ప్రజలు ఆలోచించాలి.. కమ్యూనిస్టులను బలపరచాలి

– ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతున్న సీపీఐ(ఎం)ను గెలిపించండి.
– వైరా నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్దిగా భూక్యా వీరభద్రం ఫోటి.
– నవంబర్ 10న వైరా సీపీఐ(ఎం) అభ్యర్థి నామినేషన్.
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ- వైరాటౌన్:
రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత సమాజంలో చట్టసభలలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం చాలా ఉన్నదని. ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని, ఓట్లు వేసి గెలిపించాలని, అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, వైరా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యంతో ఆలోచించి సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా  వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) పార్టీ వైరా నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆదివారం వైరా పట్టణంలోని మధు విద్యాలయం నందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు  అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి బీజేపీ బలపడుతూ వచ్చిందని, బీజేపీ పెరగకుండా నిలువరించేందుకు మునుగోడు ఎన్నికలలో వామపక్షాలు బీఆర్ఎస్ ను బలపరిచాయని, బీజేపీని ఓడించగలిగే పార్టీకి సీపీఐ(ఎం) మద్దతు ఇవ్వాలనే పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో ఎన్నికల సర్దుబాటుకు ప్రయత్నించామని, కానీ కెసిఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకోవడంతో బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్నామని అన్నారు. తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి ఎన్నికలలో కలిసి పోదామని కోరడంతో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నం చేశామని, కాని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ అడిగిన స్థానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానపరచిందని, చివరికి వారు ఇస్తానన్న మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలను కూడా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు.
         మునుగోడు ఎన్నికలప్పుడు కేసీఆర్ సీపీఐ(ఎం) మద్దతు అడిగారని, ఆ తర్వాత కూడా  ఇది కొనసాగుతుందని కెసిఆర్ చెప్పారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే కలిసి పోటీ చేద్దామని అన్నారని, సీపీఐ(ఎం) పార్టీ పొత్తుల కోసం ఎవరితో వెంపర్లాడటం లేదని, బీజేపీని ఓడించడమే సిపిఎం ప్రధాన లక్ష్యం అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ నవంబర్ 10 వ తేదీన వైరా నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం నామినేషన్ దాఖలు చేస్తారని, నామినేషన్ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి సీపీఐ(ఎం) సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. కార్యకర్తలందరూ తమ శక్తినంతటిని కూడగట్టుకుని, ఉద్యమ ప్రతిష్ట నిలుపుకునే విధంగా, పార్టీ పునాదిని పెంచుకునే విధంగా పనిచేయాలని సీపీఐ(ఎం) అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త ఓక సైనికుడిగా పనిచేయాలని కోరారు. డబ్బులు, అధికారం,  పదవుల కోసం పార్టీలు మారే వారిని కాకుండా ప్రస్తుత ఎన్నికలలో నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి భుక్యా వీరభద్రంను గెలిపించాలని కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ సీపీఐ(ఎం) సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని, ఎర్రజెండా గురించి అవాకులు, చవాకులు పేలుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. బూర్జువా పార్టీలకు,  పెట్టుబడిదారులకు కమ్యూనిస్టు అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం ఇష్టం ఉండదని, కార్యకర్తలు అందరూ ఇష్టంగా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎన్నికలలో కేవలం డబ్బులు మాత్రమే అభ్యర్దిని గెలిపించవని, బూర్జువా పార్టీ అభ్యర్థులందరూ డబ్బులు పంచుతారని, కానీ ఒక అభ్యర్థి మాత్రమే గెలుస్తారనే విషయాన్ని సీపీఐ(ఎం) కార్యకర్తలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
     people-should-think-and-strengthen-the-communists   సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గం అభ్యర్థి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వైరా ప్రాంతం రైతు భాందవుడు బోడేపుడి వెంకటేశ్వరరావు నడయాడిన, పరిపాలించిన నేల అని, వైరా నియోజకవర్గంలో గిరిజనులు, పోడు రైతులు, కార్మికులు సమస్యల పైన సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సీపీఐ(ఎం) పార్టీకి ఉందని, పోరాటాల స్ఫూర్తితో కార్మిక వర్గం, ప్రజలు సీపీఐ(ఎం) పార్టీ గుర్తుపై ఓట్లు వేసే విధంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యం  లేకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, దీనిని ప్రజలు అర్థం చేసుకొని వామపక్షాలకు గెలిపించాలని, సీపీఐ(ఎం)కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, పారుపల్లి ఝాన్సీ,  జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, వైరా నియోజకవర్గం పరిధిలోని వైరా రూరల్, కొణిజర్ల, ఎన్కూర్, కారేపల్లి, జూలూరుపాడు మండలాల కార్యదర్శులు తోట నాగేశ్వరరావు,  చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, కుందనపల్లి నరేంద్ర, యాసా నరేష్, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు,‌ ప్రజా ప్రజాసంఘాల బాధ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
Spread the love