
నవతెలంగాణ-సిద్దిపేట
పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎన్నికల్లో వస్తె అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వ రంగ విద్యానూ తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుండి 5177 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది విద్యకి దూరం అవుతున్నారని, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని పథకాన్ని ప్రవేశపెట్టారే తప్ప ఇప్పటివరకు ఆ పథకం అమలు జరిగింది లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, ఎస్ ఎం హచ్ హాస్టల్లు అద్దె భవనాలలో నడుస్తున్న, దారుణమైన పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ప్రభుత్వవిద్య అందని ద్రాక్షగా మారుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను, లెక్చలర్ల పోస్టులను, డిఇఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కేజీ బివి, మోడల్ స్కూల్స్, యూనివర్సిటీ, విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్స్ , కాస్మెటిక్ చార్జీలను వెంటనే పెంచాలని కోరారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన డబ్బులను విడుదల చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డ మైన అరవింద్, దాసరి ప్రశాంత్, ఉపాధ్యక్షులు కొండం సంజీవ్, అముదల రంజిత్, సహాయ కార్యదర్శి నాచారం శేఖర్, నాయకులు భాను, హరీష్, నవీన్, స్టాలిన్, ప్రవీణ్, కుమార్ పాల్గొన్నారు.