‘రానున్నది ఏది నిజం? అది ఒకటే! సోషలిజం’ : దాశరథి

'What is coming true? It's the same! Socialism' : Dasarathiదాశరథి (కృష్ణమాచార్యులు 1927-1987) పేరు వినగానే మనకు అందరికీ జ్ఞాపకం వచ్చేవి ”ఓ నిజాము పిశాచమా!” అనే ఆయన ధిక్కార స్వరం, ”నా తెలంగాణ కోటి రత్నాల వీణ!” అనే తెలంగాణా గౌరవాన్ని, ఘనతను గూర్చి ఎత్తిన ఆయన గళంలోంచి వచ్చిన కవితా పంక్తులు.దాశరధథి గారు అంతటితోనే ఆగిపోలేదు.”ఆస్మాన్‌ గిర్‌ నా- మైు మర్‌ నా (ఆకాశం పడిపోతేనే నేను చనిపోతాను /గద్దె దిగుతాను” అని నిజాం నవాబు ఏనుగులా ఘీంకరిస్తే
దాశరథి
”దిగిపొమ్మని దిగిపొమ్మని”
ఇదే మాట అనేస్తాను…
ఇదే మాట ఇదే మాట
పదేపదే అనేస్తాను…
దగాకోరు బటాచోరు
రజాకారు పోషకుడవు
ఊళ్ళకూళ్ళకగ్గిపెట్టి/ఇళ్ళన్నీ కొల్లగొట్టి/తల్లి పిల్ల కడుపు కొట్టి/నిక్కిన దుర్మార్గమంత/నీ బాధ్యత నీ బాధ్యత…
‘దిగిపొమ్మని జగత్తంత/నగారాలు కొడుతున్నది/దిగిపోవోరు .. దిగిపోవోరు..” అని సింహంలా గర్జించి, నిజాముకు చెమటలు పట్టించాడు.
మహబూబాబాద్‌కు దగ్గరలో ఉన్న చిన్నగూడురులో అత్యంత సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి తిరుగుబాటుకవిగా విప్లవ గొంతును వినిపించారు. ఉర్దూ, సంస్కృతం, ఆంగ్లం, పార్సీ, హిందీ,తెలుగు భాషలలో ప్రావీణ్యం పొంది జాతీయ స్థాయికి ఎదిగారు. ఆనాడు కుటుంబంతో పాటుగా ఖమ్మం జిల్లాలోని గార్లకు చేరుకున్నాక, ఆంధ్ర మహాసభ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టు సమావేశాల్లోనూ పాల్గొని చైతన్యాన్ని నింపుకున్నారు. నిర్భంధాలు, జైళ్లూ, లాఠీదెబ్బలు ఎదురైనా జడవక స్వేచ్ఛకోసం కలాన్ని గళాన్ని ఎక్కుపెట్టారు. తెలంగాణ వీరత్వాన్ని చాటిచెప్పారు.
నిజాం నవాబు, ఆయన తాబేదారుల దుర్మార్గాలను ఎదుర్కొని-
”తెలగాణమ్మున గడ్డిపోచయును సం-ధించెన్‌ కృపాణమ్ము రా
జలలాముండను వాని
పీచమడచన్‌ సాగించె యుద్ధమ్ము ..” ,
”పోరు సల్పిరి వీరాధి వీరులట్లు
భరత వైజయంతి కల స్థాపనమొనర్ప
నెత్తురులు ధారవోసిరి నీళ్ల వోలె
మానితులు నీ సుతుల్‌ తెలంగాణ తల్లి” -అని పోరాట యోధులను ప్రస్తుతించాడు.
నిజామును ధిక్కరించినందుకు నిజామాబాదు జైలు జీవితాన్ని గడిపిన దాశరథి అక్కడి తన అనుభవాలను ‘ఇందుపుర దుర్గము’, ‘జైల్లో’ కవితలలో వివరించారు. ‘జైల్లో’ నే ”నిరుపేదవాని నెత్తురు చుక్కలోనెన్ని-విప్లవాలో!యని వెదకినాను” అన్నారు.
స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం కావలసిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ
”చుట్టూ సముద్రం పొంగి/నట్ట నడిగడ్డను మ్రింగి/ అంతా ఏకం చేస్తుందంతా ఒకటౌతుంది. ./నడిగడ్డను సముద్రాన
పడకుండా కాపాడే/ బడాయి నీకెందుకు రాజా?
లడాయి నీకెందుకు?” అని నిజామును గద్దించాడు
పాలకుల దుర్మార్గాల వల్ల కలిగిన కోపంతో ”నా గీతావళి ఎంత దూరము ప్రయా-ణంబౌనొ అందాక ఈ భూగోళమ్మునకగ్గి వెట్టెదను..”, అనడంతోనే సరి పెట్టుకోక, పేదల పక్షం వహించి:”వీణియతీగపై పదను-పెట్టిన నా కరవాల ధారతోగానము నాలపించెద../
పీడిత ప్రజా-వాణికి మైక్‌ అమర్చి అభ-వాదులకున్‌ వినిపింపజేసెదన్‌” అని ప్రతిజ్ఞ చేశారు దాశరథి
క్రూర నిరంకు శత్వానికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించి, నడిపించడంతో ప్రజా కవితా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన దాశరథి అగ్నిధార, రుద్రవీణ కవితల సంపుటాల మొదటి ముద్రణలు 1949, 1951లో జరిగాయి. ఆ క్రమంలో వారు పుంఖానుపుంఖంగా రచించిన ఛందోబద్ధమైన పద్యాలు, గేయాలు,లలిత గీతాలతో కూడిన సంపుటాలు మహాంధ్రోదయం,పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవ మంజరి,దాశరథీ శతకం,గాలిబ్‌ గీతాలు(అనువాదం), జ్వాలా లేఖిని, ఆలోచనాలోచనాలు, తిమిరంతో సమరం-వంటివి వెలువడి తెలుగు పాఠకులను ఉత్తేజితులను, ఉద్యమోన్ముఖులను చేశాయి. ఈ అన్ని సంపుటాలలోను ఉన్న అంతస్సూత్రం పేదల పట్ల పక్షపాతం,వారి పక్షాన పాలకులతో పోరాడడమే.అందుకే ఆయన ‘నా పేరు ప్రజా కోటి’ అన్నారు.
”అనాదిగా సాగుతోంది సంగ్రామం అనాథుడికీ ఆగర్భ శ్రీమంతుడికీ మధ్య”
అనే చారిత్రక వాస్తవాన్ని చెప్పి ‘దీన పరాధీన జాతి’ ని మేలుకొలిపాడు
”మనం వెనక్కి నడవం/జనం వెనక్కి నడవదు/మనం,జనం-జనం మనం/జనం లేంది మనం లేము”అని
‘నవభారత యువకులారా!’
అని యువత కర్తవ్యాన్ని నిర్దేశించాడు
”ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో?” అని ఆవేదన పడడమే కాక,
”కరువంటూ కాటకమంటూ కానరాని కాలాలెపుడో? అన్నార్తులు అనాథలుండని
ఆ నవయుగమదెంత దూరమో?”-
అంటూ దోపిడీ లేని, సమాజాన్ని కోరుకున్నాడు.
తెలంగాణ పౌరుషాన్ని చాటడంతోపాటు ఈ గడ్డ ఆత్మీయ తను,లాలిత్యాన్ని మాతృత్వాన్ని వర్ణిస్తూ-
‘నా తెలంగాణ తల్లి
కంజాత వల్లి,
నా తెలంగాణ కోటి
అందాల జాణ
నా తెలంగాణ లేమ
సౌందర్య సీమ..”
అన్నారు.
మహాంధ్రోదయం కవితా సంపుటిని దాశరథి సుప్రసిద్ధ ‘గోలకొండ పత్రిక’, ‘గోలకొండ కవుల సంచిక’ ల సంపాదకులు, ‘రామాయణ విశేషములు’, ‘ఆంధ్రుల సంస్కృతి-‘చరిత్ర’ వంటి అనేక పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన సురవరం ప్రతాపరెడ్డికి అంకితం చేశారు. హైదరాబాదు రాష్ట్రపు మొదటి,చివరి ముఖ్యమంత్రి అయిన డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ఈ సంపుటికి పీఠికను రాయడం విశేషం.
దాశరథి ‘జయ భారతీ’ కవితలో తన దేశభక్తిని పారవశ్యంతో వర్ణించారు.
”జండా ఒక్కటె మూడు వన్నెలది దే-శంబొక్కటే భారతా- ఖండా సేతు హిమాచ లోర్వర కవీ-కాండమ్ము లోనన్‌ రవీంద్రుండొక్కండె కవీంద్రు-డూర్జిత జగత్‌ యుద్ధాలలో /శాంతికో-దండోద్యద్విజ యుండు గాంధి ఒకడే-తల్లీ మహా భారతీ”
”దున్నే వాడిదే భూమి”అన్న నినాదంతో దిక్కులు పిక్కటిల్లు తున్నప్పుడు
”ఈ భూమి మీది-/ఈ సీమ మీది-కథల కండి వదలకండి..”అని రైతులకు ‘సుప్రభాతం’ పాడారు .మనకు తిండి పెట్టే రైతు గురించి కూడా కవిత రాశారు. ”అమృత మొలికించినావు నీ హలములోన హాలికా! వేనవేల దండాలు నీకు”

”వేడను వేడను
దేవుళ్లను దయ్యాలను”
అనడంతో పాటు,
‘నిరుపేదా!’ కవితలో
”బ్రహ్మరాతయని
భ్రమ పొందిన,
ధోకా చెందిన నిరుపేదా!”
అని అదఅష్టం, దేవుళ్ళ పేరుతో జరిగే మోసాలను ఎండగట్టారు.
”మతములబద్ధముల్‌ కులము-మాటలు వట్టివి..”
అని తన హేతువాద దృక్పథాన్ని ఎలుగెత్తి చాటారు.వేల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసిన నిజాంసాగర్‌ జలాశయానికి ఆధారమైన ‘మంజీర’ ను ప్రస్తుతిస్తూ కవిత రాశారు.
”ఎవరి గజ్జెల నాట్య రవళివే
మంజీర?
ఎవరి కజ్జల భాష్ప ధారవే
మంజీర?.”
దాశరథికి శత్రువులపై గర్జించడమే కాదు- పసిపిల్లలను గారాబం చేయడమూ తెలుసు.
అందుకే ఆయన ‘బాల్యం’ కవితను రాశారు
”పసిపాపల నిదుర కనులలో- ముసిరిన భవితవ్యం ఎంతో?” అని ఆవేదనపడ్డారు
‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెమంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..’ అనే గీతం ఇప్పటికీ శాస్త్రీయ ఆలోచన గల, ప్రజాఉద్యమ కార్యకర్తలందరికీ ప్రార్థనా గీతంలా నిత్యం మారుమోగుతూనే ఉన్నది.
30జనవరి1948 గాంధీజీ హత్య జరిగిన నాడు నిజామాబాద్‌ జైలులో ఉన్న దాశరథి గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘క్షమామూర్తి’ కవితను రాశారు.
”మతముల గుద్దులాటలను-
మాన్పు ప్రతిజ్ఞలతో ప్రజా సమే
కతకయి ప్రాణమొడ్డిన
మహాత్ముడ వీవు..” అని ప్రస్తుతించారు.
మహాకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మొగల్‌ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి,1857లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి లాంఛనంగా నైనా నాయకత్వం వహించిన బహదూర్‌ షా ఫర్‌, ప్రసిద్ధ కవి మీర్‌ కవితలను, అనువదించారు. దాశరథి గారి సినిమా గీతాలు కూడా లలిత లలితంగా సాగి శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రళయాన్ని-ప్రణయాన్ని, అంగారాన్ని-సింగారాన్ని తమ కవితలలో పలికించిన మగ్దుం మొహియుద్దీన్‌,కైఫీ ఆజ్మీ,ఫైజ్‌ అహమద్‌ పైజ్‌ వంటి వారి సరసన దాశరథి కూడా చేరారు.
”రమ్మంటే చాలు కానీ-రాజ్యాలు విడిచి రానా?”, ”మేటి విలుకాండ్రు చచ్చిరి బోటి చూపు-తూపు ముక్కున గల విషలేపమునకు”, ఆమె చెంతకేగు హక్కెవ్వ డిచ్చెనో? గాలి ఆమె పరిమళములు పీల్చె” అనడమే కాక,’వాణి నా రాణి’ అని పిల్లలమర్రి పిన వీరభద్రుడు అన్నట్టుగా
‘నేను స్వయముగా కవితన్‌ వరింపలేదు-తానె వరియించె కైతల రాణి నన్ను” అని గాలిబ్‌ను అనువదించారు.ఇవన్నీ ఒక ఎత్తు. దోపిడీ, పీడన,అసమానతల నుండి ప్రజలను విముక్తి చేసే సోషలిజాన్ని సాధించడం మరొక ఎత్తు.
అది మాత్రమే ప్రజల సర్వాంగీణ వికాసానికి, సుఖ సంతోషాలకు రాచబాటను వేస్తుంది.’కుల మతాల సుడిగుండాల..’ నుంచి వారిని బయటికి తీసి,ఆప్యాయతలను, అనురాగాలను పెంచుతుంది, పంచుతుంది.
అందుకే దాశరథి –
”రానున్నది ఏది నిజం?
అది ఒకటే సోషలిజం.
కలపండోరు భుజం భుజం
కదలండోరు గజం గజం…
అడుగడుగున యెడద నెత్రు
మడుగులుగా విడవండోరు ఉదయాకాశ పతాకం
యెదలో కదలాడె నేడు
హృదయావేశ తటాకం
నదిలా పొరలాడె నేడు
రానున్నది ఏది నిజం?
అది ఒకటే సోషలిజం”
అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన,ప్రగాఢంగా విశ్వసించిన, కోరుకున్న మహాకవి దాశరథికి కైమోడ్పు?? వారి శతాబ్ది ఉత్సవాలను జరుపుకోబోతున్న మనం ఆయన ఆశయాలను,ఆకాంక్షలను నిరంతరం మననం చేసుకుంటూ, ప్రచారం చేస్తూ, ఆయన కన్న కలలను సాకారం చేయడానికి కంకణబద్ధులం అవుదాం.
(జులై 22 నుంచి దాశరథి శత జయంతి ఆరంభం)
– మోతుకూరు నరహరి, 8464980540

Spread the love