Monday, June 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్నో పోరాటాల ఫలితమే ఓటు హక్కు

ఎన్నో పోరాటాల ఫలితమే ఓటు హక్కు

- Advertisement -

మహిళలకు ఆత్మాభిమానం ఎక్కువ..వారి పట్ల నేటికీ చిన్న చూపే
‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు’ సెమినార్‌‌లో రిటైర్డు ‌జస్టిస్‌ ‌రాధారాణి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళల పట్ల నేటికీ చిన్న చూపే ఉన్నదని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి రాధారాణి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌లో రాజ్యాంగ పరిరక్ష‍ణ వేదిక ఆధ్వర్యంలో హైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ ‌విద్యాసాగర్‌ అధ్యక్ష‍తన ‘చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు’ అనే అంశంపై సెమినార్‌‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా రాధారాణి మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా 1920లో ఓటు హక్కు ‌సాధించారని తెలిపారు. ప్రారంభంలో మహిళలు రిజర్వేషన్లు అక్కరలేదని ఎంతో మంది వాదించారని గుర్తు చేశారు. ఎందుకంటే మహిళలకు ఆత్మాభిమానం ఎక్కువని చెప్పారు. ఒకరు ఇస్తే..మేం తీసుకోవటమేంటని వారు ఆ రకమైన చర్చ చేశారని తెలిపారు. వాస్తవంగా అవకాశమొస్తే..ఏ పనైనా, దేన్నైనా అధిరోహించగలమన్న విశ్వాసం వారికి ఎక్కువగా ఉంటుందన్నారు. కాకపోతే ఆత్మ విశ్వాసం కల్పించే భౌతిక పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రానం తరం కూడా ఆ పరిస్థితి కొనసాగడం బాధాకరమన్నారు. నేటికి మహిళలను అణచి పెట్టే ధోరణి ఉందని చెప్పారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళితే ఇప్పటికీ చిన్న చూపు చూసే విధానం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టటమే కష్టంగా మారిందన్నారు.

ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మహిళలు చట్ట సభల్లో 14శాతం ప్రాతినిధ్యాన్ని పొందగలుగుతున్నారని చెప్పారు. రువాండా, కాంగో లాంటి దేశాల్లో 60శాతానికి పైగా మహిళలు చట్టసభల్లో ఉన్నారని చెప్పారు. బాగా అభివృద్ధి చెందిన యూరప్‌ ‌దేశాల్లో 25 శాతం మహిళలు చట్టసభల్లో కొనసాగుతుండగా, భారతదేశంలో 14శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇంకెంత కాలం ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా రిజర్వేషన్ల అమలు వల్ల మహిళల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. ఇది అనుభవం ద్వారా తెలుసుకున్న విషయమని గుర్తు చేశారు. చట్ట సభల్లో 2029 ఎన్నికల నాటికైనా 33శాతం మహిళా రిజర్వేషన్లు అమలవుతాయా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా…పురుషాధిక్య సమాజంలో మహిళల అధికారాలను కూడా పురుషులే ఉపయోగించుకున్నారని తెలిపారు. అదే సమయంలో కొంతమంది మహిళలు సామాజిక అభివృద్ధిలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ‌స్థానాల్లో 33శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారా తమ అధికారాలు పోతాయనే ఆందోళన ఉందన్నారు.

2023లో పార్లమెంటులో చట్టం ఆమోదం పొందినప్పటికీ దీన్ని అమలు చేయకుండా నియోజక వర్గాల పునర్విభజన జనాభా గణనకు ముడిపెట్టాయని గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జనాభా నియంత్రణకు కృషి చేసిన దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరిగే అవకాశం ఉందన్నారు. నిధులన్నీ జనాభా ఎక్కువున్న ప్రాంతాలకు పోతే..జనాభా తక్కువున్న ప్రాంతాలు అన్యాయానికి గురవుతాయని చెప్పారు. జనగణన, డీలిమిటేషన్‌కు సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న 543 స్థానాలలో 33శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని తెలిపారు. ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలు, రాజకీయాల గురించి మహిళలు తెలుసుకుని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆ రకంగా ఉద్యమాలు చేస్తేనే మహిళలు 33శాతం రిజర్వేషన్లను సాధించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు కె ఉమామహేశ్వరరావు, డీఏఎస్‌వీ ప్రసాద్, కామేష్‌బాబు, వీరయ్య, నాగలక్ష్మి, ఇందిర, డీజీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -