నువ్వు మారాలి మిత్రమా..!!

You need to change my friend..!!నీలో మార్పు నీలో చేర్పు
రెండింటిలో చైతన్యం నింపాలి
సహనంతో సావాసం చేస్తూ
సహవాసంలో మంచిని కోరుతూ
సాహసమే జీవిత పాఠమై
పదుగురిలో పైచేయిగా వుండాలి
మారని తలంపు – తెరవని తలుపు
కరగని మనసు – ఊహించని మలుపు
ఇవి మాలినవే ఇక మారనివే
చేతనైతే వదిలించు, చేరువైతే విదిలించు
పగ పలకరించదు – సెగ కనికరించదు
కాలంతో కలిసి వెళ్ళుతూ
మమకారంతో కలుపుకుపోతూ
మానవత్వానికి ప్రణమిల్లి సాగిపో
ఎత్తుల పొత్తులు – గెంతుల వింతలు
మత్తుల జిత్తులు – కేరింతల కోతలు
వంతెన తెగిన వ్యసనపు దారులలో
పరుగులు పెడుతూ వెళ్ళకు
నీటి బుడగపై ఆశల ప్రయాణం
కడవరకు సాగించలేవు
మెత్తగ చేరి – కత్తులు నూరి
మక్కువ చూపి – పక్కన దూరి
జిమ్మిక్కులు చేస్తూ – హత్తుకు తిరిగి
లోలోపలికి నెట్టే మనుషుల మర్మం
తెలిసి నడుచుకో తోడు మలుచుకో
వెనుక గోతులు తీసే మనుషుల్ని
కదిలించక – వదిలించుకో
కనిపించక – మాన్పించుకో
అలవాట్లుతో కలవరపాట్లు
ఏమరపాటుతో ఎన్నో అగచాట్లు
మిడిసి పాట్లు – దుడుకు పాట్లు
మంచికి కాట్లు – నీతికి తూట్లు
ఈ మాయలో మునకలేయకు
అపాయంతో చేతులు కలుపకు
ఆప్యాయతలేని బంధం వద్దు
ఆదుకోలేని మిత్రత్వం వద్దు
కలసి నడవని నమ్మకం వద్దు
సహనం లేని తావాసం వద్దు
మమతకు – మానవతకు
సమతకు – సమభావనకు
పట్టంగట్టే పనిలో వుండు
కుతంత్రాన్ని కూకటి వేళ్లతో పెకిలించు
స్వేచ్ఛాయుతగా కలకాలం జీవించు
మానవతకు దాసోహం అవుతూ
సమానత్వపు బాటలో సాగిపో
నువ్వు మారాలి మిత్రమా
మార్పులోనే మంచికి చేదోడుగా
ఎల్లకాలం అండగా నిలవాలి మిత్రమా
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636

Spread the love