మహిళలు మొక్కల సంరక్షణ తమ బాధ్యతగా భావించాలి

–  డిఆర్ డిఓ, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ 
– ఇంటింటికి మొక్కల పంపిణీ 
నవతెలంగాణ కమ్మర్ పల్లి
మహిళలు మొక్కలను నాటి సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని డిఆర్ డిఓ, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ అన్నారు.  బుధవారం మండలంలోని ఉప్లూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మహిళా సంఘాల సభ్యుల ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా  మహిళ సంఘాల  సభ్యులకు ఒక్కొక్కరికి మూడు నుండి ఐదు  మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా డిఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్  మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కనీసం మూడు మొక్కలనైనా నాటాలన్నారు.నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంటి ఆవరణలో మొక్కలను పెంచడం ద్వారా ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. అనంతరం బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించి, వారిలో పోటీ తత్వాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు ఆయన మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం సందర్శించి పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో సిద్ధం చేస్తున్న మొక్కల వివరాలను ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రమా ను అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదానంద్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ మైలారం గంగాధర్,  ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి నరేందర్,  ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మారుతీ, ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి, సెర్ప్ సీసీలు, గ్రామ మహిళ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love