Monday, June 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడో డిస్కం ఉపసంహరించండి

మూడో డిస్కం ఉపసంహరించండి

- Advertisement -

విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించే ప్రమాదం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడో డిస్కమ్‌(‌కిసాన్‌)‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. 29న జరిగిన విద్యుత్‌ ‌రెగ్యులేటరీ కమిషన్‌ ‌విచారణలో మూడో డిస్కం వల్ల వినియోగదారులపై భారం పడుతుందనీ, దాన్ని పసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 18.12.2025 నాటికి ఎన్‌‌పీ, ఎస్‌‌పీ డిస్కమ్‌‌ల మొండి బాకీలు రూ.48,398 కోట్లు ఉన్నట్టు నిర్ధారించి అందులో నుంచి మూడో డిస్కమ్‌‌కు రూ.25,950 కోట్లు మార్చారనీ, దానికి రూ.4,929 కోట్లు ఆస్తులు కేటాయించారని తెలిపారు. ఆ డిస్కంకు కేటాయించిన సర్వీసులన్నీ ప్రభుత్వ రాయితీలు పొందేవేననీ, ఎలాంటి ఆదాయ వనరులు లేవనీ, ప్రభుత్వమే సబ్సిడీ ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 29,08,238 కనెక్ష‍న్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సంస్కరణల్లో భాగంగా రివాంప్ట్ డిస్ట్రిబ్యూషన్ స్కీం (పటిష్టపర్చడానికి) 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనీ, ఒక్క స్మార్ట్ మీటరుకు 25 వేల చొప్పున రూ.1306 కోట్లు కావాలని తెలిపారు.

ప్రస్తుత రెండు డిస్కమ్‌‌లపై మూడో డిస్కమ్‌‌కు అధికారాలు ఉంటాయనీ, మూడో డిస్కమ్‌‌కు 35,218 (42 శాతం) మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందని అంచనా వేశారు. ఈ డిస్కాం నుండి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేదనీ, వ్యయం మాత్రం పెరుగుతుందని తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,58,748 కనెక్షన్లు ఉండగా అందులో 1,05,58,748 కనెక్షన్లకు సుమారు రు.4000 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. సహజంగానే డిస్కంలు తమ ఎఆర్‌ఆర్ (అగ్రిగేటివ్ రెవెన్యూ రిక్వైర్మెంట్)కు ‌రూ.14000 కోట్లు లోటు చూపుతున్నారు. దానికి తోడు సుమారు ఏటా ప్రభుత్వం 18 వేల కోట్లు సబ్సిడీ భరించాల్సి ఉన్నది’ అని తెలిపారు. ​పవర్‌ ‌పర్చేజ్‌ అగ్రిమెంట్లు అయిన తర్వాత గతంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం మార్కెట్లో వేల మెగావాట్ల విద్యుత్ పీపీఏలు లేకుండా ఉత్పత్తి చేస్తున్నారనీ, వాటి నుండి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ ద్వారా వేలం పాటలో కొనుగోలు చేయడం వల్ల మన అవసరాలు భర్తీ చేసుకోవచ్చున ని సూచించారు. పెరిగిన వినియోగాన్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలని విన్నవించారు.

డిస్కమ్‌‌లకు సీఎమ్‌‌డీలు, కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారనీ, అయితే, కింది స్థాయి సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వడం లేదని ఎత్తిచూపారు. ప్రధాన కార్యాలయం భారాలను తగ్గించి, అందరికీ కనీస వేతనాలు ఇచ్చే విధంగా చట్ట సవరణ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ ‌సవరణ చట్టం2023 ప్రకారం క్రాస్‌‌సబ్సిడీలు ఎత్తేసి ఉచిత విద్యుత్‌ ‌రద్దు చేయానీ, విద్యుత్ ఉత్పత్తి ఖర్చు కనుగుణంగా టారిఫ్‌లు నిర్ణయించాలని తెలిపారు. విదేశాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చునని ఆ చట్టంలో ఉందని తెలిపారు. పై చట్టం అమలు జరిపినట్ల యితే రాష్ట్ర వినియోగదారులపై విపరీతమైన భారాలు పడతాయనీ, విద్యుత్‌ ‌రంగం ప్రయవేటీకరించే ప్రమాదముందని హెచ్చరించా రు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రయివేటు డిస్కంలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాత్మకం గా డిస్కంను ప్రారంభించినట్టు ఉందనీ, అదాని విద్యుత్తును మన రాష్ట్రంలోకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్ర ప్రతిఘటన వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు బడా కార్పొరేట్లకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మూడో డిస్కంను ఉపసంహరించుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ నిర్వహణ బాధ్యతను కొనసాగించాలని కోరారు. ​​అందరికీ విద్యుత్తు లభించేలా, క్రాస్ సబ్సిడీ కొనసాగేలా విధానాలను అమలు చేయాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -