Friday, May 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేటగిరీలుగా కార్మికులు

కేటగిరీలుగా కార్మికులు

- Advertisement -

అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా విభ‌జ‌న
​కోటి 11 లక్ష‍ల మందికి మేలు
జూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమ‌లు : విలేక‌ర్ల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డి

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
కార్మికుల కనీస వేతనాలపై త‌మ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కార్మికుల‌ను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే నాలుగు కేట‌గిరీలుగా విభ‌జించామ‌ని తెలిపారు. త‌ద్వారా మొత్తం కోటి 11 లక్ష‍ల మందికి ల‌బ్ది చేకూర‌నుంద‌ని చెప్పారు. జూన్ 1 నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల‌వుతుంద‌ని వివ‌రించారు. గురువారం హైద‌రాబాద్‌లోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో కార్మిక‌శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామితో క‌లిసి సీఎం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో క‌నీస వేత‌నాల విష‌యంలో రాష్ట్రంలోని కార్మికులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని అన్నారు. అందుకే త‌మ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింద‌ని గుర్తు చేశారు. ఆ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై చ‌ర్చించిన ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలోని జోన్లను మూడు భాగాలుగా విభ‌జించామ‌ని తెలిపారు. జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2లో మున్సిపాలిటీలు, జోన్-3లో గ్రామీణ ప్రాంతాలను తీసుకుని కనీస వేతనాల‌ను నిర్ణయించామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్టమొద‌టిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న గొప్ప నిర్ణ‌యం ఇద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌ను గాలికొదిలేసింద‌ని విమ‌ర్శించారు. కానీ త‌మ ప్ర‌భుత్వం బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పారు. కార్మిక నాయకుడైన వెంక‌ట‌స్వామి వార‌సుడిగా మంత్రి వివేక్ మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. అమెరికా ఆలోచ‌న‌ను వీడండి… రాష్ట్రంలోని యువ‌త‌కు సీఎం ఈ సంద‌ర్భంగా ఓ సూచ‌న చేశారు. ఐటీ రంగంలో ఉండాలి, అమెరికా వెళ్లాల‌నే ఆలోచ‌న‌ల‌ను విర‌మించుకోవాల‌ని కోరారు. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థమ‌ని వ్యాఖ్యానించారు. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకోస‌మే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, యువతను ప్రోత్సహిస్తోంద‌ని తెలిపారు.

​బీజేపీది రాజ‌కీయ కోణం…
ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం రాజ‌కీయ కోణంలోనే చూస్తోంద‌ని సీఎం విమ‌ర్శించారు. అంతేత‌ప్ప వాటి ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించ‌టం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే ఎన్నికలు కాగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ త‌మ ప్రభుత్వం ప్రతీ అంశాన్ని దీర్ఘకాలిక దృష్టితోనే చూస్తోంద‌ని చెప్పారు. అందుకే కార్మికుల కనీస వేతనం పెంపు పై నిర్ణయం తీసుకున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందని చెప్పారు. మిగ‌తా ధాన్యాన్ని కూడా త్వ‌ర‌లోనే కొనుగోలు చేస్తామ‌ని హామీనిచ్చారు.

​బీఆర్ఎస్ వి శ‌వ‌రాజ‌కీయాలు
ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని సీఎం రేవంత్‌‌రెడ్డి విమ‌ర్శించారు. ఆ పార్టీ నేత‌లు మానవ‌త్వం మ‌రిచిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ శ‌వ రాజ‌కీయాలు చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా? అని ప్ర‌శ్నించారు. రైతులపై ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల‌ని అన్నారు. పోక్సో కేసులో ఏదో సాధించినట్టు బీఆర్ఎస్ నేత‌లు శాడిస్టుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిపడ్డారు. ఆ కేసులో బండి భగీరథ్ ను పోలీసులే అరెస్టు చేశారని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని తానే అప్ప‌గించాన‌ని చెబుతున్నారు.. కానీ ఇంట్లోనే ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్రశ్నించారు. ఇలాంటి వాస్త‌వాల‌ను ప‌క్క‌న‌బెట్టిన బీఆర్ఎస్ నేత‌లు అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి త‌ప్ప దిగజారి ప్రవర్తించొద్దని హిత‌వు ప‌లికారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినప్ప‌టికీ నోటీసులు ఇచ్చిన త‌ర్వాతే విచార‌ణ చేప‌ట్టామ‌ని తెలిపారు. బండి భగీరథ్ విషయంలోనూ ఇలాగే వ్య‌వ‌హ‌రించామ‌ని చెప్పారు. పోక్సో కేసులో పోలీసులు ప్రొసీజర్ ప్రకారమే వ్యవహరిస్తున్నారని స్ప‌ష్టం చేశారు.

ఇంకా క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగంలోనే ఉన్నారా?
మాజీ మంత్రి కేటీఆర్ తాను ఇంకా క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగంలోనే ఉన్నట్టు భ్ర‌మ ప‌డుతున్నార‌ని సీఎం ఎద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రి కుర్చీ నుంచి కేసీఆర్ దిగిపోయి చాలా రోజులైంద‌ని ఎద్దేవా చేశారు. త‌న పార్టీ మీటింగ్ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్.. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదని నిల‌దీశారు.

​సుప్రీం తీర్పును స్వాగ‌తిస్తున్నాం…
కులగణన విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణయాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కూడా సమర్ధించడం త‌మ‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్రంలో జనగణనతోపాటు కులగణనను చేప‌ట్ట‌డమేగాక అన్ని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందుంచామ‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింద‌న్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా తక్షణమే జనగణనలో కులగణన చేర్చ‌టం ద్వారా బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాల‌ని డిమాండ్చే చెశారు.​

ప్రభుత్వం ప్ర‌క‌టించిన క‌నీస వేత‌నాల పెంపుద‌ల ఇలా

1జోన్ 1 లో అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం ప్రస్తుతం రూ.12,750 నుంచి రూ.16 వేలు, సెమీ స్కిల్డ్ రూ.13,152 నుంచి రూ.17 వేలు, స్కిల్డ్ రూ.13,772 నుంచి రూ.18,500, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచారు.

2 జోన్ 2 లో అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం రూ.12,470 నుంచి రూ.15 వేలకు, సెమీ స్కిల్డ్ రూ.13,152 నుంచి రూ.16 వేలకు, స్కిల్డ్ రూ.13,772 నుంచి రూ.17,500, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.19 వేలకు పెంచారు.

3 జోన్ 3 లో అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం రూ.14 వేలు, సెమీ స్కిల్డ్ కు రూ.15 వేలు, స్కిల్డ్ కు రూ.16,500, హైలీ స్కిల్డ్ రూ.18 వేలకు పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -