తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఆదర్శం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ప్రపంచ బ్యాంకు గుర్తింపే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం ప్రపంచానికి ఆదర్శమని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణను ‘ఎగువ మధ్య-ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంకు గుర్తించిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.19 లక్షల (5,407 అమెరికన్ డాలర్లు) తలసరి ఆదాయంతో తెలంగాణ ఆ కేటగిరీలో చేరిందని వివరించారు. ఈ మైలురాయిని సాధించిన ఐదు భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అసాధారణ ఆర్థిక పరివర్తనకు ఈ విశేష విజయమే అద్దం పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, కేవలం పదేండ్ల వ్యవధిలోనే తన ఆర్థిక తలరాతను తిరగరాసుకుని భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని గుర్తు చేశారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా సుదీర్ఘకాలం పాటు అనుకూలతలు ఉన్న ఇతర రాష్ట్రాల వలె కాకుండా, దార్శనిక నాయకత్వం, సాహసోపేతమైన సంస్కరణలు, వినూత్న పాలన ద్వారానే తెలంగాణ ఈ మైలురాయిని చేరుకుందని వివరించారు. పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి అపూర్వమైన పెట్టుబడులను ఆకర్షించిన టీఎస్-ఐపాస్‌తోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు, మెరుగైన ఉపాధికి బలమైన పునాది వేశాయని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణను దివాళా తీసిన రాష్ట్రంగా చిత్రించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ పదేపదే తప్పుడు చిత్రాన్ని చూపేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్థిక సూచీల సాక్షిగా పూర్తిగా బట్టబయలు అయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించబడిన బలమైన ఆర్థిక పునాదిపై నిర్మితమైన తెలంగాణ అని ప్రపంచ బ్యాంకు గుర్తింపుతో మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు.
కేసీఆర్ దార్శనికతకు ప్రపంచబ్యాంకు గుర్తింపే నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



