Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంవామ్మో.. మాడిపోతున్నాం

వామ్మో.. మాడిపోతున్నాం

- Advertisement -

వేడి నుంచి రక్షణ కల్పించేలా కార్మిక చట్టాల్లో మార్పులేవీ?
సలహాలు ఎవరి ప్రాణాలు
కాపాడలేవు : కార్మిక సంఘాలు

ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు 
గంటలవరకు వేడి గాలులు, ఉక్కపోతతో పాటు అమాంతంగా సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. 46 డిగ్రీల నుంచి అంతకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి కాలు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి. ఇక కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. భవన నిర్మాణ, ఉపాధి పనిలో ఉన్న కార్మికులు, గిగ్ వర్కర్లు ఇలా కార్మికవర్గమంతా వేడి వాతావరణానికి తట్టుకోలేకపోతోంది. పనిచేయకపోతే కూలి రాదు. దీంతో వారికి పూట గడవటం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సూచనలు, సలహాలతోనే సరిపెడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సలహాలు కార్మికులను కాపాడలేవని, కార్మిక చట్టాల్లో వేడి నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

న్యూఢిల్లీ : డబ్బున్న పెద్దలు, యాజమాన్యాలు ఎండ తగలకుండా ఎయిర్ కండీషనర్లు పెట్టుకుంటున్నారు. కానీ కార్మిక వర్గానికి మాత్రం ఎలాంటి వెసులుబాటూ ఉండటంలేదు. ‘‘వామ్మో మాడిపోతున్నాం.. మాకు నిప్పుల కొలిమి లో పనిచేయడానికి మరింత స్పష్టమైన నిబంధనలను చేర్చేలా భారతదేశ కార్మిక చట్టాలను సంస్కరించాలి’’ అని పలు కార్మిక సంఘాలు లిఖితపూర్వకంగా డిమాండ్ చేశాయి. ఇటీవలి సంవత్స రాలలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా.. యజమానులు పని గంటలను పున:ప్రణాళిక చేయాలని, కార్మికులకు తాగునీటిని అందుబాటులో ఉంచాలని కోరుతూ ప్రభుత్వ సంస్థలు సలహా లు జారీ చేశాయి. కానీ ప్రాణాంతకమైన వేడిని ఎదుర్కోవడానికి ఇది సరిపోదని కార్మికులు అంటున్నారు. “సలహాలు ఎవరినీ కాపాడలేవు. కాబట్టి వారి ప్రాణాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యత ఎవరిపైనా లేదు” అని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ జాతీయ కోఆర్డినేటర్ నిర్మల్ గోరానా ఆవేద న వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే పరిస్థితులలో పనిచే యడం వల్ల వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ రకమైన ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు గురికావడం ప్రాణాంతకం కావచ్చని అంటున్నారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన 2024 సంవత్సరంలో.. ఉష్ణోగ్రతలు పలు రోజుల పాటు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా 40,000కు పైగా వడదెబ్బ కేసులు నమోదయ్యాయని కార్మికులు, విశ్లేషకులు ఈ వాస్తవాన్ని గుర్తు చేస్తున్నారు.

కార్మికుల కష్టాలు
2024 ఏడాది దృష్టిలో ఉంచుకొని.. 2025లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ గిగ్, అసంఘటిత కార్మికులకు సమగ్ర సలహాలను జారీ చేసింది. ప్లాట్‌ఫామ్ కార్మికులు, తీవ్రమైన వేడి గంటలలో విరామం తీసుకున్నందుకు వేతనాలు కోల్పోవడంతో పాటు జరిమానాలు విధించబడ్డాయని, వారికి నీరు, నీడ అందుబాటులో లేదని నివేదించింది. ఉత్పాదకతలో నష్టాలను నివారించడానికి బాత్రూమ్ ఉపయోగించబోమని అమెజాన్ కార్మికులతో ప్రమాణం చేయించిన ఘటన తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సిఫారసుల్లో గిగ్ వర్కర్లకు భద్రతా కిట్లు (యూవీ రక్షణ చొక్కాలు, ఓఆర్ఎస్) అందించడం, వేడిని బట్టి విరామాలను తప్పనిసరి చేయడం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిని నిలిపివేయడం వంటివి ఉన్నాయి.

కేవలం సిఫారుసుల వరకే సలహాలు
ఇప్పటికీ ఈ సలహాలు కేవలం సిఫారసుల రూపంలో ఉండటాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా ఉంచడమే ఇక్కడ ముఖ్యం. వారు విశ్రాంతి పాయింట్లను ఏర్పాటు చేస్తుంటే, అవి కార్మికులకు ఎంత అందు బాటులో ఉన్నాయి , ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో తనిఖీ చేయాలి. ప్రతి రెస్టారెంట్, దుకాణంలో విశ్రాంతి స్థలం, వాష్‌రూమ్‌ల కోసం ఏర్పాట్లు ఉండాలి. వాటిని అందించలేని సంస్థలతో ప్లాట్‌ఫారమ్‌లు ఒప్పందాలు చేసుకోకూడదు’’ అని విశ్లేషకులు చెప్తున్నారు. వేతనాల నియమావళి ప్రకారం గిగ్ వర్కర్లకు నిర్ణీత కనీస వేతనాలు చెల్లించాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తు న్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్.. సలహాలకు బదులుగా… ఈ రక్షణలను చట్టబద్ధంగా అమలు చేయదగిన కనీస చర్యలుగా మార్చడం అవసరమని పేర్కొంది.

ఏప్రిల్ 21 నాటి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ సమర్పించిన నివేదిక ప్రకారం.. సామాజిక భద్రతా కోడ్ కింద బీమా వంటి అర్హతా పథకాలతో వేడి నుంచి రక్షణ చర్యలను అనుసంధానించాలని ప్రతిపాదించాలి. “సామాజిక భద్రతా కోడ్, వేడి సంబంధిత అనారోగ్యాలు, వడగాలుల సమ యంలో ఆదాయ నష్టం, అత్యవసర వైద్య సహాయం, వేడికి గురికావడం వల్ల సంభవించే మరణాలను కవర్ చేసే ప్రమాద రక్షణ పథకాన్ని ప్రవేశపెట్టాలి’’ అని హీట్‌వాచ్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనన్య తివారీ అన్నారు. వేడిగాలుల రోజుల్లో నమోదు చేసిన ప్రతి రెండు గంటల పనికి కనీసం 20 నిమిషాల పాటు వేతనంతో కూడిన కూలింగ్ బ్రేక్‌లను అనుమతించడం నివేదికలో చేసిన సిఫారసుల్లో ఒకటి. ప్లాట్‌ఫారమ్‌లు క్రమం తప్పని ఆడిట్‌లతో నీటి లభ్యత ప్రణాళికను నిర్వహించేలా చేయడం ద్వారా నీరు, నీడ , విశ్రాంతిని ధ్రు వీకరించదగిన ఆదేశంగా మార్చాలని కూడా సిఫారసు చేసింది. అలాగే పలు అంశాలను పేర్కొంది.

వృత్తిపరమైన భద్రతా ప్రమాదాల చట్టం
పని ప్రదేశంలో ఆరోగ్యం, భద్రతను నియంత్రించే వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం , పని పరిస్థితుల (ఓఎస్‌‌హెచ్‌) కోడ్ నుంచే వేడి నుంచి రక్షణ చర్యలకు సంబంధించిన నిబంధనలు ఆదర్శవంతంగా ఉండాలి అని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సీనియర్ రెసిడెంట్ ఫెలో దీపా పద్మార్ అన్నారు. ఓఎస్ హెచ్ కోడ్.. ఫ్యాక్టరీ, నిర్మాణం, మైనింగ్, డాక్, కాంట్రాక్ట్ కార్మికులు , ఇతరుల హక్కులను కవర్ చేసే 13 కార్మిక చట్టాలను మిళితం చేస్తుంది. అయితే, ఇది గిగ్ వర్కర్లను చేర్చదు, వారు బదులుగా సామాజిక భద్రతా కోడ్ కింద కవరేజీని పొందుతారు.ఈ కోడ్.. ముసాయిదా నిబంధనలలో వేడికి సంబంధించిన నిబంధనలను చేర్చకపోవడం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ ) ఒప్పందాల ఉల్లంఘనకు దారితీయవచ్చని అమెజాన్ వర్కర్స్ యూనియన్ వాదించింది. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలస్థాయిలో కార్మికులు, యూనియన్లతో సరైన సంప్రదిం పులు జరిపి, స్పష్టతనిచ్చి, అమలుపరచి, నియంత్రించకపోతే.. ఇంకా చాలామంది కార్మికులకు గాయాలు, ప్రమాదాలు, మరణాలు సంభవిస్తాయి”అని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హీట్ యాక్షన్ ప్లాన్‌లతో అనుసంధానం
వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారుల వంటి కార్మిక చట్టాల కింద స్పష్టమైన హక్కులు పొందని బహిరంగ ప్రదేశాలలో పనిచేసే కార్మికులను హీట్ యాక్షన్ ప్లాన్‌లలో మరింత మెరుగ్గా అనుసంధానించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘‘పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, వీధి వ్యాపారులు టార్పాలిన్లు, వస్త్రాలు, ఇతర సామగ్రిని ఉపయోగించి తాత్కాలిక నీడను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. అయితే, ఈ అవసరమైన సర్దుబాటు చర్యలకు తరచుగా స్థానిక అధికారుల నుంచి ఆక్రమణల పేరుతో తొలగింపు చర్యలు, సరుకుల జప్తు, వేధింపులను ఎదుర్కొంటున్నారు’’ అని నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ పేర్కొంది. హీట్ యాక్షన్ ప్లాన్‌లలో వీరిని ప్రాధాన్య భాగస్వాములుగా చేర్చడం ద్వారా ఇటువంటి కఠిన చర్యలను ఆపవచ్చని సూచించింది.

లేబర్‌‌
కోడ్‌‌లలో
 లేని స్పష్టత
ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదల వార్షిక కర్మాగారాల ఉత్పత్తిని, కార్మికుల ఉత్పాదకతను రెండు శాతం చొప్పున తగ్గిస్తుందని అంచనా. కానీ భారతదేశ కార్మిక చట్టాలు ఈ ప్రభావాలకు అనుగుణంగా మారలేదని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. 2020లో దేశంలో అనేక కార్మిక చట్టాలను… వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్ ,వృత్తిపరమైన భద్రత కోడ్ అనే నాలుగు విభిన్న కోడ్‌లుగా ఏకీకృతం చేశారు. ఈ పేరుతో అనేరక కార్మిక హక్కులను కాలరాశారు. అయితే, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉన్న రోజులలో కార్మికులకు ఎలాంటి రక్షణ కల్పించాలనే దానిపై ఈ కోడ్‌లు నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఆరోగ్య, భద్రతా రక్షణ చర్యలలో వేడిని కూడా చేర్చడమే దీర్ఘకాలిక నివారణ చర్యలకు తదుపరి ముందడుగు అని అమెజాన్ ఇండియా వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-
బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, నేషనల్ హాకర్స్ ఫెడరేషన్‌తో సహా మూడు కార్మిక సంఘాలు తమ అధికారిక నివేదికలలో పేర్కొన్నాయి.

తెలంగాణలో గణాంకాలు ఇలా..
2024లో తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, హీట్‌వాచ్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం…51.81 శాతం మంది పనిచేస్తున్నప్పుడు వడదెబ్బకు గురయ్యారు. 18.07 శాతం మంది ఎండదెబ్బ, ఇతర చర్మ సమస్యలను ఎదుర్కొన్నారు. 27 శాతం మంది డీహైడ్రేషన్ లక్షణాలను అనుభవించారు. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న 2019 వడగాలుల మార్గదర్శకాలలోని లోపాలను కార్మిక సంఘాలు, లాభాపేక్షలేని సంస్థలు, కార్మిక హక్కుల పరిశోధకులు ఎత్తి చూపిన తర్వాత, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తన 2025 సలహా పత్రాన్ని ప్రచురించింది. ఆ మార్గదర్శకాలు ఎక్కువగా నీడ, నీరు అందించడం వంటి తాత్కాలిక చర్యలను మాత్రమే సూచించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -