కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ భవిష్యత్‌ అంధకారమే

– బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మొద్దు
– దేశానికి రోల్‌ మోడల్‌ తెలంగాణ
– మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌, పోచంపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలను కార్యకర్తలతో కలిసి వారు ఉత్సాహంగా నిర్వహించారు. బొమ్మకల్‌, చిట్యాల, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం గ్రామాల ఎంపీటీసీల పరిధిలోని కార్యకర్తలతో మంత్రి ఫోటోలు దిగి, ఆయా గ్రామాల్లోని అభివద్ధి పనులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 75 ఏళ్ల కాంగ్రెస్‌, ప్రస్తుత బీజేపీ కేంద్ర పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మాయ మాటలు నమ్మొద్దని హితవు పలికారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు త్రాగు నీరు, సాగు నీరు కోసం హరి గోసపడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి దాఖలాలు లేవని, ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకంతో త్రాగునీరు అందిస్తూ, కాళేశ్వరంతో గ్రామాల్లోని చెరువులు నింపి, రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి, కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన కేసీఆర్‌ ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల నష్టంతో వడ్లు కొంటున్నామని స్పష్టం చేశారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పున చెల్లిస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3 వేలు కూడా నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వాలు, మన రాష్ట్రంలో 20 నష్టపరిహారం ఇవ్వాలని ఆయా పార్టీల నాయకులు అడగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కేసీఆర్‌ పాలనలోనే భూముల విలువ అమాంతం పెరిగిందన్నారు. ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ, ఒక్కోక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ, కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిస్తుందన్నారు. మహిళల ఆర్థిక అభివద్ధికి ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి తండా నుండి 50, గ్రామం నుండి 100 మంది చొప్పున మహిళలకు టెక్స్టైల్స్‌ రంగంలో శిక్షణ ఇచ్చి, ఉపాధిిిి కల్పించనున్నట్లు తెలిపారు. సంవత్సరంలోగా రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, అందుకోసం దశల వారీగా రూ. 3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలుస్తున్నాయనిఅన్నారు. రైతులు 24 గంటల ఉచిత విద్యుత్తు కోసం రూ. 10 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 63 లక్షల మంది రైతులకు బంధు కోసం రూ. 60 వేల కోట్ల వెచ్చిస్తుందని తెలిపారు. పస, పని, సత్తా లేని కాంగ్రెస్‌, బీజేపీ సన్యాసులు చౌకబారు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్‌ పథకాలకు ధీటుగా అమలైతే చెప్పండి, వెంటనే వాటిని మన రాష్ట్రంలో సైతం అమలు చేస్తామని సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, అభివద్ధిని బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. ఎర్రబెల్లి రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాడని ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును కార్యకర్తలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్పర్సన్‌ ఉషాదయాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పిటిసి శ్రీరామ్‌ జ్యోతిర్మయి సుధీర్‌ెెె, వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, వైస్‌ ఎంపీపీ కల్పన, నాయకులు శ్రీరామ్‌ సంజయ్‌ కుమార్‌, ముత్తినేని శ్రీనివాస్‌, జాటోత్‌ నెహ్రూ నాయక్‌, కేతిరెడ్డి సోమ నరసింహారెడ్డి, ఏదునూరి శ్రీనివాస్‌, బానోత్‌ రవీందర్‌ నాయక్‌, బానోత్‌ సోమన్న, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love