గత ఇరవై సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం లకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేస్తూ 48 గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలంగాణ వైధ్యరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటి ఆధ్వర్యంలో గురువారం ధర్నాను ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏఎంఎం ల రాత పరీక్ష హాల్ టికెట్ లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో చేసిన సమ్మె సమయంలో ఏఎన్ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు రాత పరీక్షను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అక్కడి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకోగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోలనకరులను సముదాయించే ప్రయత్నం చేయగా… వారి సమస్యలను పోలీసులతో ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఏఎన్ఏంలు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నప్పటికీ రాత పరీక్షా హాల్ టికెట్ లను విడుదల చేయడం దారుణమని అన్నారు. తమ ఇరవై సంవత్సరాల సర్వీసును గుర్తించి ప్రభుత్వం క్రమబద్దీకరించాలని కోరారు. తాము 48 గంటల ధర్నా చేస్తున్న సమయంలోనే హాల్ టికెట్లను విడుదల చేశారన్నారు. ప్రతినిత్యం పనిలో గడిపే తమతో పరీక్షలు రాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రాత పరీక్షను రద్దు చేసి ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కమిటి కన్వినర్ నవీన్ కుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, స్వామి, ఏఎన్ఎం లు పుష్ప, ఆనంద బాయ్, పద్మ, తులసి, లలిత, మనీలత, ప్రియదర్శిని, అనురాధ పాల్గొన్నారు.