్తున్నామని, జనవరి 26న దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ట్రాక్టర్‌, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 1 నుండి15 వరకు కోట్లాది మందితో సంతకాల సేకరణ, ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా హర్తాల్‌, సభలు, సమావేశాలు జరుపుతామని పిలుపునిచ్చారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం అత్యంత నిర్బంధం ప్రయోగిస్తూ దుర్మార్గపు ఆలోచనతో ఏస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనూ, ఎన్నికల్లో అధికారంలోకి రాగానే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీలను మరిచి నేడు అత్యంత నిర్బంధం ప్రయోగిస్తున్నారని విమర్శించారు. తక్షణం ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో గుడిసెలు వేసుకున్నారని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వకుండా నిర్బంధం ప్రయోగించి, గుడిసెలను తొలగించిందని , ఇప్పుుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని అన్నారు.
తెలంగాణాలో పేదల గుడిసెల తొలగింపు సీఎం రేవంత్‌ రెడ్డికి తెలిసే జరుగుతుందా? అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, దౌర్జన్యాలను సహించరని అన్నారు. తక్షణమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు తక్షణమే ఇండ్ల పట్టాలను ఇవ్వాలని కోరారు.

Spread the love