జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలెప్పుడు?

జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలెప్పుడు?– ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకపోవటంతో ఇక్కడి ప్రజల ఇబ్బందులు
– శాంతి భద్రతలను కారణంగా చూపుతున్న కేంద్రం
– పరిస్థితులు మెరుగు పడ్డాయని మోడీ సర్కారే చెప్పింది
– అలాంటపుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించరు
– మేధావులు, రాజకీయ విశ్లేషకుల ప్రశ్న
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలపై కేంద్రం ఎటూ తేల్చటం లేదు. శాంతి భద్రతలు మెరుపడ్డాయని చెప్తూనే.. మళ్లీ అదే అంశాన్ని ఎన్నికలు నిర్వహించకపోవటానికి గల కారణంగా చెప్తున్నది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌(జమ్మూ కాశ్మీర్‌, లఢక్‌)లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆగస్టు 31న సుప్రీంకోర్టుకు చెప్పారు. దీంతో ఆయన ప్రకటన జమ్మూకాశ్మీర్‌లోని ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా లభిస్తుందనీ, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందని భావించారు. అయితే ఇందులో ఆలస్యం జరిగింది. ఇది కాశ్మీరీలను కలవరపెడుతున్నదని సామాజికవేత్తలు, మేధావులు అంటున్నారు. కాలానుగుణంగా ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యపు ప్రధాన లక్షణం. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారాన్ని పౌరులకు కల్పించడం, వారి ఇష్టాన్ని వ్యక్తం చేయటం, వారి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం వంటివి ప్రజా ప్రజాస్వామ్యానికి పునాది. అయితే, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్‌లో 2014లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికలు ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రస్ఫుటంగా కనిపించకుండా పోయింది. కేంద్రంలోని మోడీ సర్కారు తన రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూకాశ్మీర్‌ అస్థిత్వాన్ని దెబ్బతీసిందని సామాజికవేత్తలు ఆరోపించారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు జమ్మూ, కాశ్మీర్‌ మరియు లడఖ్‌ల రాజకీయ స్థితిని ప్రాథమికంగా మార్చివేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కిందకు తీసుకువచ్చింది. దీంతో గత కొన్నేండ్లుగా జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి తరచుగా ఉదహరించే ఒక కారణం శాంతి భద్రతల పరిస్థితి. అయితే, 2019 నుంచి భద్రతా పరిస్థితి మెరుగుపడిందని సాక్షాత్తూ కేంద్రం తరచుగా చెబుతున్నది. అలాంటపుడు కేంద్రం ఇక్కడ ఎన్నికలు నిర్వహించటం కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవటానికి గల కారణం ఏమిటనీ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడానికి భద్రతాపరమైన సమస్యలను ఉదహరించడం ఒక చిన్న సాకు మాత్రమేననీ, ప్రపంచంలోని అనేక చోట్ల భద్రతా సవాళ్లు ఉన్నాయనీ, ప్రజాస్వామ్యం తరచుగా ప్రతికూల పరిస్థితుల్లో వర్ధిల్లుతుందని గుర్తించడం చాలా అవసరమని అంటున్నారు. మోడీ సర్కారు తీరు జమ్మూ కాశ్మీర్‌ ప్రజలలో ప్రజాస్వామ్యపు విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం లేకుండా దాదాపు 2,000 రోజులు గడిచాయి. ఎన్నుకోబడిన శాసనసభ లేకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని వాస్తవ నిరంకు శత్వంగా మార్చిందనీ, ఇక్కడ కొంతమంది ఎన్నుకోబడని వ్యక్తులు ప్రజల తరపున నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇది ప్రజాస్వామ్య నిర్మా ణాన్ని బలహీన పరుస్తుందని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం ఎంత కీలకమో కేంద్రం, భారత ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అన్నారు. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌ (ఐసీపీఎస్‌)లో రాజకీయ విశ్లేషకుడు, రీసెర్చ్‌ ఫెలో అయిన డాక్టర్‌ వసీమ్‌ మల్లా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలకు ప్రస్తుత భద్రతా పరిస్థితులతో సంబంధం లేదనీ, బీజేపీ ఎన్నికల లెక్కలతో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నదని వాదించారు. కేంద్రం 1996లో పెద్ద ఎత్తున తిరుగుబాటు మధ్య ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ” ప్రస్తుత ప్రజావ్యతిరేక ప్రభుత్వం (లెఫ్టినెంట్‌-గవర్నర్‌ పాలన), జమ్మూ కాశ్మీర్‌ ప్రజల మధ్య గణనీయమైన సంబంధాలను కలిగి లేదు. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు పరిష్కరించబడలేదు. ప్రధానంగా వారి ప్రతినిధులకు ప్రవేశం నిరాకరించబడింది. జమ్మూ కాశ్మీర్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు తొమ్మిదేండ్లు కావస్తున్నందున ప్రజావ్యతిరేకత పెరుగుతున్నది” అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Spread the love