హైదరాబాద్, ఖమ్మం ఏసెస్ ఢీ
టీజీ20 టైటిల్ పోరు నేడు
నవతెలంగాణ-హైదరాబాద్ : టీజీ20 తుది అంకానికి చేరుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లే నేడు తుది సమరానికి సై అంటున్నాయి. హైదరాబాద్ ఈ చాంపియన్స్, ఖమ్మం ఏసెస్ నేడు టైటిల్ పోరులో తలపడనున్నాయి. అరంగ్రేట సీజన్‌లో విజేతగా నిలిచేందుకు హైదరాబాద్, ఖమ్మం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్ ఆల్‌రౌండర్ల అండతో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌పై నెగ్గిన ఉత్సాహంతో ఖమ్మం ఏసెస్ కప్పుపై ఆశలు పెట్టుకుంది. నేడు రాత్రి 7.15 గంటలకు టీజీ20 ఫైనల్ ఆరంభం కానుంది.
తొలి కప్పు నీదా?నాదా?
హైదరాబాద్ ఈ చాంపియన్స్, ఖమ్మం ఏసెస్ లీగ్ దశ నుంచి నిలకడగా రాణిస్తున్నాయి. ప్రతిభావంతులతో కూడిన హైదరాబాద్ అద్వితీయ విజయాలు సాధించింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, గణేశ్, అఖిల్, షణ్ముక అశ్విన్, ప్రణవ్ వర్మ, వికాశ్ రెడ్డిలు హైదరాబాద్‌కు కీలకం. ఖమ్మం ఏసెస్‌ను సివి మిలింద్ ముందుండి నడిపిస్తున్నాడు. మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, జిఎస్‌కె రెడ్డి, వాఫి కచ్చి, కొడిమెల హిమతేజ ఖమ్మంకు కీలకం కానున్నారు.
250 మందితో ప్రత్యేక ప్రదర్శన
టీజీ20 ఫైనల్, ముగింపు వేడుకలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5.45 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. 50 మందితో కూడిన ఐదు బృందాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన చేయనున్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆట, పాటతో అభిమానులను అలరించనున్నాడు. లీగ్ బ్రాండ్‌అంబాసిడర్ విజయ్ దేవరకొండ ఫైనల్ మ్యాచ్‌కు రానున్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ విరామంలో లేజర్ షో సహా పలు ఎంటర్‌టైమ్‌మెంట్ కార్యక్రమాలు రూపొందించినట్టు టీజీ20 లీగ్ చైర్మన్ ఆగం రావు తెలిపారు.
చాంపియన్ ఎవరో?
- Advertisement -
- Advertisement -


