నవతెలంగాణ – మిడ్జిల్ : తెలంగాణ రక్షణ సేన పార్టీ జడ్చర్ల నియోజకవర్గం ఇన్చార్జిగామండలంలోని వాడ్యాల్ గ్రామానికి చెందిన ఎల్లయ్య యాదవ్ ను తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి నియామక పత్రాన్ని అందజేసినట్లు ఎల్లయ్య యాదవ్ చెప్పారు. గురువారం మండల కేంద్రంలో నవ తెలంగాణతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గుర్తించి బాధ్యతలు అప్పజెప్పినందుకు కవితకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గ్రామ గ్రామాన తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కష్టపడి పని చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా , కార్యకర్తలను తయారు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గ్రామాలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే చందంగా అభివృద్ధికి గ్రామాలు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించినందుకే అధికారం కోల్పోయిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అధికారమే లక్ష్యంగా కష్టపడి పని టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ బీసీల సమస్యల కోసం పోరాటంతో పాటు బీసీల అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ మరియు నియోజకవర్గ ఇన్చార్జి గా నా పై నమ్మకం తొ నియమించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క కు ధన్యవాదాలు తెలిపారు.



