పార్టీలు మార్చేటోళ్లు నాపై పోటీ

పార్టీలు మార్చేటోళ్లు నాపై పోటీ– ప్రజా సమస్యలపై వారు ఏనాడైనా పోరాడారా?
– సీపీఐ(ఎం) అడ్డుపడకపోతే మార్కెట్‌ తరలించేవారే..!
– ఖమ్మం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌
”నాపై పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇరువురూ పువ్వాడ అజరుకుమార్‌, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికీ మూడు, నాలుగు పార్టీలు మారారు. స్వీయలాభం కోసం పార్టీలు మారే వాళ్లు కావాలా..? ప్రజా సమస్యలపై నికరంగా పోరాడే సీపీఐ(ఎం) పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేను కావాలా..?” ప్రజలు ఆలోచించాలి’ అని ఖమ్మం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. శ్రీకాంత్‌ మాటల్లోనే…
గ్రెయిన్‌ మార్కెట్‌ను తరలకుండా అడ్డుకున్నా…
40 ఏండ్లుగా అనేక పోరాటాల్లో సీపీఐ(ఎం) తరఫున భాగస్వామిని అయ్యాను. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతానికి మణిహారంగా ఉన్న గ్రెయిన్‌ మార్కెట్‌ను తరలించాలని బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన పువ్వాడ అజరుకుమార్‌, కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకోవడానికి నాలుగేండ్ల పాటు పోరాటం చేశాను. పది రోజుల పాటు నిరాహారదీక్ష చేశాను. అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నాను. ఖమ్మం బస్టాండ్‌ తరలింపుపైనా..కరెంట్‌ చార్జీలపైనా, ఇండ్లస్థలాల కోసం సీపీఐ(ఎం) తరపున పోరాటం చేశాం. కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడలేదు.
పేరుకుపోయిన సమస్యలు…
ఖమ్మంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. నా ప్రత్యర్థులిద్దరూ అభివృద్ధి కామికులమని చెప్పుకుంటున్నారు. ఇండ్ల స్థలాల సమస్యను పట్టించుకోలేదు. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ గురించి ఆలోచించడం లేదు. శివారు ప్రాంతాల అభివృద్ధి గురించి ధ్యాస లేదు. ఖమ్మంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ఏర్పాటు, గ్రెయిన్‌ మార్కెట్లో హెల్త్‌సెంటర్‌ ఇవన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. మున్నేరు వరదల నుంచి రక్షణకు ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా పూర్తి చేయడంపై అనుమానాలున్నాయి. హమాలీలు, శ్రామిక మహిళల కోసం సమగ్ర చట్టం చేయడం లేదు. గెలిపిస్తే ఈ సమస్యలపై ప్రజల డిమాండ్లను అసెంబ్లీలో వినిపించి పరిష్కారం అయ్యేలా సాధించి తీరుతా.
డబ్బులతో వాళ్లు…పోరాటాలతో నేను…
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ డబ్బులను నమ్ముకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం పోరాటాలనే నమ్ముకున్నాను. 3వ తారీఖు ఫలితాల్లో డబ్బులను నమ్ముకున్న వాళ్లను ఆదరిస్తారా? సమస్యలపై పోరాడే నన్ను అక్కున చేర్చుకుంటారో? ప్రజలదే తుది నిర్ణయం.

Spread the love