వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తాం..

– జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు.
– అవినీతి పాలన, అవకాశవాద రాజకీయాలను ఓడించాలి
– రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ 
– పేదల బ్రతుకు, బద్రతకు బరోసా ఎర్రజెండాను గెలిపించాలి.
– అభ్యర్థి భూక్యా వీరభద్రం
నవతెలంగాణ- వైరా టౌన్: సాగునీరు, గిట్టుబాటు ధరలు, వ్యవసాయ మార్కెట్ తదితర రైతుల సమస్యల నిత్యం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంను వైరా ప్రజలు ఆదరించాలి గెలిపిస్తే కృష్ణ, గోదావరి, సాగర్ జలాలను వైరా రిజర్వాయరుకు తీసుకువచ్చి ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత సీపీఐ(ఎం) పార్టీ తీసుకుంటుందని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు.  శుక్రవారం వైరా మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ(ఎం) వైరా అసెంబ్లీ అభ్యర్థి భూక్యా వీరభద్రం ఎన్నికల ప్రచారాన్ని విసృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముసలిమడుగు గ్రామంలో అమరజీవి నర్వనేని సత్యనారాయణ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన పలు సభలలో బొంతు రాంబాబు మాట్లాడుతూ బోడేపూడి వెంకటేశ్వరరావు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రైతులకు అండగా నిలిచారని, ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి ఒప్పించి, అర్థరాత్రి కాలువ కట్టలపైన తిరిగి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించిన చరిత్రను గుర్తు చేశారు. పోరాడి సాగునీటి ప్రాజెక్టులు సాధించిన కమ్యూనిస్టులను చైతన్యవంతమైన వైరా ప్రజలు ఆదరించాలని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పైన ఓట్లు వేసి భూక్యా వీరభద్రంను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి పాలన, అవకాశవాద రాజకీయాలను ఓడించాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంను గెలిపించాలని, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే పేద ప్రజలు, రైతులు, బుడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడతారని, ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను నిలదీస్తారని అన్నారు. భూక్యా వీరభద్రంకు ప్రజా సమస్యల పైన పోరాడిన అనుభవం ఉందని, గిరిజనులు, రైతులు, కార్మికులు, కూలీలు, పేద ప్రజల సమస్యల మీద పోరాడుతున్న పోరాట యోధుడు భూక్యా వీరభద్రం అని కొనియాడారు. ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గంలోని  ప్రతి సమస్య పైన నిత్యం రాజీలేని  పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉన్నదని అన్నారు.
అభ్యర్థి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ పేదల బ్రతుకు, భద్రతకు భరోసా ఎర్రజెండా అని, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధమ్ము, ధైర్యం ఉందని, తనను గెలిపిస్తే ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తానని, ప్రజలందరి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుక అవుతానని,  ప్రజా సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున నికరంగా నిలబడి నిజాయితీగా  పోరాడుతున్న తన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బాజోజు రమణ, తూము సుధాకర్, బాణాల కృష్ణమాచారి, మాగంటి తిరుమలరావు, ద్రోణాదుల నాగేశ్వరరావు, షేక్.జానీమియా, తోటకూర రామయ్య, మేడా శరాబంధి, గుడిమెట్ల మోహనరావు, షేక్.మొహిద్దీన్‌, షేక్.ఖాదర్, చింతనిప్పు చంద్రరావు, వాగదాని క్రిష్ణయ్య, కొల్లి వెంకటేశ్వర్లు, బాణాల క్రిష్ణమాచారి, నారికొండ అమరేందర్, ఎనమద్ది రామకృష్ణ, దేవబత్తిని వెంకటేశ్వరరావు, షేక్.రెహానా,  షేక్.పాతిమా, షేక్.మజీద్ బీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love