Sunday, June 14, 2026
E-PAPER
Homeమానవిడబ్బు విలువ చెప్పాలి

డబ్బు విలువ చెప్పాలి

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు, ఎండలు కొంచం తగ్గాయి, మొన్న వర్షం పడింది అన్నావు, మంచిదే ఎలాగూ వర్ష కాలం వచ్చేస్తోంది. ఇక్కడ కూడా మొన్న సాయంత్రం వర్షం బాగా పడింది. ఆ వర్షానికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని కొమ్మలు నిలిపివున్న కార్ల మీద పడటంతో కార్ల అద్దాలు పగిలి పోయాయి. కరెంట్ తీగలు తెగి రోడ్ల మీద పడ్డాయి, చాలా సేపు కరెంట్ పోయింది. నానా భీభత్సం. పోలీసులు, ట్రాఫిక్ మళ్లింపులు ఎన్నో జరిగాయి, ఆ ఒక్క వర్షంతో… సరే నాన్న పిల్లల పెంపకం గురించి చెప్తున్నా కదా! ఈ వారం ఉత్తరంలో కూడా వారికి చెప్పవలసినవి ఏమిటో, ఎలా చెప్పాలో వివరంగా చెప్తాను. నాన్న! పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ చెప్పానుకదా, వారికి స్నేహితులు ఏర్పడతారు. సహ విద్యార్థులతోనే స్నేహం ఎక్కువగా ఉంటుంది. ఇంటి దగ్గర వారి స్నేహం వేరు. దాన్ని కుటుంబ స్నేహం అంటారు. ఈ పిల్లలు కొంచం పెద్దయ్యాక అంటే సుమారు 13 నుండి 15 ఏండ్ల వరకు పిల్లల గురించి నేను ముందుగా చెప్పదల్చుకున్నాను. స్నేహితులు కలిసి ఏదైనా సినిమాకు వెళ్తామంటారు. సినిమాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతారు. లేదా స్నేహితుల పుట్టినరోజని పార్టీ చేసుకుంటున్నాం అంటారు. ఇటువంటప్పుడు సినిమాకి ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏ సినిమాకి వెళ్తున్నారు, ఆ సినిమా ఏ హాల్ లో నడుస్తోంది.

ఈ వివరాలు తెలుసుకుని వారికి టికెట్ కి సరిపడా డబ్బులు ఇస్తూ పై ఖర్చుల కింద కొంత తక్కువగానే డబ్బులు ఇచ్చి, అనవసరంగా ఖర్చు పెట్టవద్దని, ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చాయో చెప్పాలి. అలాగే స్నేహితుల పుట్టినరోజైనా కూడా ఏ స్నేహితులు, ఎక్కడ ఉంటారు, పార్టీ ఎక్కడ చేసుకుంటున్నారో తెలుసుకోవాలి. ఒక వేళ ఇంట్లోనే అయితే పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి పర్వాలేదు. అదే బైట అయితే వాళ్ళు ఎటువంటి పార్టీ చేసుకుంటున్నారో తెలుసుకోవాలి. అక్కడ కూడా బహుమతి కోసం డబ్బులు అడుగుతారు. ఏదైనా సరే పిల్లలకు డబ్బులు ఇచ్చే ముందు వారు అడిగినంత ఒక్కోసారి ఇవ్వాల్సి వచ్చినా, జాగ్రత్తలు చెప్తూ ఇవ్వడం, దుబారా చేయ వద్దని చెప్పడం వంటివి ఒకటికి రెండు సార్లు చెప్పాలి. పిల్లల సరదాలు చిన్నవే కావొచ్చు, అవి తీర్చగలిగినవే కావొచ్చు, కానీ డబ్బుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త, నిక్కచ్చి రెండూ అవసరం. పిల్లలను అప్పుడప్పుడు దేనికి ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అనేవి అడగాలి. దీనివల్ల వారికి ఒక భయం ఉంటుంది.

అనవసర ఖర్చు పెడితే ఇంట్లో కొప్పడతారు, కాబట్టి ఏది అవసరమో అదే తీసుకోవాలని అర్థమవుతుంది. అలా అని ఎప్పుడూ పిల్లలను కొప్పుడుతూ, కసురుకుంటూ ఉండకూడదు. వారికి ప్రేమతో, అర్ధం అయ్యేలా చెప్పాలి. నువ్వు చిన్నప్పటి నుండీ స్నేహితుల పుట్టినరోజులకు బహుమతి తీసుకుంటే అమ్మా.. ఫలానా బహుమతి కొన్నాము, ఒక్కొరికి ఇంత అయింది అని వివరంగా చెప్పేదానివి. లేదా నువ్వు ఏం కొనాలనుకున్నావో చెప్పేదానివి. నువ్వు ఏనాడు అనవసరంగా ఖర్చు చేయలేదు. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాను. నువ్వు తీసుకునే జాగ్రత్త గమనించాను. ఇప్పుడు సంపాదిస్తున్నా కూడా చాలా జాగ్రత్తగానే ఖర్చు పెడుతున్నావు. చాలా సంతోషం. ఎప్పుడూ డబ్బు దుబారా చేయవద్దు నాన్న. అయితే ఖర్చు పెట్టాల్సిన చోట, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు గురించి ఆలోచించకూడదు నాన్న. సరే ఉంటాను, వచ్చే ఉత్తరంలో డబ్బు వల్ల వచ్చే అనర్ధాల గురించి చెప్తాను.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -