కృత్రిమ మేధాపై ‘ఎఐ డేస్‌’లో విస్తృత చర్చ

Broad discussion at 'AI Days' on Artificial Intelligence– స్వేచ్చ సదస్సుకు 2వేల మంది హాజరు
– రెండు రోజుల కాన్ఫరెన్స్‌ ప్రారంభం
– తెలుగు ఎఐ వాయిస్‌ అసిస్టెంట్‌ ఆవిష్కరణ
నవ తెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
భారతదేశంలో అతిపెద్ద కాన్ఫరెన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)పై ‘ఎఐ డేస్‌ 2024’ శనివారం హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో ప్రారంభమైంది. దీనిని ‘ఎఐ4సొసైటీ’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కృత్రిమ మేధా (ఎఐ)పై విస్తృత చర్చ జరుగుతోంది. భాగస్వాముల సహకారంతో స్వేచ్చ ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో 2,000 మందికి పైగా ఐటి నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విద్యార్థులతో పాటు ప్రముఖ టెక్‌ కంపెనీల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎఐ, ఎంఎల్‌ నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సుతో హైదరాబాద్‌ ఎఐ రాజధానిగా మారేందుకు మార్గం సుగమం అవుతుంది. ఎఐ డేస్‌ వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒక చోటకు చేర్చింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, సెమీ కండక్టర్స్‌, ఎడ్యుటెక్‌, వివిధ స్టార్టప్‌లు సమాజ శ్రేయస్సు కోసం ఎఐని నిర్మించడంలో ముందుకు సాగే మార్గం కోసం గూగుల్‌, ఫేస్‌బుక్‌ (మెటా) మైక్రోసాఫ్ట్‌, క్వాల్కామ్‌, మైక్రాన్‌, ఓజోనెటెల్‌, టెక్‌ వేదిక డిజీక్వాన్టా, ఆర్కా మీడియా వర్క్స్‌ వంటి ఇతర సంస్థల స్పీకర్‌లు చర్చలలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎఐ పాలన, విధానపరమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
ఈ సదస్సులో తెలుగు ఎఐ వాయిస్‌ అసిస్టెంట్‌ను ప్రారంభించారు. రైతులు, ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, ఇతరులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలను యాక్సెస్‌ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ మాతృభాషలో సొంత స్వరాన్ని ఉపయోగించి ఎఐతో పరస్పర చర్యకు అవకాశం ఇస్తుంది. ఈ కాన్ఫరెన్స్‌లో పొలాల్లోని నీటి పంపులను రిమోట్‌గా ఆపరేట్‌ చేయడానికి తెలుగు ఎఐ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించడంపై ప్రత్యక్ష ప్రదర్శన జరిగింది. దీంతో రైతులు నీటి పంపులను భౌతికంగా ఆన్‌, ఆఫ్‌ చేసేటప్పుడు ఏర్పడే కరెంట్‌ షాక్‌ మరణాలను నివారిస్తుంది. ఈ సదస్సులో అధిక పనితీరు కలిగిన డిస్ట్రిబ్యూట్‌ సూపర్‌ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఎఐ, ఎంఎల్‌ పై అనేక కీనోట్‌లు, అరవై పైగా సెషన్‌లు కలవు. ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ గౌరవ్‌ రైనా, తెలంగాణ అడిషనల్‌ డిజిపి శిఖా గోయెల్‌, సేల్స్‌ఫోర్స్‌ విపి, ఇంజనీరింగ్‌ డాక్టర్‌ జైదీప్‌ గంగూలీ, కంప్యూటర్‌ సైన్స్‌ దిగ్గజం డాక్టర్‌ కృష్ణ పాలెం హాజరయ్యారు. మొదటి రోజు ప్రముఖ వక్తలు పద్మభూషణ్‌ డాక్టర్‌ విఎస్‌ రామచంద్రన్‌, మొబైల్‌ పేమెంట్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ గౌరవ్‌ రైనా, ఫౌండర్‌ సిటిఒ ఓజోనెటెల్‌ చైతన్య, టెక్‌ మహీంద్రా విపి నాగ్‌ మల్లాది, స్వేచ్చా వ్యవస్థాపకుడు వై కిరణ్‌ చంద్ర, సీనియర్‌ సలహాదారు సాలమండర్‌ నాగి వి, ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ సునీల్‌ అబ్రహం, టెక్‌ వేదిక ఫౌండర్‌ సిఇఒ సాయి ఎస్‌, స్వేచ్చా కార్యదర్శి ప్రవీణ్‌ చంద్రహాస్‌ పాల్గొన్నారు.

Spread the love