Tuesday, August 4, 2026
E-PAPER
Homeబీజినెస్భారత కంపెనీలకు పశ్చిమాసియా మంట

భారత కంపెనీలకు పశ్చిమాసియా మంట

- Advertisement -

పెరుగుతున్న వ్యయ భారం
వచ్చే పండగ సీజన్‌‌లో ధరలకు ఆజ్యం : కార్పొరేట్ల వెల్లడి
న్యూఢిల్లీ :
అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారతీయ కార్పొరేట్ రంగానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ముడిసరుకుల ధరల అస్థిరత, రవాణా ఛార్జీల పెరుగుదల, కరెన్సీ మారకం విలువలో వస్తున్న మార్పుల కారణంగా కంపెనీలు వ్యయ నిర్వహణలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం దేశీయ వ్యాపార రంగం భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐటీసీ, పార్లే, బ్లూ స్టార్, డాబర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎడబ్ల్యూఎల్ వంటి ప్రముఖ సంస్థలు తమ లాభాల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తయారీదారులు ఉత్పత్తుల ధరలను మరింత పెంచక తప్పదని.. ఇది నేరుగా సాధారణ వినియోగదారుల కొనుగోలు శక్తిపై భారం మోపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం తాలూకు ప్రభావం రాబోయే రోజుల్లో అన్ని రంగాల మీద పడే అవకాశం ఉందని, ఇది పండుగ సీజన్ షాపింగ్‌ను కూడా ప్రియంగా మార్చవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పొదుపు చర్యలపై దృష్టి
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు, షిప్పింగ్ సమయాల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యం సరఫరా వ్యవస్థ నిర్వహణను క్లిష్టతరం చేస్తున్నాయని ఎడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ ఎండీ, సీఈఓ శ్రీకాంత్ కన్హే తెలిపారు. ఈ పరిస్థి తులతో తాము ఖర్చుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. రేట్లలో స్థిరత్వం లేకపోవడం వల్ల ఉత్పత్తులకు సరైన ధరలను నిర్ణయించడం కష్టమవుతోందని పార్లే ప్రొడక్ట్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయాంక్ షా వెల్లడించారు. వ్యయాలను తగ్గించుకోవడానికి ఆయా కంపెనీలు పొదుపు చర్యలకు సంకేతాలు ఇచ్చాయి.

త్వరలోనే ధరల సవరణ..
పశ్చిమాసియాలో దీర్ఘకాలిక సంఘర్షణతో పాటు, రుతుపవనాలపై ప్రభావం చూపే ఎల్నినో పరిస్థితులు తదితర అంశాలు ఆర్థిక వృద్ధిని, ద్రవ్యోల్బణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఐటిసి తన త్రైమాసిక నివేదికలో హెచ్చరించింది. సరఫరా చెయిన్‌‌లో ఏర్పడుతున్న అంతరాయాలు స్వల్పకాలంలో వ్యాపారాలకు అనూహ్య సవాళ్లను తెచ్చిపెడతాయని ఆర్‌‌పిజి లైఫ్ సైన్సెస్ ఎండీ అశోక్ నాయర్ అన్నారు. లాభాల మార్జిన్లపై పడుతున్న భారాన్ని బట్టి అవసరమైతే తగిన ధరల సవరణ చర్యలు తీసుకుంటామని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గ్రూప్ సీఎఫ్‌వో ఆశిష్ గోయెంకా స్పష్టం చేశారు.

పెట్టుబడుల వాయిదా..
ఈ అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను వాయిదా వేసే అవకాశం ఉందని బ్లూ స్టార్ ఎండీ బీ త్యాగరాజన్ అభిప్రాయ పడ్డారు. ఇది కొత్త ఉద్యోగాల సృష్టి, విస్తృత డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కష్టతరంగా మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్చులు పెరిగినప్పుడు కంపెనీల మార్జిన్లు, వినియోగదారుల డిమాండ్ రెండూ దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -