చేపపిల్లల పంపిణీకి జాడే లేని టెండర్లు మే నెలలోనే పూర్తయితేనే ఫలితం
రెండేండ్లుగా ఆలస్యంగా టెండర్లు పిలవడంతో ఎదగని చేపలు
ప్రభుత్వ నిర్ణయం కోసం
మత్స్యకారుల ఎదురుచూపులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తక్కువ పెట్టుబడితో మత్స్యకారులకు అధిక లాభాలు అందించి తద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పథకం అమలుపై ‘నీలి’ నీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా మే నెలలో టెండర్లు పూర్తి చేస్తే.. సదరు ఏజెన్సీలు జులై, ఆగస్టులో చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తాయి. అదే సమయంలో వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీటితో పాటు పురుగులు, కొత్త మట్టి రావడంతో చేప పిల్లలు ఎదిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం గత రెండేండ్లుగా టెండర్లను ఆలస్యంగా పిలవడంతో చేప పిల్లల పంపిణీ నవంబర్, డిసెంబర్ నెలల్లో చేస్తున్నారు. దాంతో కొన్ని మృత్యువాత పడగా.. మిగతా వాటిల్లో ఎదుగుదల లోపం కనిపించింది. దాంతో పథకం ఉద్దేశం నెరవేరడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే టెండర్లు పిలిస్తే సకాలంలో చేప పిల్లలు చెరువుల్లో చేరే అవకాశం ఉంటుందని మత్స్యకారులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 315 మత్స్యసొసైటీలు ఉండగా.. వాటిల్లో 21,052 కుటుంబాలకు సభ్యత్వం ఉండటంతో ఉచిత చేప పిల్లల పంపిణీతో ఉపాధి పొందుతున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 4.24 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. అదే విధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 188 సొసైటీలకు గాను 11286 కుటుంబాలకు సభ్యత్వం ఉంది. ఇక్కడ 2.81 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. కుంటలు, చెరువులు విస్తీర్ణం బట్టి 35-40 ఎంఎం, 80-100 ఎంఎం సైజు చేప పిల్లలను విడుదల చేశారు.
రెండేండ్లుగా ఆలస్యంగా టెండర్లు
సాధారణంగా ప్రతి ఏడాది మే నెలలో టెండర్లు పూర్తి చేస్తే.. చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమై జులై, ఆగస్టు నెలల్లో చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. వాటి ఎదుగుదలకు సైతం ఇదే అనుకూలమైన సమయం. అప్ప్పుడే వర్షాలు కురవడంతో చెరువుల్లోకి కొత్త నీరు వస్తుంటది. వరద వెంట పురుగులు, కొత్త మట్టి రావడంతోపాటు చెరువులో కొత్త గడ్డి మొలవడంతో చేప పిల్లలను ఇదే సమయంలో వేస్తే వాటి ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. చెరువు పూర్తిస్థాయిలో నిండి ఆలుగు పారినా.. అప్పటికే చేప ఎదిగి ఉండటంతో ప్రవాహానికి కొట్టుకుపోకుండా మూలకు, గడ్డిమాటున వెళ్లి నక్కుతాయి. దాంతో నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. కానీ గత రెండేండ్లుగా టెండర్లు ఆలస్యంగా ఖరారు చేస్తున్నారు. మేలో పూర్తి చేయాల్సినవి.. జులై, ఆగస్టులో చేస్తుండటంతో నవంబర్, డిసెంబర్‌లో పంపిణీ చేస్తున్నారు. ఆ సమయానికే నీరు వచ్చి ఉండి పాతపడటంతో చేప పిల్ల ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉండకపోవడంతో.. కొన్ని మృత్యువాత పడగా.. మరికొన్ని బరువు పెరగకుండా ఉండిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఆలస్యంగా పంపిణీతో చేప పిల్లల నాణ్యత కూడా సరిగ్గా ఉండటం లేదని వాపోతున్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం
చేపల విక్రయాలతో వచ్చే ఆదాయం మీదే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 21052 కుటంబాల్లో 1,26,273 మంది ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి కుటుంబాలకు ఈ పథకం వల్ల ఆర్థికంగా భరోసా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా రెండేండ్ల క్రితం 4.24 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.3.27 కోట్లు వెచ్చిస్తే చేప ఎదుగదలతో మత్స్యకారులకు సుమారు రూ.85 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. అదే విధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.81 కోట్ల చేప పిల్లలకు 1.94 కోట్ల నిధులు ఖర్చు చేస్తే.. సుమారు 56.84 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వ గణంకాలే తెలియజేస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే చేప పిల్లల పంపిణీ పథకం అమలును నీరుగార్చొద్దని మత్స్యకారులు కోరుతున్నారు. వెంటనే టెండర్లు పిలిచి ఖరారు చేయాలని కోరుతున్నారు. తర్వాత ఆగమేఘాల మీద నిర్వహిస్తే నష్టమే తప్పా ఉపయోగం ఉండటం లేదు.
వెంటనే టెండర్‌లు పిలవాలి
రెండేండ్లుగా టెండర్లు ఆలస్యం చేయడంతో చేప పిల్లలు సైతం నాసిరకంగా వచ్చాయి. కొన్ని చెరువుల్లో విడుదల చేసి మిగతా వాటిని విస్మరించారు. దీంతో చేపలు పెరగలేవు. ఇది వరకే సమయం మించి పోయింది. ఇంకా ఆలస్యం చేస్తే మరింత నష్టమే తప్పా ఉపయోగం లేదు. ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలిచి సకాలంలో చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నాం.
నారాయణ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, నిజామాబాద్ అర్బన్ సొసైటీ ప్రెసిడెంట్
చెరువుకు చేప చేరేనా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


