సుగుణకుమారి వ్యూహం ఫలించేనా.?

– పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న వైనం
– కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ చెలిమెల సుగుణ కుమారి మరోసారి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఆమె మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ కోసం సుగుణ కుమారి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఆమె ఒక వెలుగు వెలిగారు.రెండుసార్లు పెద్దపల్లి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2004 లో ఓటమి చెందిన తరువాత ఆమె పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు.షార్జాలో ఆమె ప్రస్తుతం వైద్యురాలిగా కొనసాగుతున్నారు.గత మూడు రోజుల నుంచి ఆమె ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.1998,1999 లో రెండుసార్లు సుగుణ కుమారి కాకలుదీరిన కాంగ్రెస్ నాయకుడు కాకా వెంకట స్వామి పై పెద్దపల్లి నుంచి గెలుపొందారు.2004 లో జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామి మీదనే సుగుణ కుమారి తిరిగి అదే స్థానం నుంచి ఓటమి చెందారు.అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఆశించిన విదంగా సుగుణ కుమారి వ్యూహం పలించేనా.? అనే సందేహాలు వెలువడుతున్నాయి. వైద్య వృత్తిలోనే కొనసాగుతున్నారు.ప్రస్తుతం ఆమె పెద్దపల్లి నుంచి పార్లమెంట్ కు పోటీచేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.సుగుణకుమారి స్వస్థలం మంథని నియోజకవర్గం కావడం విశేషం.ఇదిఇలా ఉండగా ఆమె మరోసారి రాజకీయ రథం నడపడానికి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారని సమాచారం.ఆ ఐదుగురు సంపూర్ణ మద్దతు ఇచ్చిన తరువాతనే ఆమె ఢిల్లీలో అడుగుపెట్టిందని పలువురు కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే సుగుణకుమారి షార్జా నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో మాత్రం మంతనాలు జరుపలేదని సమాచారం. కేవలం ఆ ఐదుగురు ఎమ్మెల్యే ల సహకారంతోనే ఆమె పోటీకి సిద్ధమవుతున్నట్లుగా పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
గడ్డం వంశీ ప్రయత్నాలు: పెద్దపల్లి స్థానం కోసం కాకా వెంకటస్వామి మనువడు,చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు. సుగుణ కుమారి వచ్చే వరకు కూడా వంశీకే టికెట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కొడుకు టికెట్ కోసం వివేక్ తనదైన శైలిలో ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు.పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సుగుణ కుమారి,వంశిలతో ఎవరికి అదృష్టం దక్కనుందో వేచి చూడాల్సిందే.సుగుణ కుమారికి టికెట్ దక్కితే పెద్దపల్లిలో అడుగు పెడుతుంది.లేదంటే ఢిల్లీ నుంచి నేరుగా షార్జా వెళ్లాల్సిందే.
Spread the love