వక్ఫ్ బోర్డ్ భూమి ఆక్రమణ పై రాష్ట్రవ్యాప్త ధర్నాలతో పాటు న్యాయపోరాటం చేస్తాము

– ఆవాజ్  జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్.
నవతెలంగాణ – సూర్యాపేట
పట్టణంలోని  ఫైర్ స్టేషన్ వెనుక ఉన్న వక్ఫ్ బోర్డ్ భూమి ఆక్రమణ పై రాష్ట్రవ్యాప్త ధర్నాలతో పాటు న్యాయపోరాటం చేస్తామని ఆవాజ్  జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇందుకు గాను అవసరమైతే అవాజ్ రాష్ట్ర కమిటీతో కలిసి హైదరాబాద్ లోని వక్ఫ్  బోర్డ్ ఆఫీస్ ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. పీర్ల కొట్టం కు సంబంధించిన  సర్వేనెంబర్ 639 విస్తీర్ణం 1,20 గుంటల భూమి వక్ఫ్  బోర్డ్ గెజిట్ గా నమోదై ఉన్నదని తెలిపారు. అదేవిధంగా సర్వే కమిషన్ రిపోర్ట్ కూడా నమోదైనదని వివరించారు. రెవిన్యూ రికార్డులో కూడా ఇనామ్ ల్యాండ్ గా పీర్ల కొట్టం ఉన్నదని దీనికి సంబంధించి ఓ ఆర్ సి సర్టిఫికెట్ పీర్ల కొట్టం పేరు మీద  ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇదిగాక గతంలో కూడా లోకాయుక్త ఆదేశాలతో 639 సర్వేనెంబర్ రెవిన్యూ ,వక్ఫ్ బోర్డు వారు సంయుక్తంగా సర్వే చేయడం జరిగిందని పేర్కొన్నారు. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, జిల్లా సర్వేయర్, మండల సర్వేయర్ లు సర్వే రిపోర్ట్ ప్రకారం 639 సర్వే నెంబర్ ని వక్ఫ్ బోర్డు గా గుర్తించడం జరిగిందని తెలిపారు.1952 కాసర పహానిలో పీర్ల కొట్ట ఇనామ్ ల్యాండ్ గా నమోదైనదని పేర్కొన్నారు. అదేవిధంగా  ధరణి లో కూడా 639 సర్వే నెంబర్ లోని భూమి పీర్ల కొట్టం వక్ఫ్ భూమిగా వున్నదని తెలిపారు.  కాగా గొట్టి గొర్ల సత్యనారాయణ అనే అతను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఈ భూమికి సంబంధం లేని యూసుఫ్ అనే వ్యక్తి నుండి 30 గుంటలు కొనుగోలు  చేసినట్టుగా భూమికి హైకోర్టు ద్వారా డాక్యుమెంట్ అమలు చేసుకోవడానికి ఉత్తర్వులు తెచ్చుకోవడం వక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకమని పేర్కొన్నారు. తెచ్చిన డాక్యుమెంట్ కు పీర్ల కొట్టం సర్వేనెంబర్ కు సంబంధం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం వక్ఫ్ భూముల పరిరక్షణకై  సి బి సి ఐ డి తో  ఎంక్వయిరీ చేయించినప్పుడు కూడా  ఈ భూమిని కూడా విజిట్ చేయడం జరిగిందని తెలిపారు. వక్ఫ్ భూములను అమ్మకూడదు కొనకూడదని చట్టం ఉండగా  కొంతమంది అక్రమ కాగితాలను సృష్టిస్తూ భూములు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కోట్ల విలువ చేసే భూమిని కాజయాలని చూస్తూ  అక్రమంగా ప్రైవేట్ బౌన్సర్లతో ఫినిషింగ్ చేస్తూ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.  దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ సీఈవో, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సబ్ రిజిస్టర్ లు ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో  జిల్లా స్థాయిలో  ధర్నాలు చేస్తామని  ఆయన తెలిపారు.
Spread the love