రెవెన్యూ శాఖ రహస్య మంతనాల వెనుక మతలబు ఏమిటో!

– జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్తే గానీ వెలుగులోకి సమస్య 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
గత ప్రభుత్వ కాలంలోనే మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామానికి త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం మంజూరు అయిన విషయం తెలిసిందే. పెద్ద వెంకటాపురం గ్రామానికి మంజూరైన నాటి నుండి నేటి వరకు త్రీఫేస్ కరెంట్ పనులు పూర్తి కాని  విషయం విదితమే. కానీ, కరెంట్ పనులు పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం ఆళ్ళపల్లి రెవెన్యూ అధికారులు ఏడున్నర ఎకరాల రెవెన్యూ ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ శాఖకు ఇవ్వకపోవడమేనని గ్రామస్తుల నోట ఇటీవల కాలంలో మిక్కిలిగా వినిపిస్తోంది. దాంతో సమస్యకు పరిష్కారం తెలియని పెద్ద వెంకటాపురం గ్రామం ప్రజలు అనేక పర్యాయాలు స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి విసిగెత్తిపోయారు. విసిగి అలిసిపోయిన గ్రామస్తులు ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆళ్ళపల్లి రెవెన్యూ శాఖ అధికారులు పెద్ద వెంకటాపురం గ్రామం ప్రజలతో మీడీయాకు చిక్కకుండా రహస్య మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే శనివారం సైతం మీడియాకు అనుమతి లేకుండా స్థానిక రెవెన్యూ శాఖ ఉద్యోగులు పెద్ద వెంకటాపురం గ్రామంలో ఎవరైనా ఏడున్నర ఎకరాల రెవెన్యూ పట్టా భూమి రిజర్వ్ ఫారెస్ట్ శాఖకు ఇస్తే మీ గ్రామానికి, అడవిరామవరం గ్రామానికి త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం వస్తుందని రెవెన్యూ శాఖ ఉద్యోగులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఆళ్ళపల్లి రెవెన్యూ కార్యాలయంలో పెద్ద వెంకటాపురం గ్రామం రెవెన్యూ ల్యాండ్ మ్యాప్ లేదని, అది ఎక్కడో పోయిందని, గ్రామ రెవెన్యూ ల్యాండ్ మ్యాప్ చూసి ఇద్దామన్నా? ఇప్పుడా అవకాశం లేదని, అందుకని గ్రామంలో ప్రజలెవరైనా ఏడున్నర ఎకరాల రెవెన్యూ భూమి స్వచ్చందంగా దాతలు ముందుకు వచ్చి ఉచితంగా ఇస్తే త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం గ్రామానికి కల్పించే అవకాశం ఉందని స్థానిక రెవెన్యూ ఉద్యోగులు చెప్పినట్టు స్థానికులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ శాఖ కార్యాలయంలో పెద్ద వెంకటాపురం గ్రామం సంబంధించిన రెవెన్యూ ల్యాండ్ మ్యాప్ లేదనే ఆళ్ళపల్లి రెవెన్యూ శాఖ సిబ్బంది మాటల్లో నిజమెంతో? దీని వెనుక ఏర్పడిన పెద్ద సమస్య, మతలబు ఏమిటో? రికార్డులు నిజంగానే పోతే దానికి బాధ్యులు ఎవరవుతారనే వివరాలు.. జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్తే గానీ వెలుగులోకి వచ్చే పరిస్థితి నెలకొంది.
Spread the love